Monday, October 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచికాగోకు జాతీయ గార్డ్‌ దళాలు

చికాగోకు జాతీయ గార్డ్‌ దళాలు

- Advertisement -

అనుమతించిన ట్రంప్‌
నేరాలు అదుపు తప్పాయని ఆరోపణ
డెమోక్రాట్ల పాలనలోని రాష్ట్రాలే లక్ష్యంగా సైన్యం తరలింపు

వాషింగ్టన్‌ : చికాగోలో నేరాలు అదుపు తప్పుతున్నాయని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అక్కడ 300 జాతీయ గార్డ్‌ దళాలను మోహరించేందుకు అనుమతించారు. డెమోక్రాట్ల పాలనలో ఉన్న చికాగో నగరంలో తాము నిరసనలను ఎదుర్కొంటున్నామని, తమ వాహనాల పైకి ఓ సాయుధ మహిళ సహా పలువురి కార్లు దూసుకొచ్చాయని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపిన కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్‌ ఈ చర్య తీసుకున్నారు. తన కారుతో ఇమ్మిగ్రేషన్‌ అధికారుల వాహనం పైకి దూసుకొచ్చిన మహిళను సరిహద్దు గస్తీ సిబ్బంది కాల్చి చంపారు. ఆ మహిళ ఎవరైనదీ తెలియరాలేదు. కాగా దళాలను మోహరించాలన్న ట్రంప్‌ ఆలోచనను రాష్ట్ర, స్థానిక అధికారులు అనేక వారాలుగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది అధికార దుర్వినియోగమేనని వారు ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించడానికి ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని ఇల్లినాయిస్‌ గవర్నర్‌ జేబీ ప్రిజ్‌కర్‌ విమర్శించారు. అమెరికాలోని ఒరెగాన్‌ నగరంలో కూడా 200 దళాలను మోహరించాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే పోర్ట్‌ల్యాండ్‌లోని ఫెడరల్‌ జడ్జి ఒకరు దీనికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. ప్రభుత్వ చర్య రాజ్యాంగ ఉల్లంఘనేనని న్యాయమూర్తి కరిన్‌ ఇమ్మర్‌గట్‌ తెలిపారు. అల్లర్లను అదుపు చేయడానికి ఒరెగాన్‌ రాష్ట్ర అనుమతి లేకుండా సైన్యాన్ని పంపడం రాష్ట్ర సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ఈ చర్య నగరంలో ఉద్రిక్తతలను పెంచుతుందని, నిరసనలు మరింతగా ప్రబలుతాయని అన్నారు. ట్రంప్‌ ఆదేశాల మేరకు జాతీయ గార్డ్‌ దళాలు చికాగోకు చేరుకున్నదీ లేనిదీ తెలియడం లేదు. అయితే ఒకవేళ అవి చేరుకుంటే మాత్రం న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశాలు ఉన్నాయి. డెమొక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలు, నగరాలలో శాంతి భద్రతల పరిరక్షణ పేరిట దళాలను మోహరించడం కొత్తేమీ కాదు. వాషింగ్టన్‌, లాస్‌ ఏంజెల్స్‌, మెంఫిస్‌, పోర్ట్‌ల్యాండ్‌కు గతంలో దళాలను పంపడం జరిగింది. జాతీయ గార్డ్‌ దళాలను సాధారణంగా సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ పంపుతారు. సైన్యాన్ని మోహరించడానికి ప్రభుత్వానికి చట్టంలో అనేక పరిమితులు ఉన్నాయి. అయితే ట్రంప్‌ వీటిని ఖాతరు చేయడం లేదు. నగరంలో ఇమ్మిగ్రేషన్‌ను అమలు చేయడంపై చికాగోలో చాలా కాలంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -