Wednesday, October 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరుణసహిత బానిసత్వం

రుణసహిత బానిసత్వం

- Advertisement -

మన ఆర్థిక భద్రతకు ముప్పు నెమ్మదిగా ముంచుకొస్తున్నది. భారతదేశం ఒకప్పుడు పొదుపుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతుండేది. మన పూర్వతరాలు ఆదాయం వచ్చిన వెంటనే అవసరాల కోసం కొంత సొమ్మును పక్కకుపెట్టి, మిగతా భాగాన్ని భవిష్యత్తు కోసం దాచేవారు. ఈ సంస్కృతి వలనే కుటుంబాలు అప్పులబారిన పడకుండా, కష్టకాలంలో సైతం నిలదొక్కుకునే శక్తిని కలిగి ఉండేవి. కానీ ప్రజలు చేతిలోలేని డబ్బును ఖర్చుచేస్తూ, భవిష్యత్తు భద్రతను తాకట్టు పెడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం క్రెడిట్‌ కార్డు సంస్కృతి. నేటి యువత క్రెడిట్‌ కార్డు ఉచ్చులో పడి, అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల దేశ బ్యాంకుల నివేదికల గణాంకాలను పరిశీలిస్తే గత ఆగస్టు నెలలోనే ఏడు లక్షల కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేశాయి. ప్రస్తుతం దేశంలో 11.23 కోట్ల యాక్టివ్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కాదని స్పష్టంగా చెప్పాలి. వాస్తవానికి ఇది ఫైనాన్షియల్‌ డిస్ట్రక్షన్‌. క్రెడిట్‌ కార్డులు, ఈజీ ఈఎంఐ పద్ధతులు, ఒక పెద్ద ఆర్థిక వినాశనానికి పునాదులు.

పొదుపు నుండి అప్పుల వైపు అర్రులు చాచడం – ఒక ప్రమాదకర మార్పు అని చెప్పకతప్పదు. నేటితరం తమకు వచ్చే ఆదాయంలో పొదుపు పదిశాతం కన్నా తక్కువగా ఉంది. మిగతా అవసరాలకయ్యే ఖర్చులన్నీ అప్పు ఆధారితంగా సాగుతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. పొదుపు తగ్గితే పెట్టుబడులు తగ్గుతాయి. పెట్టుబడులు తగ్గితే ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభం తప్పదనే భయం ఉత్పన్నమవుతుంది. ఈ అప్పులు వ్యసనంగా మారి బ్యాంకులకు సంపదను చేకూరుస్తున్నాయి. వినియోగదారులను రుణగ్రస్తులుగా మారుస్తున్నాయి. క్రెడిట్‌ కార్డులు మనల్ని సంపన్నులుగా మార్చవు, అవి బ్యాంకులను సంపన్నులుగా చేస్తాయి. మీరు ఇప్పటికే ఖర్చుచేసిన డబ్బుకి, నెలకు 3నుంచి 4శాతం వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఏడాదికి ఇది 40 శాతం వరకూ చేరుతుంది.ప్రతి స్వైప్‌ ఒక బానిసత్వపు అడుగు అని గ్రహించాలి. ప్రతి ఈఎంఐ మీ భవిష్యత్తు ఆదాయానికి పెద్ద గండి అని గుర్తెరిగి మసలుకోవాలి.

రోజురోజుకూ ఈ అప్పుల భారం ఎందుకు పెరుగుతోంది? మార్కెటింగ్‌ మాయాజాలంలోని మర్మం ”సులభ వాయిదాలు” అనే పదం వెనుక భయంకరంగా ”నిజమైనఖర్చు” దాగి ఉంటుంది. అది మన ఆర్థిక క్రమశిక్షణను, విచక్షణారాహిత్యంగా కబళిస్తుంది. ఇటువంటి అప్పుల వలలో చిక్కుకోవడానికి ఆర్థిక అవగాహనాలోపం కూడా ఒక కారణం. రుణాల అసలు లెక్కలు, వడ్డీ శాతం చాలా మందికి తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం లేకపోవడమే బ్యాంకుల పాలిట వరమవుతుంది. అంతేకాకుండా నేడు అనుసరిస్తున్న ఆధునిక జీవన విధానం, సామాజిక ఒత్తిడి , పక్కవారి జీవనశైలిని అనుకరించాలనే కోరిక, సోషల్‌ మీడియా ప్రభావాలు మనల్ని మరింత అప్పుల్లోకి నెడుతున్నాయి. మంచి జీవితం కావాలని కోరుకోవడం తప్పుకాదు.కానీ, భవిష్యత్తును తాకట్టుపెట్టి, నేడు వినోదం పొందాలనే దారుణ అలవాటును ఆహ్వానించడం సరికాదు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి నుండి బయట పడాలంటే వ్యక్తిగత స్థాయిలోనే మనం సంపాదించిన సొమ్మును సక్రమంగా ప్లాన్‌ చేయాలి. అప్పుడు ఆదాయం నుండి కనీసం ఇరవైశాతం పొదుపు తప్పనిసరిగా నిబంధనను విధించుకోవాలి. మనకు ఏ విధమైన ఆపదలు సంభవించిన ”సత్వర సహాయ నిధి” ఏర్పాటుచేసుకోవాలి. మనం ఏదైనాకొనే ముందు వాస్తవ అవసరమా లేక తాత్కాలిక అవసరమా! తరచి ఆలోచించిన తర్వాతే కొనుగోలు చేయాలి.

సామాజికస్థాయిలో పాఠశాలల నుంచే ఆర్థికవిద్యను, ఆర్థిక క్రమశిక్షణ అవసరమనే పరిజ్ఞానాన్ని అందించాలి.” నోకాస్ట్‌-నో ఈఎంఐ” వంటి మోసపూరిత ప్రకటనలపై కఠినమైన నియంత్రణ అవసరం. అలాగే ప్రజల కొనుగోలుశక్తి పెంచే మార్గాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి.ఆ తర్వాత వారు క్రెడిట్‌కార్డులతో కాకుండా సొంతంగానే ఖర్చు చేసే శక్తిని పొందుతారు. అంతకన్నా ముందు పొదుపుల ప్రాధాన్యంపై అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలి. భారత యువత భవిష్యత్తు అప్పుల్లో కాదు, పొదుపుల్లో ఉంది. లైఫ్‌స్టైల్‌ కన్నా లైఫ్‌ సెక్యూరిటీ ముఖ్యమనే భావనను ప్రతిఒక్కరి మెదళ్లలోకి ఎక్కించాలి. ఆర్థిక క్రమశిక్షణే మనకు నిజమైన స్వాతంత్య్రం ఇస్తుంది. ఈ రోజు అజాగ్రత్తగా తీసుకున్న రుణం, రేపటి ఆర్థిక బానిసత్వానికి దారితీస్తుంది. పొదుపే మన బలం, అప్పు మన బలహీనతగా మారకుండా జాగ్రత్త వహించాలి.

  • భక్తుల శ్రీహరి, 9494924924
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -