కొచ్చిపై కోల్‌కత ఘన విజయం
ప్రైమ్ వాలీబాల్ లీగ్ 4
నవతెలంగాణ- హైదరాబాద్
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ లో కోల్‌కత థండర్‌బోల్ట్స్ అదరగొట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కత థండర్‌బోల్ట్స్ 3-1 (12-15, 15-13, 15-6, 19-17)తో కొచ్చి బ్లూ స్పైకర్స్‌పై అద్భుత విజయం సాధించింది. సర్వ్, స్పైక్స్‌లో రెచ్చిపోయిన కోల్‌కత థండర్‌బోల్ట్స్ సీజన్లో బోణీ కొట్టింది. కోల్‌కత విజయంలో కీలక పాత్ర పోషించిన పంకజ్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కొచ్చి బ్లూ స్పైకర్స్ ఆటగాడు హేమంత్ పవర్‌ఫుల్ సర్వీసులతో మెరువగా ఆ జట్టు మ్యాచ్‌ను దూకుడుగా మొదలెట్టింది. ఇరు జట్ల డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో పాయింట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. కొచ్చి సెట్టర్ బైరాన్ తెలివైన పాస్‌లతో కోల్‌కతను ఒత్తిడిలోకి నెట్టి తొలి సెట్‌లో సొంతం చేసుకునేలా చేశాడు.
రెండో సెట్ నుంచి కోల్‌కత అసలు ఆట మొదలుపెట్టింది. కెప్టెన్ అశ్వల్ రారు, పంకజ్ శర్మ పదునైన స్పైక్‌లతో కొచ్చి కోర్టులో అలజడి సష్టించారు. అభిషేక్ సూపర్ సర్వ్‌తో ఆకట్టుకున్నా అనవసర తప్పిదాలు కొచ్చి జట్టుకు ప్రతికూలంగా మారాయి. కొచి తప్పిదాలను సొమ్ముచేసుకున్న కోల్‌కత రెండో సెట్‌ను ఖాతాలో వేసుకుంది. మూడో సెట్‌లో కోల్‌కత పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మిడిల్ జోన్‌లో మాటిన్ అద్భుతంగా రాణించడంతో కొచ్చి తేలిపోయింది. ఈ సెట్‌ను కోల్‌కతా 15-6తో సునాయాసంగా కైవసం చేసుకుంది. నాలుగో సెట్ నువ్వానేనా అన్నట్టు సాగింది. కొచ్చి చివరి వరకు పోరాడినప్పటికీ, కీలక సమయంలో మాటిన్ అద్భుతమైన బ్లాక్‌తో కోల్‌కతాకు 19-17తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా అందించాడు.