Wednesday, October 8, 2025
E-PAPER
Homeజాతీయంఅదానీ డిఫెన్స్‌ సుంకాల ఎగవేత

అదానీ డిఫెన్స్‌ సుంకాల ఎగవేత

- Advertisement -

కేంద్రానికి రూ.80 కోట్లు టోపీ
డీఆర్‌ఐ విచారణ

న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు గౌతం అదానీకి చెందిన అదానీ డిఫెన్స్‌ కేంద్ర ఖజానాకు టోపీ పెట్టినట్టు తెలుస్తోంది. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ రక్షణ విభాగం అయినటువంటి అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ 9 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.80 కోట్లు) సుంకాలు ఎగవేసినట్టు భారత డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) దృష్టికి వచ్చింది. క్షిపణి భాగాలపై సుమారు 9 మిలియన్‌ డాలర్ల దిగుమతి సుంకం ఎగవేత ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిందని రాయి టర్స్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇద్దరు ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు.. 2025 మార్చిలో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. షార్ట్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణి భాగాలను లాంగ్‌ రేంజ్‌ క్షిపణి భాగాలుగా తప్పుగా చూపించడం ద్వారా సుంకం ఎగవేసిందని ప్రధాన ఆరోపణ. లాంగ్‌ రేంజ్‌ క్షిపణి భాగాలకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఉండటంతో అదానీ డిఫెన్స్‌ ఈ మోసానికి పాల్పడింది. షార్ట్‌ రేంజ్‌ భాగాలపై 10 శాతం దిగుమతి సుంకం, 18 శాతం స్థానిక పన్ను అమల్లో ఉన్నాయి. ఈ తప్పుడు వర్గీకరణ వల్ల అదానీ డిఫెన్స్‌ ఈ పన్నులను తప్పించుకుందని అధికారులు పేర్కొన్నారు.

అదానీ డిఫెన్స్‌ భారత భద్రతా దళాల కోసం డ్రోన్లు, క్షిపణులు, చిన్న ఆయుధాలను సరఫరా చేస్తోంది. డీఆర్‌ఐ దర్యాప్తు సమ యంలో అదానీ ఎగ్జిక్యూటివ్‌లు తప్పుడు వర్గీకరణను అంగీకరించినట్టు ఒక అధికారి తెలిపారు. ఇటువంటి కేసుల్లో, కంపెనీలు చెల్లించని సుంకంతో పాటు 100 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల అదానీ డిఫెన్స్‌కు సుమారు 18 మిలియన్‌ డాలర్లు (రూ.160 కోట్లు) చెల్లించాల్సి రావొచ్చు. ఈ మొత్తం 2024-25లో కంపెనీ ఆదాయం 76 మిలియన్ల డాలర్లలోని 10 శాతం కంటే ఎక్కువ, లాభంలో సగం కంటే ఎక్కువగా ఉంటుంది. డీఆర్‌ఐ కస్టమ్స్‌ నిబంధనలపై స్పష్టీకరణ కోరామని అదానీ డిఫెన్స్‌ పేర్కొంది. తాము అవసరమైన పత్రాలను సమర్పించామని, తమ వైపు నుండి ఈ సమస్య పరిష్కా రమయ్యిందని తెలిపింది. అయితే సమస్య పరిష్కారం కోసం చెల్లింపులు జరిగాయా, లేదా అనే దానిపై స్పష్టతను ఇవ్వలేదు.

కస్టమ్స్‌ డేటా ప్రకారం.. అదానీ డిఫెన్స్‌ గత సంవత్సరం నుండి రష్యా నుండి 32 మిలియన్‌ డాలర్ల విలువైన క్షిపణి భాగాలను దిగుమతి చేసింది. 2024 జనవరి లో రష్యా, ఇజ్రాయెల్‌, కెనడా నుంచి రక్షణ సంబంధిత దిగుమతులు మొత్తం 70 మిలియన్లకు చేరాయి. సెప్టెంబర్‌ 2025లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నియమాల ప్రకారం.. అన్ని క్షిపణి భాగాలపై సుంకం మినహాయింపును ఇచ్చారు. అయితే గతంలో షార్ట్‌ రేంజ్‌ క్షిపణి భాగాలకు ఈ మినహాయింపు వర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు. అదానీ గ్రూపునకు ఇలాంటివి కొత్తేమి కాదు. అదానీ గ్రూప్‌ ఇటీవల రెండు స్టాక్‌ (షేర్ల) మోసాల ఆరోపణల కేసులలో భారత మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ నుంచి క్లియరెన్స్‌ పొందినప్పటికీ.. సెక్యూరిటీస్‌ నిబంధనలకు సంబంధించి డజనుకు పైగా ఇతర విచారణలను ఎదుర్కొంటోంది. 2014 నుంచి బొగ్గు దిగుమతులపై ఓవర్‌ ఇన్‌వాయిసింగ్‌ ఆరోపణలపై రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ విచారిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -