Wednesday, October 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకదిలిస్తే కన్నీరే

కదిలిస్తే కన్నీరే

- Advertisement -

సిగాచీ బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ
చనిపోయిన వారంతా ముప్పై ఏండ్ల లోపువారే
రోడ్డున పడ్డ కుటుంబాలు
మానవత్వం చూపని యాజమాన్యం
పరిహారం చెల్లింపులో తీవ్ర అలసత్వం
రెండు విడతల్లో రూ.25 లక్షలే చెల్లింపు
ఇంకా పెండింగ్‌లో రూ.75 లక్షల పరిహారం
అందని కేంద్ర ప్రభుత్వ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
వలస కార్మికుల కుటుంబాల అవస్థలు అన్నీఇన్నీకావు

చంటిబిడ్డను సంకలో ఎత్తుకుని కడుపునిండా బాధతో, అమాయకపు చూపులతో తిరుగుతున్న 22 ఏండ్ల యువతి… ‘నా కొడుకు చనిపోయాడు. ముగ్గురూ చిన్నపిల్లలే న్యాయం చేయండి’ అంటూ చేతిలో చనిపోయిన కుమారుడి ఫొటోను పట్టుకుని తిరుగుతున్న వృద్ధుడు.. ‘మా అల్లుడు దూరమైపోయిండు. పోయిన గంటలోపే చనిపోయిండు. కొద్దిసేపు ఆగినా బతికేటోడు’ అంటూ విలపిస్తున్న మహిళ…ఇవీ సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన వలస కార్మికుల కుటుంబీకుల వెతలు.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సిగాచి ప్రమాదం జరిగి వందరోజులు దాటినా ప్రభుత్వ, కంపెనీ పరిహారం అందకపోవడంతో ఆ అభాగ్యులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది. మంగళవారం హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌ ఎదుట ధర్నాలో ‘న్యాయం చేయండి’ అంటూ వారు వేడుకున్నారు. ఇది ఒక్కరిదో..ఇద్దరిదో కాదు..54 బాధిత కుటుంబాల కన్నీటి ఘోస. ఆ కార్మికుల కుటుంబాలను కదిలిస్తే చాలు కండ్లలో నుంచి కన్నీరు దుముకుతున్నది. వారి నోటి వెంట మాటలు కూడా రావట్లేదు. ఒక్కో కుటుంబానికి ఒక్కో గాథ. నిబంధనలకు విరుద్ధంగా పాత యంత్రాలను వాడి ఘటనకు కారణమైన యాజమాన్యం బాగానే ఉంది.. బాధిత కుటుంబాలే క్షోభ అనుభవిస్తున్నాయి. కానరాని రాజ్యంలో చంటిపిల్లలతో కొందరు…ఇంటిదగ్గర చిన్నపిల్లలను వదిలేసి వచ్చిన వారు మరికొందరు ఇక్కడ పడుతున్న వ్యథలు అన్నీఇన్నీ కావు. పాలకులు ఇప్పిస్తామన్న పరిహారం కోసం నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా పరిశ్రమ యాజమాన్యం మాత్రం మానవత్వం చూపడం లేదు. పరిహారం చెల్లింపులో తీవ్ర అలసత్వం చూపుతున్నది.

సెబీకి ఇచ్చిన నివేదికలో బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామనీ, వంద రోజుల పాటు స్టాక్‌ ఎక్సేంజ్‌ నుంచి తప్పుకుంటున్నామని లేఖ రాసిన యాజమాన్యం చేతల్లో మాత్రం ఆ మాట నిలుపుకోలేదు. ఒక్కో బాధిత కుటుంబానికి ఒకసారి పది లక్షల రూపాయలు, మరోసారి రూ.15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఇంకా రూ.75లక్షల పరిహారం గురించి మాట్లాడట్లేదు. జీవచ్ఛవంలా మారి కుటుంబాలకు భారమైన క్షతగాత్రుల్లో కొందరు రూ.10లక్షలు, మరికొందరికి రూ.5 లక్షలు, ఎక్కువ మందికి రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ నెరవేరలేదు. ఘటన జరిగిన రోజు మీడియా ముందు హడావిడి చేసిన బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పత్తాలేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ఇప్పిస్తామన్న హామీ అటకెక్కింది. నవతెలంగాణ పలుకరించిన బాధిత కుటుంబాలకు చెందిన ముగ్గురు కార్మికులు కూడా ఇంటర్‌ లోపు చదివిన వారే. సాధారణంగా ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్రీలో పీజీ చేసినవారితో ఆర్‌అండ్‌డీ, క్యూసీ విభాగాల్లో పని చేయించాలి. ఆ కంపెనీల్లోని రియాక్టర్ల వద్ద పని చేయాలంటే కెమిస్ట్రీ సబ్జెక్టు ఉండి డిగ్రీ చేసిన వారైనా ఉండాలి.

డ్రగ్స్‌ ఫార్ములా తెలిసిన వారైతే ఆ రూమ్‌ టెంపరేచర్‌, రియాక్టర్ల పనితీరు, డ్రగ్స్‌ తయారీలో లోపాలను గుర్తించగలుగుతారు. సిగాచి కంపెనీ మాత్రం తక్కువ వేతనాలతో ఇంటర్‌ లోపు చదివినవారితో పనిచేయించినట్టు స్పష్టమవుతున్నది. ఆ పరిశ్రమ లాభాల మీద దృష్టి పెట్టిందే తప్ప భద్రతా ప్రమాణాలు పట్టించు కోకపోవడం కూడా ఈ ఘటన కారణమని తేలింది. కంపెనీ డొల్లతనం అడుగడుగునా కనిపిస్తున్నా ఇప్పటి వరకూ కేసు నమోదు కాలేదని సీఐటీయూ నాయకులు చెబుతున్నారంటేనే యాజమాన్యానికి పాలకుల నుంచి ఏ స్థాయిలో అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ‘చనిపోయిన మా కుటుంబ సభ్యులెట్లాగూ తిరిగిరారు… చేస్తామన్న సహాయమైనా చేయండి’ అంటూ బాధిత కుటుంబ సభ్యులు పాశమైలారం ప్రాంతంలో మూడు నెలల నుంచి తిరుగుతున్నారు. అలా తిరుగుతున్న కుటుంబాల్లో ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి గాథ.

వాళ్లు దూరమయ్యారనే బాధతో క్షోభ అనుభవిస్తున్నాం
మా చెల్లి రమ్య, నిఖిల్‌ కొన్ని నెలల కిందనే పెండ్లి చేసుకున్నరు. ఆ కంపెనీలో జాయిన్‌ అయ్యి ఆరు నెలలే అవుతున్నది. ఇద్దరూ మంచిగా చదువుకున్నోళ్లు. ఎంతో భవిష్యత్తు ఉన్నోళ్లు. మా చెల్లి ఎన్నో కలలు కన్నది. వర్కింగ్‌ ప్లేస్‌లో సిగాచి కంపెనీ యాజమాన్యం కనీస భద్రత కల్పించలేదు. దీంతో మా మరిది, చెల్లెలు కండ్ల ముందు లేకుండా పోయారు. మా కుటుంబ సభ్యులు, నిఖిల్‌ కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు మాతో పాటు 54 కుటుంబాలు క్షోభ అనుభవిస్తు న్నాయి. కుటుంబ సభ్యులకు దూరమైతే కలిగే బాధేంటో కంపెనీ ఓనర్‌కు చూపెట్టాలి. కంపెనీ ఓనర్‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే తీవ్ర బాధలో ఉన్నాం. పరిహారం కోసం రోజూ తిరుగ లేకపోతున్నాం. త్వరగా మాకు న్యాయం చేయాలి.
జ్యోత్స్న, ఆంధ్రప్రదేశ్‌

మా అల్లుడు బూడిదైపోయిండు… ఎముకలు కూడా దొరకలేదు : సుజాత
కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ సమీపంలోని ఉత్తబాద్‌ నుంచి వలసొచ్చినం. జస్టిన్‌(21) మా తమ్ముడి కొడుకు. ఇంటర్‌ దాకా చదివి సిగాచీ కంపెనీలో పనికి కుదిరిండు. పనికిపోయిన కొద్దిసేపట్లోనే బూడిదైపోయిండు. ఎముకలు కూడా దొరకలేదు. మా అమ్మ మనువడి బట్టలు, పాత చెప్పుల్ని చూస్తూ ఏడ్వని రోజు లేదు. చెట్టంత కొడుకే పోయినంక నేనేందుకు అంటూ మా తమ్ముడు కుంగిపోయాడు. జస్టిన్‌పైనే మాటలు రాని చెల్లి, అక్క, తండ్రి, నానమ్మ ఆధారపడి బతుకుతున్నరు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినం. సర్కారు ఇప్పిస్తనన్న పరిహారం రాలేదు. మోడీసార్‌ ఇస్తమన్న పైసలు రాలేదు. పేదోళ్లం సార్‌ మాకు న్యాయం చేయండి.

ఏం అర్థమైతలేదు.. బతుకులు ఆగమయ్యాయి
మా ఆయన భీమ్‌రావు(24 ఏండ్లు) కంపెనీల చేరిన రెండు రోజులకే మాకు దూరమైపోయాడు. కంపెనీలోకి పోయిన గంటలోపే ప్రమాదంలో మరణించాడనే వార్తొచ్చింది. కొడుకు చనిపోయిండనే బాధతో మా అత్తమ్మ గుండెపోటుతో మాకు దూరమైంది. నేనేం చదువుకోలేదు. సంకలో 9 నెలల పసిగుడ్డు ఉంది. బతుకుదెరువు కోసం ఎన్నో ఆశలతో వచ్చినం. అంతా తలకిందులైంది. ఏం అర్థమైతలేదు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం.
సోనీ, మహారాష్ట్ర

పనిచేసే ఒక్కడు పోయిండు.. ముగ్గురు చిన్నపిల్లల్ని చూస్తుంటే హైరానా అవుతున్నది
శివాజీ కుమార్‌(30) ఒక్కడే కొడుకు. వాడికి మూడేండ్లు, నాలుగేండ్లు, ఐదేండ్ల ముగ్గురు చిన్న పిల్లలున్నరు. పనిచేసే ఆ ఒక్కడూ పోయిండు. తీవ్ర దు:ఖంలో ఉన్నాం. పనికోసమని ఇక్కడకొచ్చి మాకు దక్కకుండా పోయినప్పటి నుంచి తిరుగుతున్న. ఘటన జరిగి మూడు నెలలు దాటినా పరిహారం మొత్తం ఇవ్వలేదు. బీహార్‌ రాష్ట్రంలోని బబువా జిల్లా కర్జావ్‌ నుంచి వచ్చి ఈడనే ఉంటున్న. ఈడ లాల్‌జెండా వాళ్లు సహకరిస్తున్నారు.
సంభూబింద్‌, బీహార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -