రాజకీయ పార్టీల భేటీలో సీఈఓ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేశ్‌కుమార్ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్కరణలు తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఓటర్ల సౌకర్యం, పారదర్శకత, ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ”ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు. ఓటర్లు తమ అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈవీఎంలపై రంగు ఫోటోలు ఉంచడం. మహిళా ఓటింగ్ శాతం పెంచేందుకు మహిళా సిబ్బందిని అదనంగా నియమించడం, వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చెయిర్లు, ర్యాంపులు, పిక్-అప్/డ్రాప్ సదుపాయాలు, రియల్‌టైమ్ ఓటింగ్ టర్నౌట్ మానిటరింగ్ కోసం డిజిటల్ డ్యాష్‌బోర్డులు, మొబైల్ యాప్‌ల ఏర్పాటు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ. జీపీఎస్ ట్రాకింగ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘనలపై కఠిన చర్యలు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ. పేపర్ వినియోగం తగ్గించడం, డిజిటల్ సమాచార మార్పిడి ప్రోత్సాహం” మొదలగు కొత్త సంస్కరణలను పకడ్బందిగా అమలు చేయనున్నట్టు వారికి వివరించారు. ఈ సమావేశంలోకాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ తదితర పార్టీల ప్రతినిధులతో పాటు అదనపు సీఈవో లోకేష్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త సంస్కరణలు అమలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES