డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ
దీంతో మూడుకు చేరిన మందుల సంఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మరో రెండు దగ్గు మందులను నిషేధిస్తూ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ మందుల్లో కల్తీ జరిగినట్టు గుర్తించారు. వీటిని విక్రయించొద్దంటూ ఆదేశించారు. వీటిని గుజరాత్‌కు చెందిన షేప్ ఫార్మా ప్రయివేట్ లిమిటెడ్, రెడ్ నెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి. వీటి గడువు 2026 డిసెంబర్‌తో ముగియనున్నది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మరణించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ఆ మందును తెలంగాణలో నిషేధించారు. తాజా మందుల నిషేధంతో రాష్ట్రంలో నిషేధించిన దగ్గు మందుల సంఖ్య మూడుకు చేరింది.
చిన్నారుల మరణాలకు దారి తీస్తున్నట్టు ఆరోపణలున్న నిషేధిత మందులు విక్రయించకుండా క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలని షానవాజ్ ఖాసిం రాష్ట్రంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లను ఆదేశించారు. వెంటనే రిటైలర్లు, హౌల్ సేలర్లు, పంపిణీదారులు, ఆస్పత్రుల్లో నిల్వ ఉంచిన నిషేధిత మందులకు సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని పంపిణీ చేయకుండా, అమ్మకాలు జరపకుండా నిరోధించాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఎక్కడైనా ఈ మందులకు సంబంధించిన విక్రయాలు, ఇతర వ్యవహారాలు జరిగినట్టు అనుమానం వస్తే ప్రజలు పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 6969కు కాల్ చేసి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరో రెండు దగ్గు మందులపై నిషేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES