పర్యావరణ అనుమతులకు పాతర
అంబుజా సిమెంట్ ప్లాంట్‌పై నిరసనల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విధానపరమైన ఓ ప్రధాన మార్పును ప్రకటించింది. సొంత కాప్టివ్ ప్లాంట్లులేని సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలిపింది. ఈ సవరణకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయిలోని కల్యాణ్‌లో అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. గతంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇలాంటి ప్లాంట్లు ప్రారంభించాలంటే ప్రజలను సంప్రదించాల్సి ఉంటుంది. సవివరమైన పర్యావరణ ప్రభావ నివేదికను కూడా సమర్పించాలి. కొత్తగా అమలులోకి వచ్చే నిబంధనల ప్రకారం ఇవేవీ అవసరం లేదు.
ప్లాంటుపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపడానికి 60 రోజుల సమయం ఉంటుంది. అదానీ గ్రూపునకు అనుబంధ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్ రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఆరు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు నెలకొల్పాలని యోచిస్తోంది. అయితే పర్యావరణం, ఆరోగ్యంపై అవి చూపే తీవ్ర ప్రభావం గురించి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉండే కల్యాణ్‌లో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని వారు చెప్పారు. ఈ యూనిట్ల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రో జన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనోక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాల ప్రభావం వారిని కలవరపెడుతోంది. సమీపంలోని పదికి పైగా గ్రామాల ప్రజలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సంతకాల సేకరణ కూడా జరుపుతున్నారు.