ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరించాలి
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు
ఛలో బస్ భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత
పలువురు బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఛలో బస్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, సికింద్రాబాద్ రెతిఫైల్ బస్టాండ్ నుంచి బస్సు భవన్‌కు ఆర్టీసీ బస్సులో వచ్చారు. అలాగే, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, మెహిదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో బస్సు భవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావును ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దనే పోలీసులు నిలువరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో వారు నడుచుకుంటూ బస్ భవన్‌కు చేరుకొని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ ఛలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. మహిళలకు ఉచితమని చెప్పి పురుషులకు టికెట్ ధరలు పెంచారని విమర్శించారు. అదేవిధంగా విద్యార్థుల బస్‌పాస్ ధరలను పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ధరలు పెంచితే సామాన్య కుటుంబాలపై భారం పడదా అని ప్రశ్నించారు. ధరలు పెంచి మధ్యతరగతి కుటుంబాలను పీక్కుతింటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే పెంచిన బస్ చార్జీలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిరుపేదల నడ్డి విరుస్తూ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని నిరసన తెలుపుతుంటే తమ నేతలను అన్యాయంగా అరెస్టు చేశారని ఇది దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 20 నెలల పాలనలో ఐదు సార్లు బస్సు చార్జీలు పెంచారనీ, భార్యకు ఫ్రీ అని భర్తకు, పిల్లలకు టికెట్ రేటు డబుల్ చేశారని ఆరోపించారు. ఇప్పటికే జీవో నెంబర్ 53, 54తో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. ఇలా వాహనాల లైఫ్ ట్యాక్స్‌లు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి తలమానికంగా ఉన్న మెట్రో రైలును రేవంత్‌రెడ్డి సర్కారు ఆగం చేసిందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాసిందని, ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలన? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.