Friday, October 10, 2025
E-PAPER
Homeజాతీయంప్రపంచ సుస్థిరత, ఆర్థికాభివృద్ధికి పునాది

ప్రపంచ సుస్థిరత, ఆర్థికాభివృద్ధికి పునాది

- Advertisement -

భారత్‌-బ్రిటన్‌ భాగస్వామ్యంపై ప్రధాని మోడీ
స్టార్మర్‌తో భేటీ


ముంబయి : భారత్‌, బ్రిటన్‌ దేశాలు సహజ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ప్రపంచ సుస్థిరతకు, ఆర్థిక పురోభివృద్ధికి కీలకమైన పునాది వేసిందని చెప్పారు. మన దేశంలో పర్యటిస్తున్న బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ గురువారం ముంబయి చేరుకొని రాజ్‌భవన్‌కు వచ్చారు. అక్కడ ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం పలికి చర్చలు జరిపారు. ‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువల్లో మనకు పరస్పర విశ్వాసం ఉంది. అదే మన సంబంధాలకు పునాది. ఇండో-పసిఫిక్‌లో, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతపై అభిప్రాయాలను పంచుకున్నాము. అలాగే ఉక్రెయిన్‌లో జరుగు తున్న ఘర్షణ విషయంలో కూడా…ఉక్రెయిన్‌ ఘర్షణ, గాజా విషయంలో చర్చలు, దౌత్యం ద్వారా శాంతిని పునరుద్ధరించడానికి జరుగుతున్న అన్ని ప్రయత్నాలకూ భారత్‌ మద్దతు ఇస్తుంది’ అని మోడీ తెలిపారు.

ప్రపంచానికే ఊరట : గాజా ఒప్పందంపై స్టార్మర్‌
గాజాలో శాంతి ప్రణాళిక తొలి దశపై ఒప్పందం కుదరడం పట్ల స్టార్మర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రపంచానికి ఎంతో ఊరట ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బందీలు, వారి కుటుంబ సభ్యులు, గాజా ప్రజలు ఎంతో ఆనందిస్తారని చెప్పారు. ఈజిప్ట్‌, ఖతార్‌, టర్కీ, అమెరికా దేశాలు అవిశ్రాంతంగా చేసిన మధ్యవర్తిత్వ ప్రయోజనాలు చాలా గొప్పవని తెలిపారు. ప్రాణ రక్షక మానవతా సాయం రవాణాపై విధించిన అన్ని రకాల ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కోరారు. స్టార్మర్‌ నేతృత్వంలో వ్యాపారులు, విద్యావేత్తలు, సాంస్కృతిక నాయకులతో కూడిన 126 మంది సభ్యుల భారీ ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటిస్తోంది. భారత్‌ను ‘గ్లోబల్‌ ప్లేయర్‌’గా స్టార్మర్‌ అభివర్ణించారు. కామన్వెల్త్‌, జీ 20లో కలిసి కూర్చున్నామని గుర్తు చేస్తూ ఐరాస భద్రతా మండలిలో కూడా భారత్‌కు న్యాయమైన స్థానం దక్కాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.

ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. భారత్‌-బ్రిటన్‌ ఆర్థిక సంబంధాలు ‘మకుటంలో రత్నం’ వంటివని చెబుతూ ‘మేము భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. రెండు దేశాల మధ్య జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందపు సామర్ధ్యాన్ని రెట్టింపు చేయడానికి ఈ నా పర్యటన దోహద పడుతుంది’ అని అన్నారు. అందుకే రికార్డు స్థాయిలో వ్యాపారవేత్తలను తనతో తీసుకొచ్చానని తెలిపారు. సాంకేతిక భద్రతా చర్యలతో పాటు ఏఐ, ఆధునిక కమ్యూనికేషన్‌, రక్షణ సాంకేతికతలతో సహ కారాన్ని విస్తరించుకుంటామని చెప్పారు. సైనిక శిక్షణలో సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నామని మోడీ తెలిపారు. దీనికింద భారత వైమానికి దళానికి చెందిన ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లు బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో శిక్షకులుగా పనిచేస్తారని అన్నారు. భారత్‌లో క్యాంపస్‌లు ప్రారంభించాలని బ్రిటన్‌కు చెందిన తొమ్మిది విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -