Friday, October 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టేతో నిరాశ

స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టేతో నిరాశ

- Advertisement -

రిజర్వేషన్ల జాప్యానికి కేంద్రానిదే బాధ్యత : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్‌ 9, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడం తీవ్ర నిరాశకు గురి చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బీసీలకు పెంచిన రిజర్వేషన్‌ జాప్యం జరగడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ సహా అన్ని రాజకీయ పక్షాలూ బీసీ రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచే బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దాంతోపాటు రిజర్వేషన్‌ పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ కూడా ఉందని గుర్తు చేశారు. ఈ మూడింటినీ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు పంపినప్పటికీ, వాటిని కేంద్రానికి పంపితే అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లు నెలల తరబడి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నందునే స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడానికి కారణమైందని విమర్శించారు.

తొమ్మిదో షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ అవసరమేతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశ పర్చాలనీ, ఆ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ 50 శాతం పరిమితి పేరుతో ఏండ్ల తరబడి బీసీల రిజర్వేషన్‌ పెంపు అంశాన్ని నాన్చడం ఏ మాత్రం తగదని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటి పోయిందని గుర్తు చేశారు. హైకోర్టు స్టే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ చేపట్టాలని కోరారు. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితిలోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయొచ్చని తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని సూచించారు. దాని ఆధారంగా మార్చిలో శాసనసభ ఏకగ్రీవ ఆమోదం పొంది ఆర్నెల్లు దాటిందనీ, తెలంగాణ వెనుకబడిన తరగతుల (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్‌) బిల్లు-2025 గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలపై నిపుణుల సలహా తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

బీసీలకు ద్రోహం చేసిన బీజేపీ : నెల్లికంటి సత్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై స్టే రావడానికి, బీసీలకు పెంచిన రిజర్వేషన్‌ అమలు జరగకపోవడానికి కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. బీసీలకు బీజేపీ ద్రోహం చేసిందని తెలిపారు. ఇప్పటికే శాసనసభలో బీసీ రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచే బిల్లులనే అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -