అడివికి రాజైన సింహం, ఉదయమే నడుచుకుంటూ బయలు దేరింది. అది గమనించిన నక్క, సింహం పక్కగా నడుస్తూ, ”మగరాజా, ఉదయమే ఎక్కడికి వెళ్తున్నారు” అని అడిగింది.
మగరాజు ముందుకు నడుస్తూనే, ”నిన్న సాయంత్రం, మంత్రి ఎలుగుబంటి నాతో ఒక విషయం చెప్పింది. అది నిజమో, కాదో తెలుసుకుందామని వెడుతున్నాను” అని సమాధానమిచ్చింది
మొన్న మంత్రి పదవికి జరిగిన పోటీలో, ఆ ఎలుగుబంటి నక్కను ఓడించింది. అప్పటి నుండి ఎలుగుబంటి మీద నక్కకు అసూయ పెరిగింది. సమయం చూసి, సింహానికి, ఎలుగుబంటి మీద చాడీలు చెప్పి, తాను మంత్రి కావాలని ఎదురు చూస్తోంది.
ఇదే మంచి సమయం అనుకుంది నక్క.
”మగరాజా, ఆ ఎలుగుబంటి మంత్రి అయినప్పటినుండీ, తన బుద్ధి మారి పోయింది. గర్వం పెరిగింది. ఈ మధ్య అబద్దాలు కూడా ఆడుతోంది. మీకు చెప్పిన విషయం అబద్ధం అని రుజువైతే ఎలుగుబంటిని మీరు తప్పకుండా శిక్షించాలి. నన్ను మంత్రిని చేయాలి” అని సింహంతో పాటు నడుస్తూ నక్క అంది.
”సరే, పద” మంది మగరాజు.
కొంత సేపటికి, ఎలుగుబంటి స్థావరం రావడంతో సింహం, నక్క రెండూ ఆగాయి.
”మగరాజా! మీరెందుకు నా దగ్గరకు పని కట్టుకుని రావడం? కాకి చేత కబురు పెడితే నేనే మీ వద్దకు వచ్చేదానను కదా!” ఎలుగుబంటి సింహాన్ని ఆహ్వానిస్తూ వినయంగా అంది.
‘వినయంగా నటించడంలో నన్నే మించిపోయావు’ నక్క ఎలుగు బంటి కేసి కోపంగా చూస్తూ, మనసులో అనుకుంది.
”నిన్న సాయంత్రం నువ్వు నాతో, ”ఎప్పుడైనా తిన్నది అరగక అజీర్తిగా అనిపిస్తే, కొంత దూరం నడవండి. అజీర్తి తగ్గుతుంది అరుగుతుందని అన్నావ్ కదా. ఉదయమే అజీర్తిగా అనిపించింది. నడుచుకుంటూ నీ వద్దకు వచ్చాను. ఇప్పుడు తగ్గింది. హాయిగా ఉంది. నువ్వన్నది నిజమే, మంత్రీ!” సింహం ఎలుగుబంటిని మెచ్చుకోలుగా చూస్తూ అంది.
”ఎలుగుబంటిని మెచ్చుకోవడంతో, తన ఎత్తులు, జిత్తులు పారవని గ్రహించిన గుంట నక్క ”మగరాజా! నాకూ అజీర్తిగా ఉంది. మరికొంత దూరం నడిస్తే గానీ తగ్గదనుకుంటా!” అంటూ మెల్లగా అక్కడి నుండి జారుకుంటూ, పరుగందుకుంది.
నక్క హడావిడి చూసి, సింహం, ఎలుగు బంటి నవ్వుకున్నాయి.
- కె.వి.లక్ష్మణ రావు, 9014659041