Sunday, October 12, 2025
E-PAPER
Homeజాతీయంపశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం

పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం

- Advertisement -

ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి
స్నేహితుడి ప్రమేయం ఉన్నట్టు బాధితురాలి తండ్రి ఫిర్యాదు
నిందితులను అరెస్టు చేయాలి :దుర్గాపూర్‌లో సీపీఐ(ఎం) , ప్రజా సంఘాల ఆందోళన
న్యాయవిచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలి : ఎహెచ్‌ఎస్‌డీ
జాతీయ మహిళా కమిషన్‌, ఒడిశా సీఎం ఖండన

కోల్‌కతా : రాత్రివేళలో విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రెయినీ డాక్టర్‌పై ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో లైంగికదాడి, హత్య జరిగిన ఘటన మరవక ముందే పశ్చిమబెంగాల్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. దుర్గాపూర్‌లోని ఐక్యూ మెడికల్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన వైద్య విద్యార్థినిపై అదే కళాశాల క్యాంపస్‌ వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఆ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి డిన్నర్‌కు బయటకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రాధమిక దర్యాప్తులో అందిన సమాచారం మేరకు రాత్రి 8 నుంచి 8.30 గంటల సమయంలో విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిందని పోలీసు అధికారి వెల్లడించారు. ”దుర్గాపూర్‌లోని శివపూర్‌ ఏరియాలో గల ఐక్యూ మెడికల్‌ కాలేజీ గేటుకు సమీపంలో రాత్రి 8.30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వారిని అడ్డగించారు.

వెంటనే ఆ విద్యార్థిని స్నేహితుడు ఆమెను ఒక్కదాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ వ్యక్తులు ఆమె ఫోన్‌ను లాక్కుని, క్యాంపస్‌ వెలుపల దట్టంగా చెట్లు వున్న ప్రాంతంలోకి ఆమెను లాక్కెళ్లి సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని వారు హెచ్చరించారు.” అని ఆయన వెల్లడించారు. అంతేకాక ఆ మెడికో ఫోన్‌ తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేశారని, ఆమె నుంచి రూ. 5 వేలు తీసుకున్నారని తెలిపారు. ఆ తరువాత బాధితురాలిని స్నేహితుడు కాలేజీకి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ మేరకు విద్యార్థిని స్ట్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు పోలీసులు తెలిపారు. ‘గత రాత్రే బాధితురాలి ఫ్రెండ్‌తో మాట్లాడాం. సీసీ టీవీ ఫుటేజీ సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాధారాలను సేకరించింది.” అని తెలిపారు.

స్నేహితుడిపై బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమానాలు
తమ కుమార్తె స్నేహితుల నుంచి ఫోన్‌ రావడంతో శనివారం ఉదయమే తాము దుర్గాపూర్‌ వెళ్లామని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితురాలి తల్లిదండ్రులు విలేకర్లకు తెలిపారు. విద్యాపరంగా కాలేజీకి మంచి పేరు ఉందని, అందుకే మెడిసిన్‌ చదవడం కోసం తమ కుమా ర్తెను ఇక్కడకు పంపామని ఆమె తండ్రి చెప్పారు. డిన్నర్‌ కోసం తన కుమార్తెతో కలిసి వెళ్లిన యువకుడు ఘటనా స్థలం నుంచి పారిపోవడాన్ని బట్టి చూస్తే ఇందులో అతడి ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నామని తెలిపారు. ఇదే విషయాన్ని దుర్గా పూర్‌లోని న్యూటౌన్‌ షిప్‌ పోలీసు లకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

నిందితులను అరెస్టు చేయాలి : సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆందోళన
ఈ ఘటన గురించి తెలుసుకున్న సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు బాధితురాలిని పరామర్శిం చారు. బాధితు రాలికి న్యాయం చేయాలనీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దుర్గాపూ ర్‌లోని పోలీస్‌స్టేషన్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.

న్యాయవిచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలి : ఎహెచ్‌ఎస్‌డీ
లైంగికదాడికి పాల్పడిన వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీస్‌ డాక్టర్స్‌ (ఎహెచ్‌ఎస్‌డి) డిమాండ్‌ చేసింది. ఈ ఘటన వైద్య సంస్థల్లో, సమీప ప్రాంతాల్లో భద్రతా లోపాలను మరోసారి బట్టబయలు చేసిందని విమర్శించింది. విధుల్లో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. పారదర్శకమైన, వేగవంతమైన, నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని, డిమాండ్‌ చేసింది. బాధితురాలికి న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులు, ఆరోగ్యకర్తలతో ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాసింది.

ఖండించిన జాతీయ మహిళా కమిషన్‌, ఒడిశా సీఎం
బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను జాతీయ మహిళా కమిషన్‌ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా మజుందార్‌ మాట్లాడుతూ బెంగాల్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇటువంటి నేరాలను అరికట్టడానికి సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మఝి తీవ్రంగా ఖండించారు. సున్నితమైన అ విషయంలో బాధ్యులను గుర్తించి తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

కొరవడుతున్న భద్రత
పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు భద్రత కొరవడడంపై సర్వత్రా విమర్శలు, ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. కోల్‌కతాలోని కాలేజీ క్యాంపస్‌ల్లోనే రెండు లైంగికదాడి కేసులు చోటు చేసుకున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత ఆందోళనను కలిగిస్తోంది.

నివేదిక కోరిన ప్రభుత్వం
దుర్గాపూర్‌లోని ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యం నుంచి ఈ ఘటనపై నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖ కోరింది. ఈ ఘటనపై తక్షణమే నివేదికను అందించాలని కోరామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. బాధితురాలికి వైద్య చికిత్సతో పాటూ మానసికంగా కౌన్సిలింగ్‌ ఇస్తున్నట్టు పశ్చిమ బెంగాల్‌ మహిళా శిశుసంక్షేమ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత శశి పంజా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -