Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాచార హక్కు చట్టానికి 20 ఏండ్లు

సమాచార హక్కు చట్టానికి 20 ఏండ్లు

- Advertisement -

ప్రజల్లో కొరవడిన చైతన్యం
అధికారుల్లో లోపించిన జవాబుదారి తనం 
తూతూ మంత్రంగా సెక్షన్ 4(1) బీ అమలు.!
నవతెలంగాణ – దుబ్బాక 

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు పాలనలో అధిపతులు, పాలకుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ప్రతి పౌరులకు ఉండాలి. అది తెలుసుకునేందుకే సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 న దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి 20 వసంతాలు పూర్తయి 21 వ వసంతంలోకి అడుగుపెడుతోంది. అవినీతి, అన్యాయం, బాధ్యతరాహిత్యాని ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును ఈ చట్టం సామాన్యుడికి ఇచ్చింది. ప్రజాధనం ఎక్కడ ఖర్చు అవుతుందో ఏ ఏ పథకాలు ఎలా అమలవుతున్నాయి. ఎవరు లబ్ధిదారులు, ఇలా అన్నింటిపై సమాచారాన్ని అడిగే అధికారం ఇప్పుడు ప్రతి పౌరుడికి ఉంది.

సమాచారం ఇవ్వడం అధికారుల బాధ్యత… అడగడం ప్రజల హక్కు..

 సమాచార హక్కు (స.హా) చట్టం 2005 ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార అధికారి, పౌర సహాయ సమాచార అధికారి, అప్పిలేట్  అధికారి వారి మొబైల్ నంబర్లతో కూడిన బోర్డును కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ప్రతి పౌరుడు సమాచారం కోసం దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు సంబంధిత ప్రజా సమాచార అధికారి సమాచారం ఇవ్వడం బాధ్యత. అంతేకాకుండా సమాచారం వేరే కార్యాలయానికి చెందిందయితే సహ చట్టంలోని సెక్షన్ 6(3) ప్రకారం ఆ దరఖాస్తును సంబంధిత శాఖకు బదిలీ చేయడమే కాకుండా సదరు దరఖాస్తుదారునికి సమాచారం అందించాలి. సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధించే అధికారం సమాచార కమిషన్ కు ఉంది. సమాచారం ఇవ్వకపోవడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, కావాలనే దురుద్దేశంతో సహ చట్టాన్ని దుర్వినియోగం చేయడం, అమలు చేయకపోవడం కూడా చట్టపరంగా నేరమే.

ఎలా దరఖాస్తు చేయాలి..

సమాచారం పొందుకోరేవారు తెల్ల కాగితంపై రాసి సంబంధిత కార్యాలయంలోని సమాచార అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. గ్రామస్థాయిలో అయితే దరఖాస్తుకు రుసుము అవసరము లేదు. మండల స్థాయిలో రూ.5, జిల్లా స్థాయిలో రూ.10 లు రుసుము చెల్లించాలి. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న దరఖాస్తుదారుడైతే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సమాచారం ముద్రణ కోసం మాత్రమే దరఖాసుదారుడు ఒక్కో పేజీకి రూ.2 లు మాత్రమే చెల్లించాలి. అంతేకాకుండా సహ దరఖాస్తుకు గాని ముద్రణ పేపర్లకు గాని నగదు రూపంలో కూడా రుసుమును చెల్లించి రసీదు తీసుకోవాలి.

దరఖాస్తు తీసుకోకపోవడం కూడా నేరమే..

సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీని స్వీకరించకపోవడం లేదా నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వకపోవడం కూడా చట్టపరంగా నేరమే. సకాలంలో సమాచారం ఇవ్వడంలో అధికారులు అలసత్వం వహించినా.. కావాలనే సమాచారం ఇవ్వకపోయినా సెక్షన్ 20 (1) ప్రకారం రోజుకు రూ.250 ల చొప్పున జరిమానా  విధించవచ్చు. ప్రజలు తమ హక్కును వినియోగించుకోవాలి.

సహ చట్టం పై ప్రజల్లో అవగాహన తక్కువ…

సహ చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయినప్పటికీ గ్రామీణ స్థాయిలో ఈ చట్టంపై అవగాహన తక్కువగానే ఉందని చెప్పాలి. చాలామందికి దరఖాస్తు చేసుకునే విధానం వాటికి సంబంధించిన రుసుముల వివరాలు తెలియక వెనకడుగు వేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సరైన సమాధానం లేక ప్రజల్లో నిరుత్సాహం కలిగిస్తుంది. సమాచార హక్కు చట్టం నిజమైన ప్రయోజనం పొందాలంటే ప్రతి గ్రామాన సహ చట్టంపై అవగాహన పెంచి ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుంది. ఇందుకు సహ చట్టం అమలులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చాలా అవసరం. అప్పుడే సహ చట్టం బలోపేతం అవుతుంది.

ఫైళ్ల తనిఖీ…

సహ చట్టంలోని సెక్షన్ 2 (జే) ప్రకారం ప్రతి పౌరుడు వచ్చిన నిధులు, జరిగిన అభివృద్ధి పనులు, పత్రాలు, రికార్డులను తనిఖీ చేయవచ్చు. డాక్యుమెంట్లు రికార్డులకు సంబంధించిన నోట్స్ రాసుకోవడం వాటి సర్టిఫై కాఫీలను అందులోని భాగాలను ఈ చట్టం ద్వారా తీసుకోవచ్చు. రికార్డుల తనిఖీ సందర్భంగా దరఖాస్తుదారులు కెమెరాలు, వీడియోలు, ఫిల్ములు ఉపయోగించవచ్చు.

దరఖాస్తుదారునికి రక్షణ కల్పించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే..

దరఖాస్తుదారుని వివరాలు బయటపెట్టినా ఎవరైనా బెదిరించినా భయభ్రాంతులకు గురిచేసినా అట్టి దరఖాస్తుదారునికి ప్రభుత్వమే పూర్తి రక్షణ ఇవ్వాలి. మెమో నం 33086/ఆర్ టీఐఏ/జీపీఎం అండ్ ఏఆర్/2010 ప్రకారం వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

సహ చట్టంపై  అవగాహన పెంచుకోవాలి: కౌన్సిల్ ఫర్ ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండీ. షాదుల్..

గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు ఒక్క దరఖాస్తుతో మనకు కావలసిన సమాచారాన్ని పొందే హక్కు ఈ చట్టం కల్పిస్తుంది. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే అంశమైతే 48 గంటల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని చట్టం చెబుతోంది. స.హ చట్టం లోని సెక్షన్ 4 (1) బీ గుండెకాయ లాంటిది. ఇందులో 17 అంశాలు ప్రతి కార్యాలయంలో బోర్డుపై ప్రదర్శించాలి. కానీ కొన్ని కార్యాలయాల్లో మాత్రమే నామమాత్రానికి బోర్డులు కనిపిస్తాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో 4 (1) బీ అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 20 నుండి 30 శాతం ప్రభుత్వ అధికారులు మాత్రమే స.హ చట్టంపై అవగాహన కలిగి ఇప్పటివరకు శిక్షణ పొంది ఉన్నారు. అందరూ సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన పెంపొందించుకొని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరికి సహ చట్టంపై అవగాహన కల్పించాలా కృషి చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -