అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది : అధిక సుంకాలపై చైనా మండిపాటు
బీజింగ్ : తమ ఉత్పత్తులపై మరో వంద శాతం సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షు డు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా మండిపడింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపిస్తూ దాని ఉడత ఊపులకు భయవపడే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీజింగ్‌తో కలిసి నడవా లని అనుకుంటే ఈ విధంగా తరచూ బెదిరింపులకు దిగడం పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. చైనాపై అధిక సుంకాలు విధిస్తానంటూ ప్రతి సంద ర్భంలోనూ హెచ్చరించడం సరికాదని చెప్పారు.
రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు
ట్రంప్ తాజా ప్రకటనతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 130 శాతానికి చేరాయి. ట్రంప్ చర్యకు ప్రతిగా చైనా కూడా రేర్ ఎర్త్ పరికరాలు, వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపై తాజాగా ఎగుమతి ఆంక్షలు విధించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. వీటిని ఎగుమతి చేయాలని అనుకునే వారు విధిగా ప్రత్యేక లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అమెరికా చర్యకు ఈ ప్రతి చర్య అవసరమేనని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా కనుక సుంకాలపై పట్టు వీడని పక్షంలో తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అమెరికా చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తాయని, రెండు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బ తీస్తాయని చెప్పింది. మాడ్రిడ్‌లో వాణిజ్య చర్చలు జరిగినప్పటి నుంచీ తమపై అమెరికా నిరంతరాయంగా ఆంక్షలు విధిస్తూనే ఉన్నదని ఆరోపించింది. ‘మేము జగడాన్ని కోరుకోవడం లేదు. అలాగని పోరుకు భయపడేదే లేదు’ అని తేల్చి చెప్పింది. ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఏకపక్ష వాణిజ్య ఆంక్షలకు స్వస్తి చెప్పాలని చైనా ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ అమెరికా దానిని పెడచెవిన పెడుతోంది.
వివాదానికి ప్రధాన కారణం
అమెరికా, చైనా మధ్య వివాదానికి ప్రధాన కారణం రేర్ ఎర్త్ ఖనిజాలు. సెమీకండక్టర్లు, విద్యుత్ వాహనాలు, రక్షణ పరికరాల ఉత్పత్తికి ఇవి అత్యవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే జెట్ ఇంజిన్ల నుంచి రాడార్ వ్యవస్థల తయారీ వరకూ రేర్ ఎర్త్ ఖనిజాల అవసరం ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు వంటి వినియోగ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకీ ఇవి అవసరమే. ప్రపంచ రేర్ ఎర్త్ మైనింగ్‌లో చైనా వాటా సుమారు 70 శాతం. ప్రపంచ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌లో సైతం 90 శాతం వరకూ చైనాదే ఆధిపత్యం.
చైనాపై సుంకాలు పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో రేర్ ఎర్త్ ఎగుమతులను బీజింగ్ నిలిపివేసింది. సంప్రదింపుల నేపథ్యంలో అవి తిరిగి ప్రారంభమయ్యాయి. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఎగుమతులపై తాజాగా నియంత్రణలు విధించామని, వీటిని నిషేధంగా చూడకూడదని చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ప్రమాణాలను పాటించే ఎగుమతులకు అనుమతులు కొనసాగుతాయని చెప్పింది.



