భయపడం..

Don't be afraid..– బీజేపీ నోటీసు రాజకీయంపై సీఎం ఘాటుగా సమాధానం
– అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో ‘కాంగ్రెస్‌’కు నోటీసులు
– గాంధీ భవన్‌లో అందజేసిన ఢిల్లీ పోలీసులు
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ… కేంద్రంలోని బీజేపీ ‘నోటీసు’ రాజకీయానికి తెరలేపింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఊపిరిలూదిన తెలంగాణ గడ్డ మీద తన పప్పులుడకటం లేదని భావించి కొత్త కుట్రకు పూనుకుంది. తాజాగా రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఘాటైన విమర్శలకు బీజేపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయపడింది. దీంతో టీపీసీసీ నేతలకు నోటీసులివ్వటం ద్వారా, ఇండియా కూటమిని మానసికంగా దెబ్బతీయాలని భావించి, ఆ మేరకు ఢిల్లీ పోలీసుల చేత హైదరాబాద్‌కు నోటీసులు పంపించింది. అయితే కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్‌… ఈ నోటీసులకు ఘాటుగా జవాబిచ్చారు. ‘భయపడేవాళ్లెవరూ లేరిక్కడ…’ అంటూ బీజేపీకి దిమ్మదిరిగే సమాధానమిచ్చారు.
నవతెలంగాణ హైదరాబాద్‌బ్యూరో :
రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకులు అమిత్‌ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్‌ కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ గాంధీభవన్‌కు వచ్చిన వారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్‌, పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్‌తోపాటు నవీన్‌, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డికి కూడా సమన్లు జారీ చేశారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. మే ఒకటిన ఫోన్లు తీసుకుని విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. టీపీసీసీ పేరుతో నిర్వహిస్తున్న ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఏప్రిల్‌ 27న ఈ వీడియోను పోస్ట్‌ చేయడంతో అధ్యక్షుని హోదాలో ఉన్న రేవంత్‌కు సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. ఎడిట్‌ చేసిన వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరికి దాన్ని షేర్‌ చేశారో తెలపాలంటూ ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో కోరినట్టు సమాచారం.
అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వారు దర్యాప్తును చేపట్టారు. షా ఈనెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్టుగా ఎడిట్‌ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.
15 రోజుల గడువు అడిగాం-టీపీసీసీ లీగల్‌ సెల్‌
నోటీసులు స్వీకరించిన అనంతరం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డితో కలిసి లీగల్‌ సెల్‌ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నలుగురి పేరిట ఇచ్చిన నోటీసులను స్వీకరించినట్టు తెలిపారు. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఒక కంటెంట్‌ మార్పిడికి సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులు కోరారని తెలిపారు. దానికి సంబంధించిన ఫిర్యాదు కాపీని అందజేసి 15 రోజుల గడువిస్తే బదులిస్తామంటూ ఢిల్లీ పోలీసులతో చెప్పినట్టు వారు వెల్లడించారు. టీపీసీసీ సోషల్‌ మీడియా తమ పార్టీ ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్నదని స్పష్టం చేశారు.
వారు గతంలో అన్న మాటలే కదా…?-జగ్గారెడ్డి
‘రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అభివద్ధి చెందారు. వారికి రిజర్వేషన్లు అవసరమా..?’ అంటూ బీజేపీ నేతలు గతంలో చర్చ లేవనెత్తారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి గుర్తుచేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందంటూ తమ నేత రాహుల్‌ గాంధీ అనడంతో బీజేపీలో ఉలికిపాటు మొదలైందని తెలిపారు. సమానత్వం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్‌ను గెలిపించాలనే నిర్ణయానికి ప్రజలు రావటంతో బీజేపీలో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజా పోరాటంలో ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ ఇలాంటి నోటీసులను పంపిస్తున్నదనీ, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. రాహుల్‌ గాంధీ దెబ్బకు…ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ రోడ్డు మీదికొచ్చి, అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందేనంటూ ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. అదే రాహుల్‌ ప్రధాని అయితే … ఆయా వర్గాలకు మరింత అండగా ఉంటారని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ సర్కారు వచ్చే పరిస్థితి లేదన్నారు.
డ్రామా రాజకీయాలు-చనగాని దయాకర్‌
ఉత్తర భారతదేశంలో ప్రజలు బీజేపీని తిరస్కరించడంతో ఆ పార్టీ దక్షిణాదిలో డ్రామా రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ విమర్శించారు. ఓటమి భయంతో ఇచ్చే నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించి బుద్ధి చెబుతామన్నారు.
ఇంతకాలం ఈడీ,సీబీఐ,ఐటీ ఇప్పుడు ఢిల్లీ పోలీసులా?
– సీఎం రేవంత్‌రెడ్డి
వీడియో మార్ఫింగ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు టీపీసీసీ నేతలకు జారీ చేసిన నోటీసులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. సోమవారం కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ… బీజేపీ నోటీసులకు ఇక్కడ భయపడే వాళ్లెవరూ లేరని సమాధానమిచ్చారు. అలాంటి వాటికి మరింత ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఇంత కాలం ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించుకున్నదనీ,
ఇప్పుడు ఢిల్లీ పోలీసు లనుప్రయోగిస్తున్నదని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరూ ఏదో పోస్ట్‌ చేస్తే దానికి టీపీసీసీ అధ్యక్షుడినీ, తెలంగాణ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేస్తామంటూ నోటీసులు ఇచ్చేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీని 400 సీట్ల లో గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని మరోసారి హెచ్చరించారు. అదే కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆయా రిజర్వేషన్లు కొనసాగుతాయని తెలిపారు.
గుజరాత్‌లో అన్ని ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించిన అక్కడి ప్రజలు ప్రధాని మోడీకి అండగా నిలిచారని గుర్తుచేశారు. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కర్నాటక నుంచి మల్లికార్జున ఖర్గే ఉన్నారనీ, అందువల్ల కన్నడి గులంతా ఆయనకు అండగా నిలవాలని కోరారు. గుజరాత్‌లో 26 ఎంపీ సీట్లు ఉండగా, కర్నాటక లో 28 సీట్లు ఉన్నాయని చెప్పారు. గుజరాత్‌ వర్సెస్‌ కర్ణాటకలో కర్నాటక గెలవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిచ్చారనీ, కర్నాటక ప్రజలకు ఎలాంటి కష్టమొ చ్చినా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.

Spread the love