– ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు : ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారంపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణ- జడ్చర్ల
”సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపారు.. రేపు నన్నూ చంపుతారేమో..” అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఇందుకు అంతా సిద్ధం అయిందని జరుగుతున్న ప్రచారంపై అనిరుధ్‌రెడ్డి స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. గతంలో సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారని, రేపు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చని ఎర్ర శేఖర్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తమను ఓడించాలని ప్రయత్నించిన వారిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. వచ్చే వారికి గేటు వద్దకు వెళ్తే కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకదని, కావాలనే ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు. కాగా ఎర్ర శేఖర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే.
సర్పంచ్ కోసం తమ్ముడిని చంపిండు.. రేపు నన్నూ చంపుతారేమో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES