Saturday, January 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమూడు చట్టాలపై సమరభేరి

మూడు చట్టాలపై సమరభేరి

- Advertisement -

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో యాభై వేలమంది శ్రమజీవులు, అందులోనూ ప్రధానంగా ఆదివాసులు ఎర్రజెండాలు చేబూని కదం తొక్కారు. ప్రధాన మీడియా బుద్దిపూర్వకంగా నిగూఢ మౌనం పాటించినప్పటికీ, సోషల్‌ మీడియా మాత్రం ఆ చిత్రాలు, దృశ్యాలతో విస్పోటనంలా నిండిపోయింది. చరిత్రాత్మకమైన వర్లీ ఆదివాసీ తిరుగుబాటుకు గుండెకాయలా నిలిచిన గడ్డ ఇది. చరోటి నుంచి పాల్ఘర్‌ వరకూ యాభై ఐదు కిలోమీటర్ల దూరం సాగిన ఈ యాత్ర నలభై ఎనిమిది గంటలపాటు రేయింబవళ్లు నడిచిన ఈ యాత్ర చివరకు కలెక్టరేట్‌ చేరుకుంది. అటవీ హక్కుల చట్టం దుర్వినియోగంతో వారి జీవితాలకే ముప్పుగా తయారైన భూమి, బేదఖల్‌ సమస్యలను ఈ ప్రదర్శన ప్రతిధ్వనించింది. గ్రామీణ ప్రాంతాల్లో వందరోజుల పనికల్పన చట్టానికి తూట్లు పొడిచిన తాజా సవరణతో తలెత్తిన పరిస్థితిని వారు ఎలుగెత్తి వినిపించారు. సమ్మె చేసేందుకు నిరసన తెల్పేందుకు హక్కు లేకుండా చేస్తున్న తాజా లేబర్‌కోడ్‌లపై ఆందోళన వినిపించారు.

విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలను ప్రయివే టీకరణను చట్టబద్దం చేయడం, ముందస్తు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించడం కోసం కొత్త విద్యుత్‌ చట్టం తేవడాన్ని ప్రశ్నించారు. వీటిని బిగించడం వల్ల వ్యక్తిగతంగా వినియోగదారులపై ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవదమే గాక వ్యవసాయ వ్యయాలు కూడా పెరిగిపోతాయని చాటారు. వినాశకరమైన మూడు వ్యవసాయ చట్టాలపై విస్పోటనంలా పేలిన చారిత్రాత్మక నాసిక్‌ ముంబాయి లాంగ్‌మార్చ్‌ను ఈ యాత్ర అనేక విధాలుగా గుర్తుకు తెచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలపై ప్రతిఘటనకు అప్పట్లో అదొక కీలకభూమిగా మారింది.ఈ సారి తేడా ఏమిటంటే? ఒక్క జిల్లాకు చెందిన శ్రామిక ప్రజలతోనే అంతకు రెట్టింపు మంది పాల్గొనడం.పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోతున్న సమయంలో మోడీ ప్రభుత్వం వినాశకర చట్టాలను ఎలాగో రుద్దే ప్రయత్నం చేసింది. అయితే జీరామ్‌జీ, నాలుగు లేబర్‌ కోడ్‌లు, విద్యుత్‌ సవరణ చట్టం అనే ఆ మూడూ శ్రమజీవుల జీవనాడినే దెబ్బతీయడానికి తీసుకొచ్చినవి.

ఎందుకీ హడావుడి?
మోడీ సర్కారు వీటిని ఇంత హడావుడిగా తీసుకురావడం యాదృచ్చికమేమీ కాదు. అది సంతరించుకుంటున్న నయా ఫాసిస్టు లక్షణాలతో నిబడీకృతమైన పరిణామమే. పార్లమెంటు పనితీరును బూటకంగా మార్చి వేయడటమే ఆ లక్షణం. ఈ శాసనాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విస్తార శ్రామికవర్గాలను చావుదెబ్బ కొడతాయి. గ్రామీణ పేదల పనిదినాలకు గిరాకీతో కూడిన గ్యారంటీ లేకుండా చేసే జీరామ్‌జీపై ఇప్పటికే ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సవివరమైన వ్యాసాలు ప్రచురించింది.ఈ మోసపూరితమైన ప్రభుత్వ వంచనా ఎత్తుగడ అంశాలవారీగా ఎండగట్టే సమాధానం ఈ సంచికలో వుంది. ఈ కార్పొరేట్‌ మతతత్వ సర్కారు అంతర్జాతీయంగానూ, దేశంలోనూ పెరుగుతున్న ఆర్థిక దుస్థితి భారాలను శ్రమజీవులపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని లేబర్‌కోడ్‌ల నోటిఫికేషన్‌తో వెల్లడైంది.దానిపై శ్రామిక వర్గ పోరాటాలు పెరుగుతాయని కూడా ఈ ప్రభుత్వానికి బాగా తెలుసు గనక కార్పొరేట్లను మరింత బాహాటంగా సమర్థించేందుకు సిద్ధమైపోతున్నది. బేరసారాలు, నిరసనలు సమ్మెల హక్కులకే ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.మరోవైపున చూస్తే విద్యుత్‌ ప్రయివేటీకరణ. ప్రత్యేకించి పంపిణీ ప్రయివేటీకరణ వల్ల పౌరుల నిత్యజీవితంలో తప్పనిసరి అవసరమైన విద్యుత్‌శక్తి పొందే హక్కు అందుబాటులో లేకుండా పోతుంది.ఆ హక్కు హరించవేయబడటంతో పాటు వ్యవసాయ ఖర్చుల పెరుగుదలతో సహా రోజువారి జీవనవ్యయం దుర్భరంగా పెరిగిపోతుంది.

జీడీపీ గొప్పల బండారం
అయితే ఈ విధంగా ప్రజలపైకి భారాలను బదలాయించడం మోడీ ప్రభుత్వ విధాన దిశానిర్దేశం అనివార్య ఫలితమే.నయా ఉదారవాద ఆర్థిక విధానాల నమూనా చివరకు ఏకైక జీడీపీ కేంద్రిత కథనాలతో నడిపించడం సరికొత్త రివాజుగా తయారైంది. అంతకం తకూ పెరిగిపోతున్న అసమానతలు, నిరుద్యోగం వల్ల తీవ్ర కడగండ్ల పాలయ్యే శ్రమజీవుల బాధలు విస్తృత పరిధిని అందకోవడానికి అది అది ఏ మాత్రం సరిపోదనేది చాలా స్పష్టం. దేశం 8.2శాతం చొప్పున అభివృద్ది చెందుతున్నదని ఎప్పటినుంచో ప్రభుత్వం చెప్పుకుంటున్నది. విచిత్రం ఏమంటే నయా ఉదారవాద నమూనాను ఎంతగానో సమర్థించే ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులు కూడా ప్రభుత్వం చెబుతున్న ఈ 8.2 పెరుగుదల రేటు అంచనాతో ఏకీభవించడం లేదు. 2025-26లో 6.6 శాతం నుంచి 6.5శాతం వుండవచ్చునని చెబుతున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ అంచనాలు తగ్గించడానికి కారణం అధికారిక లెక్కల విశ్వసనీయత తగ్గడమే కారణమవుతున్నది. దాంతోపాటే ఆ లెక్కలు నిజమవుతాయనే విశ్వాసం కూడా లేకుండా పోతున్నది.చాలా స్పష్టంగా ఇది లెక్కల గారడీని సూచిస్తున్నది. సంక్షుభిత ఆర్థిక వ్యవస్థ సంక్షోభభరితమై వుంటే ఏదో అభివృద్ధి జరిగినట్టు చూపించే బూటకంగా కనిపిస్తుంది.

కార్పొరేట్‌ పాకులాట
ప్రభుత్వం మరింత ఖర్చు పెట్టాలని కార్పొరేట్‌ భారతం పాకులాడటం చూస్తేనే ఆర్థిక వ్యవస్థ లొసుగులు తెలిసిపోతున్నాయి.భారతీయ కంపెనీల దగ్గర 2019తో పోలిస్తే నగదు నిల్వలు రెట్టింపుగా వున్నాయి. అయినా సరే, ఆ కంపెనీలు కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదంటే గిరాకి స్తబ్దుగా క్షీణదిశలో వుండటమే కారణమవుతున్నది. గిరాకీ పెరగకపోవడంతో పాటు దేశీయ వినియోగం, తెరపిలేని ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితులు కూడా ఇందుకు కారణమవుతున్నాయి.అందువల్లనే ప్రభుత్వం మరింత ఖర్చు పెట్టాలనీ పన్ను రాయితీలివ్వాలనీ వ్యాపార వర్గాల అనుకూల విధానాలు అమలు చేసి గిరాకీ పెంచాలని ఒత్తిడి అధికమవుతున్నది. దీనికి స్పందనగా ప్రభుత్వం చట్టాల విషవలయం తీసుకురావడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు లోపం మరెక్కడో వుందని ఈ కార్పొరేట్‌ మతతత్వ ప్రభుత్వానికి తెలియచెప్పడం ఎవరితరం. భారతదేశం అంతులేని అగాధపు లోతుల్లో కూరుకుపోయింది. ఆసియాలోనే అత్యంత దారుణంగా పనిచేస్తున్న కరెన్సీ అదేనని అందరూ నిర్ధారణకు వచ్చేశారు.

శ్రామికవర్గానికి, రైతాంగానికీ చిన్న పరిశ్రమలకూ ఇది ప్రాణాంతకమైన పరిణామం. అదే సమయంలో దేశం నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు నికరంగా తరలిపోతు న్నాయి.శ్రామికుల లెక్కలు చూస్తే ఉత్పత్తిరంగంలో పాల్గొనే వారి సంఖ్య తగ్గుదలనే చెబుతున్నది.దాంతోపాటే సగటు వేతనాల పెరుగుదల కూడా పడిపోతున్నది. ప్రపంచ అసమానతల నివేదిక చూస్తే పైనున్న పదిశాతం మంది కుబేరులు జాతీయాదాయంలో 58శాతం సంపాదిస్తున్న వైపరీత్యాన్ని చెబుతున్నది. ఇది 2022లో కన్నా అధికం. అయితే మరోవైపు అట్టడుగు యాభై శాతం మంది కేవలం పదిహేను శాతం మాత్రమే పొంద గలుగుతున్నారు.అదేరీతిలో ఆర్థిక వ్యవస్థ మొత్తం సంపదలో అత్యంత పైభాగాన వున్న ఒక్కశాతం మంది నలభై శాతం కలిగివుంటే పైనున్న పదిశాతం మంది 65 శాతం సంపద అనుభవిస్తున్నారు. ఈ నిరాశమయ దృశ్యంలో మరోవైపు చూస్తే సిఎంఐఇ డేటా ప్రకారం కార్పొరేట్లు తాము పెట్టిన పెట్టుబడిపై పొందుతున్న లాభాలు పద్నాలుగేండ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా వుంటున్నాయి.2025 సెప్టెంబరులో చూస్తే పన్ను మినహాయింపు తర్వాత పెట్టుబడి లాభాల నిష్పత్తి 1.47శాతంగా ఉంటున్నది. అంతులేని దోపిడీతో పోగుపడిన హద్దుమీరిన లాభాల ప్రత్యక్ష దృశ్యం ఇది.

సమ్మెతో శంఖారావం
ప్రభుత్వం తీసుకొచ్చిన శాసనత్రయం దీనికి సమాధానమే. ప్రజల కడగండ్లను తీర్చేందుకు చిటికెన వేలు కదల్చకపోగా, ప్రభుత్వం వారిపై మరిన్ని భారాలు కుమ్మరించాలని చూస్తున్నది. అందుకు వ్యతిరేకంగా ఎలాటి నిరసనలూ తిరుగుబాట్లకు అవకాశం లేకుండా ఊపిరి బిగించాలనుకుంటున్నది.అందువల్లనే శ్రామిక ప్రజానీకం తమ మనుగడ కోసం, జీవనోపాధి కోసం చేసే పోరాటం కేంద్ర బిందువుగా పరిగణించాల్సి వుంటుంది.ఈ చట్టాల అసలైన ప్రభావాలు ఎలా వుంటాయో, గ్రామసీమలు పట్టణ ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి చెప్పాలి. నిఖార్సుగా, నిజాయితీగా నిర్విరామంగా ఈ ప్రయత్నం చేస్తే మనం పాల్ఘార్‌లో చూసిందే దేశమంతా పునరావృతం చేయగలం. రైతాంగం మద్దతుతో కార్మికవర్గం 2026 ఫిబ్రవరి 12న తలపెట్టిన సమ్మె కుల, మత, విభజనలకతీతంగా ప్రజా రాశుల ప్రతిఘటన సందేశాన్ని తీసుకుపోవడానికి గొప్ప విజయనాదమవుతుంది.
(జనవరి 21 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -