స్థానిక స్వయం పాలన సూత్రాలకు విఘాతం
వీబీ- జీ రామ్ జీతో రాష్ట్రాలపై ఆర్థిక భారం
కేంద్రంపై ఆధారపడే స్థితిలోకి నెడుతుంది
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రద్దుపై మాజీ బ్యూరోక్రాట్లు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను రద్దు చేయడంపై అన్ని వర్గాల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు ఆ జాబితాలో మాజీ బ్యూరోక్రాట్లు కూడా చేరారు. ఇది గ్రామీణ ప్రజల హక్కులపై, స్థానిక స్వయం పాలన సూత్రాలపై తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ‘కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్’నకు చెందిన 88 మంది మాజీ బ్యూరోక్రాట్లు ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ యాక్ట్ ( వీబీ-జీ రామ్ జీ)ను తీసుకురావడాన్ని వారు తప్పుబట్టారు.
వీబీ- జీ రామ్ జీలో 125 రోజుల ఉపాధి హామీ ఇవ్వబడిందనే ప్రకటన శూన్య వాగ్దానంగా ఉన్నదని అభిప్రాయప డ్డారు.మాజీ ఉన్నతాధికారులు తమ ప్రకటనలో వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం… ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వల్ల గ్రామీణ కార్మికుల ఆదాయం పెరిగింది. పేదరికం తగ్గింది. పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ ఇది ప్రజలకు ఆర్థిక రక్షణగా మారింది. ఉపాధిని హక్కుగా మార్చడం ద్వారా కులం, వర్గం, లింగం, ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా ఇది ఒక సామాజిక విప్లవం. వీబీ-జీ రామ్ జీ చట్టం ప్రకారం ఉపాధి రోజులను 125కి పెంచినప్పటికీ.. రాష్ట్రాల ఖర్చు వాటా 40 శాతానికి పెరిగింది. వేతన వ్యయం కేంద్రం భరిస్తుండగా, వస్తు, పరిపాలనా ఖర్చుల్లో రాష్ట్రాలపై ఎక్కువ భారం పడుతోంది.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చిన్న చూపు చూసిన విధానాన్ని వారు తప్పుబట్టారు. గత దశాబ్దంలో ఎంజీఎన్‌ఆర్ ఈజీఏకు సరైన బడ్జెట్ కేటాయింపులు జరగలేదన్నారు. కనీస వేతనాల కంటే తక్కువ చెల్లింపులు జరిగాయని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన, ఎన్‌ఎంఎంఎస్ యాప్, ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానంతో కార్మికులకు వేతనాలు సరిగ్గా అందలేదని వారు గుర్తు చేశారు. కొత్త చట్టం డిమాండ్ ఆధారిత స్వభావాన్ని తొలగించి, రాష్ట్రాలను కేంద్రంపై ఆధారపడే స్థితిలోకి నెడుతోందని వివరించారు. హక్కుగా ఉన్న ఉపాధిని కేంద్ర ప్రాయోజిత పథకంగా మార్చి, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతున్నారని వారు ఆరోపించారు. ఈ చట్టం గ్రామీణ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలహీనపర్చే చర్యగా వారు అభివర్ణించారు.



