పెన్నులు, పుస్తకాలు, స్కూలు బ్యాగులమీద 18 శాతం జీఎస్టీ
22 నుంచి అమలు
ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే అరకొర ఆదాయాలతో తమ పిల్లల్ని చదివించటమే తల్లిదండ్రులకు భారమవుతుంటే.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందాన వారిపై జీఎస్టీ భారాలు పడనున్నాయి. అప్పోసప్పో చేసి వారు కుటుంబాలను నెట్టుకొస్తున్నా అవి నెలవారీ ఖర్చులకే సరిపోవటం లేదు. ఇలాంటి ధైన్య స్థితిలో సీబీఐసీ సవరించిన జీఎస్టీ మరింత భారంగా మారటం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
న్యూఢిల్లీ : పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) ఈ నెల 22 నుంచి సుమారు 1,200 వస్తువులపై జీఎస్టీని సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం విద్యార్థులు ప్రతి రోజూ ఉపయోగించే పెన్నులు, స్కూలు బ్యాగులు, ముద్రించిన పుస్తకాలపై 18 శాతం జీఎస్టీ విధిస్తారు. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తూ ఈ నెల 3వ తేదీన తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నేపథ్యంలో గడువు లోగానే 28 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు కొత్త రేట్లను నోటిఫై చేసే అవకాశం ఉంది. బాల్ పాయింట్ పెన్నులు, ఫౌంటెన్ పెన్నులు, మార్కర్లు, ఇతర రాత పరికరాలపై గతంలో వేర్వేరు జీఎస్టీ రేట్లు విధించారు. ఇప్పుడు వాటన్నింటిపై 18 శాతం చొప్పున వసూలు చేస్తారు. స్కూలు బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, సూట్‌కేసులు, వ్యానిటీ కేసులు, సంగీత పరికరాల కేసులు, పర్యాటక బ్యాగులపై కూడా ఇదే విధంగా 18 శాతం జీఎస్టీ విధిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఊరట కలిగించే విధంగా రాయడానికి, గీయడానికి ఉపయోగించే సుద్ద (రైటింగ్ ఛాక్)ను, దర్జీ పని వారు ఉపయో గించే సుద్దను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించారు. గతంలో వీటిపై 12 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు. ప్రింటెడ్ పుస్తకాలకు ఉపయోగించే అన్‌కోటెడ్ పేపర్‌ను 18శాతం జీఎస్టీ పరిధిలోకి తేవడం ఆందోళన కలిగిస్తోంది. లేబొరేటరీ నోట్‌బుక్స్‌ను జీఎస్టీ నుంచి మినహాయిస్తుండగా ప్రింటెడ్ పుస్తకాలపై విధించిన అధిక జీఎస్టీతో పుస్తకాల ధరలు పెరుగుతా యని పరిశ్రమ నిపుణులు తెలిపారు.