Sunday, September 21, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్దారి తప్పుతున్న బాల్యం

దారి తప్పుతున్న బాల్యం

- Advertisement -

ప్రస్తుత కాలంలో బాల్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఆర్థిక ఒత్తిడులు, సాంకేతిక విప్లవం, కుటుంబ నిర్మాణంలో మార్పులు వంటివి పిల్లల పెరుగుదలపై, మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో చిన్నారుల మనస్తత్వంలో ఆందోళన కలిగించే మార్పులు, వారి జీవితాలను తప్పుదారి పట్టించేందుకు దారి తీస్తున్నాయి. ఈ సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, దీనికి గల కారణాలు, పరిణామాలు, పరిష్కార మార్గాలను విపులంగా విశ్లేషించడం అవసరం.

డిజిటల్‌ విప్లవం పిల్లల ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సులభంగా అందుబాటులోకి వచ్చే క్రైమ్‌ థ్రిల్లర్లు, హింసాత్మక సన్నివేశాలు చిన్నపిల్లల మనస్సులపై చెరగని ముద్ర వేస్తున్నాయి. ఈ కంటెంట్‌ కేవలం వినోదం మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో నేరాలను ఎలా నిర్వహించాలో, పోలీసులను ఎలా మోసగించాలో నేర్పే ఒక ట్యుటోరియల్స్‌ లాగా మారుతున్నాయి. మంచి కంటే చెడు తొందరగా ప్రభావం చూపిస్తుందని చెప్పినట్లు చెడు కంటెంట్‌ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అర్థం చేసుకోలేని వయస్సులో పిల్లలు, దానిలోని హింసకు ఆకర్షితులై, నేరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది సమాజానికి భయంకరమైన హెచ్చరిక. బాల్యం ఎటువైపు పయనిస్తుంది అని ఆలోచించాలి.
ఈ డిజిటల్‌ కంటెంట్‌ పిల్లల మెదడులోని ప్రీ-ఫ్రంటల్‌ కార్టెక్స్‌ అనే భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, మంచి-చెడుల మధ్య తేడాను గుర్తించడం వంటి వాటికి సహాయపడుతుంది. హింసాత్మక కంటెంట్‌ను నిరంతరం చూడడం వల్ల ఈ భాగం పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా, పిల్లలలో కోపం, ఆవేశం పెరుగుతాయి. వారు తమ నిజ జీవితంలో కూడా ఇదే ప్రవర్తనను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమస్యను నివారించడానికి, తల్లిదండ్రులు పిల్లలు చూసే మొబైల్‌ ఫోన్‌, సోషల్‌ మీడియా, పబ్జి గేమ్స్‌, రీల్స్‌, షార్ట్‌ వంటి కంటెంట్‌ మీద నిఘా పెట్టడం, వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం చాలా అవసరం.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం: నేటి ఆర్థిక వ్యవస్థలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం అనివార్యం. ఫలితంగా పిల్లలపై సరైన దష్టి పెట్టడం తగ్గిపోయింది. ఆర్థిక ఒత్తిడిలో మునిగి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలతో సమయం గడపడానికి బదులు తల్లిదండ్రులు ఇంటి పనులలో, స్మార్ట్‌ఫోన్లు, టీవీలలోనే మునిగిపోతున్నారు. కనీసం ఒక గంట అయిన పిల్లలతో గడిపి వారితో చదువుతూ, కబుర్లు, కథలు, వారి ఆలోచలను, అనుభవాలను పంచుకొని అనుబంధం పెంచుకోవాలి. లేకపోతే కుటుంబంలోని బంధాలు బలహీనపడతాయి. పిల్లల రోజువారీ జీవితం, వారి స్నేహితులు, పాఠశాలలో సమస్యలు గురించి ప్రశ్నించే తల్లిదండ్రులు చాలా తక్కువ. మంచి-చెడుల మధ్య తేడాను, నైతిక విలువలను నేర్పించే సమయం లేకపోవడం వలన, పిల్లలు తెలియకుండానే తప్పుదారి పట్టే అవకాశాలు పెరుగుతున్నాయి.
కుటుంబమే పిల్లల మొదటి పాఠశాల. అక్కడ ప్రేమ, అభిమానం, ఆప్యాయత, భద్రత లభించకపోతే, పిల్లలు బయట ప్రపంచంలో ఆ ఆదరణ కోసం వెతుకుతారు. ఈ క్రమంలో వారు చెడు స్నేహితుల ప్రభావంతో తప్పుడు మార్గాల్లో పయనిస్తారు. కుటుంబంలో ప్రేమాభిమానాలు లేని కారణంగా పిల్లలు మానసికంగా ఒంటరితనానికి గురవుతారు, దీనివల్ల వారిలో నిరాశ (depression), ఆందోళన పెరుగుతాయి. ఈ సమస్యను నివారించడానికి, తల్లిదండ్రులు రోజుకు కనీసం కొంత సమయం కేటాయించి, తమ పిల్లలతో నిజమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆలోచనలు, అలవాట్లు, కలలు, భయాల గురించి తెలుసుకోవాలి. వారి అనుమానాలు నివత్తి చేయాలి.

చెడు అలవాట్ల దిశగా మైనర్లు: చిన్న వయసులోనే అనేకమంది పిల్లలు చెడు స్నేహితుల ప్రభావంలో పడుతున్నారు. సిగరెట్లు, మత్తుపదార్థాలు వంటి వాటిని ప్రయత్నిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం చిన్నపిల్లలే ‘డ్రగ్స్‌ రవాణా’ (drug trafficking)లో భాగస్వామ్యం అయిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో గత మూడేళ్లలోనే 50కి పైగా మైనర్లు డ్రగ్‌ రవాణా చేస్తూ పోలీసులకి చిక్కడం దీనికి ఉదాహరణ. గాంజాయి సరఫరా చేసే వ్యక్తులు ఈ పిల్లలను సులభంగా బలి పశువులుగా మారుస్తున్నారు. ఎందుకంటే, మైనర్లు చట్టపరంగా పెద్ద నేరాలకు బాధ్యులు కారు.
ఈ చెడు అలవాట్లు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మత్తుపదార్థాల వాడకం వల్ల వారి మెదడు అభివద్ధి నిలిచిపోతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీర్ఘకాలిక మానసిక సమస్యలు వస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, పాఠశాలలు, కుటుంబాలు, పోలీసులు సమష్టిగా కషి చేయాలి. పాఠశాలల్లో డ్రగ్స్‌ దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించాలి. పోలీసులు ఇటువంటి ముఠాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించి, అవసరమైనప్పుడు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి.

స్మార్ట్‌ఫోన్‌ – మిత్రుడా? శత్రువా?: నేటి పిల్లల జీవితంలో స్మార్ట్‌ఫోన్‌ విడదీయరాని భాగమైంది. కానీ దీని వల్ల కలిగే నష్టాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పలు సర్వేల ప్రకారం, 11 నుండి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలలో నిరాశ, కోపం, భయం వంటి భావాలు పెరిగినట్లు తెలిసింది. సిపియన్‌ ల్యాబ్స్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 46% టీనేజర్లు వాస్తవ ప్రపంచాన్ని మరచి వర్చువల్‌ ప్రపంచంలో జీవిస్తున్నారు. 37% మంది ఆత్మహత్య ఆలోచనలను కూడా వ్యక్తం చేశారు. అధికంగా స్మార్ట్‌ఫోన్‌ వాడడం వలన పిల్లలు నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోంది, మానసిక అస్థిరత పెరుగుతోంది.
స్మార్ట్‌ఫోన్‌ ఒక రెండు అంచుల కత్తి లాంటిది. ఒకవైపు అది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జ్ఞానాన్ని, నూతన సమాచారాన్ని అందిస్తే, మరోవైపు అది పిల్లలను ఒంటరితనంలోకి నెట్టేస్తుంది. సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులు, లైకులు, కామెంట్లు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సైబర్‌బుల్లింగ్‌ (cyber bullying) ప్రధాన సమస్యగా మారింది. పిల్లలు దీని వల్ల మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి పరిష్కారంగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై పరిమితులు విధించాలి. దానికి బదులుగా, ఆటలు, పుస్తకాలు, కుటుంబంతో గడపడం వంటి వాటిని ప్రోత్సహించాలి. తమ వీధిలో ఉన్న జిమ్ము/ వ్యాయామాలకు ప్రాధాన్యత ఇచ్చి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గ్రామాలలో, మండలాలలో, వీధులలో ఉన్న పౌర గ్రంథాలయానికి తీసుకోవాలి. వారి సమయాన్ని పుస్తకాలతోటి, పత్రికలతో, కథలతో, హాస్యపు చిత్రాలతో గడిపే విధంగా ప్రయత్నం చేయాలి.

విద్యా వ్యవస్థలో నైతిక విలువల అవసరం :
డాక్టర్లు, మానసిక నిపుణులు పిల్లల్లో సమస్యలను తగ్గించేందుకు నైతిక విలువలు (moral values) నేర్పడం ముఖ్యమనే అభిప్రాయానికి వచ్చారు. పాఠశాలల్లో కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, నైతిక విలువలపై దష్టి పెట్టాలి. వారానికి కనీసం ఒక రోజైనా పుస్తకాలు పక్కన పెట్టి, సత్యం, నిజాయితీ, దయ, కరుణ వంటి విలువలను చర్చించాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్కడ మీ పుస్తకాలే కాకుండా మానసిక విలువలను, నైతిక విలువలను పెంపొందించే పుస్తకాలను చదివే విధంగా ప్రేరేపించాలి. విద్యా వ్యవస్థలో నైతిక విలువలను చేర్చడం వల్ల పిల్లలు మంచీచెడుల మధ్య తేడాను గుర్తించగలుగుతారు. వారు సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు ఇది సహాయపడుతుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

వారు పిల్లలకు ‘రోల్‌ మోడల్స్‌’ (role models)గా ఉండాలి. వారి ప్రవర్తన, మాటతీరు పిల్లల మీద గంభీర ప్రభావాన్ని చూపుతాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లలను నేరాల వైపు నెట్టివేస్తోంది. హైదరాబాద్‌లోని పోలీసు రికార్డుల ప్రకారం, 10 నుండి 19 ఏళ్ల వయస్సు గల మైనర్లు పోర్నోగ్రఫీ, డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు వంటి వాటిలో పాల్గొంటున్నట్లు తెలిసింది. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలలో 80కి పైగా పిల్లలు ఈ-సిగరెట్లకు (e-cigarettes) బానిసలయ్యారు. తల్లిదండ్రుల యూపీఐ ఖాతాల నుండి వేల రూపాయలు ఖర్చు చేసిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ సంఘటనలపై తల్లిదండ్రులు తగిన అవగాహన చూపకపోవడం పరిస్థితిని మరింత విషమించేస్తోంది. ఈ నిర్లక్ష్యం పిల్లలలో అభద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని పెంచుతుంది. వారు తప్పు చేసినప్పుడు, తల్లిదండ్రులు తమను శిక్షిస్తారేమోనన్న భయంతో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకిగా మారుతుంది. పిల్లలకు తల్లిదండ్రుల నుండి లభించే ప్రేమ, మద్దతు వారిని సరైన మార్గంలో నడిపిస్తాయి.

పిల్లలను రక్షించే మార్గాలు: పిల్లలను రక్షించడం కేవలం కుటుంబం, పాఠశాల, సమాజం అందరి సమిష్టి బాధ్యత.
కుటుంబ బాధ్యత: ప్రతి ఇంట్లో పెద్దల బాధ్యత పెరగాలి. పిల్లలపై నమ్మకం ఉండాలి, కానీ అదే సమయంలో వారు ఏమి చేస్తున్నారో గమనించడం కూడా అవసరం. స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని పూర్తిగా నియంత్రించే అనేక యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ప్రేమ, సమయానుకూలమైన సలహాలు పిల్లలను సరైన మార్గంలో నడిపిస్తాయి. సమయం దొరికితే పిల్లలతో కబుర్లు, కథలు, మంచి పుస్తకాలను (పాఠ్యపుస్తకాలు కాకుండా) చదవమని ప్రేరేపించాలి

పాఠశాలల పాత్ర: పాఠశాలలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల సమగ్ర వికాసానికి (holistic development) కృషి చేయాలి. క్రీడలు, కళలు, నైతిక విలువలపై చర్చలు వంటి వాటిని ప్రోత్సహించాలి.
సామాజిక బాధ్యత: సమాజం కూడా పిల్లల భద్రతకు బాధ్యత వహించాలి. సైబర్‌ పెట్రోలింగ్‌ (cyber patrolling) పెంచి, ఆన్‌లైన్‌ నేరాలను అరికట్టాలి. మత్తుపదార్థాల రవాణా ముఠాలను అణచివేయాలి. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. హింసాత్మక కంటెంట్‌కు బదులుగా, కుటుంబంతో కలిసి చూడదగిన, విలువలు బోధించే కార్యక్రమాలను ప్రసారం చేయాలి.
పిల్లలను పాఠశాలల్లో సాహిత్యం వైపు, కథలపై, వకత్వ పోటీల వైపు ఆలోచనను ఆ దిశగా పయనింపచేయాలి. ప్రభుత్వాలు కూడా ఒటిటిలో వచ్చే కంటెంట్‌పై నియంత్రణ పెట్టాలి. పిల్లలు చూడదగిన కంటెంట్‌ ఒటిటి లలో సినిమాలలో రావాలి. మితిమీరిన హింస, ఫోర్నోగ్రఫీ వంటి కంటెంట్లపై సరే నా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
నేటి సమాజంలో ఆర్థిక మార్పులు, సాంకేతిక ఆధిపత్యం, వినోదం రూపాంతరాలు – ఇవన్నీ బాల్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా, మార్పు తల్లిదండ్రుల నుండి ఆరంభమైతేనే పిల్లల్లోని తప్పుడు ప్రవర్తనలను నిరోధించవచ్చు. లేకపోతే, చిన్న వయసులోనే హింస, మత్తుపదార్థాలు, నేరాలు వైపు అడుగులు వేసే పిల్లలు మన భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తారు. బాల్యం రక్షణ – ఇది కేవలం కుటుంబమే కాదు, పాఠశాల, సమాజం అందరి సమిష్టి బాధ్యత అని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -