Tuesday, March 3, 2026
E-PAPER
Homeమానవిఐక్యమత్యాన్ని చాటిచెప్పే రంగుల కేళీ

ఐక్యమత్యాన్ని చాటిచెప్పే రంగుల కేళీ

- Advertisement -

ఆటపాటలు, ఆత్మీయతల సమ్మేళనంగా ప్రతి హృదయాన్ని కదిలించే పండుగ హోలీ. ఇది కేవలం రంగుల కేళీ మాత్రమే కాదు. భావాలను వ్యక్తపరచే, బంధాలను బలపరిచే, మనసులను కలిపే మానవతా ఉత్సవం. ఏడాదంతా పనులలో మునిగిపోయే మనం ఒక్కరోజు సరదా, స్నేహం, సోదరభావం అనే రంగుల్లో ముంచెత్తే వేడుక హోలీ.

హోలీ రోజున పలికే ‘హ్యాపీ హోలీ’ అనే మాట కేవలం శుభాకాంక్ష కాదు. అది మనసులను దగ్గర చేసే ఆత్మీయ పలకరింపు. ఒకరిని ఒకరు కౌగిలించుకోవడం, రంగులు చల్లుకోవడం, నవ్వులు పంచుకోవడం.. ఇవన్నీ కలిసి అనుబంధాలను మరింత గాఢం చేస్తాయి. అపార్థాలు, విభేదాలు, దూరాలు అన్నీ రంగుల్లో కరిగిపోతాయి.

అసమానతలకు అతీతమైన ఉత్సవం
హోలీ కుల, మత, వర్గ, ప్రాంత, ఆర్థిక భేదాలకు అతీతమైన పండుగ. పేద – ధనిక అనే వ్యత్యాసం కనిపించదు. చిన్న – పెద్ద అనే తేడా ఉండదు. అందరూ ఒకే రంగులో తడిసి, ఒకే ఉత్సాహంతో పాల్గొంటారు. మనుషులంతా ఒకటేనని, ఆనందం అందరికీ సమానమని ఈ పండుగ స్పష్టంగా చెబుతుంది. సమాజంలో ఏర్పడే గోడలను కూల్చి, ఐక్యతకు వేదికగా నిలిచేది హోలీ.

ప్రకృతి పరిమళంతో నిండిన పాత జ్ఞాపకాలు
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో హోలీ సంబరాలు ప్రకృతితో ముడిపడి ఉండేవి. మోదుగ పూలు, గులాబీలు, వేప ఆకులు, ఇతర వనమూలికలతో సహజ రంగులను తయారు చేసి పండుగ జరుపుకునేవారు. పూల సుగంధం, ప్రకృతి సోయగం మధ్య జరిగే ఆ ఉత్సవాలకు ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది. కాలక్రమేణా సహజ రంగుల స్థానంలో రసాయనాలతో తయారైన కలర్స్‌ విస్తరించాయి. కొన్నిచోట్ల కోడిగుడ్లు వంటి అనవసర అలవాట్లు కూడా చేరాయి. ఆనందాన్ని పంచాల్సిన పండుగ కొన్నిసార్లు అసౌకర్యానికి, ప్రమాదాలకు దారి తీస్తోంది. హోలీ ఉత్సవం ఉత్సాహాన్ని నింపాలి తప్ప విషాదాన్ని కాదు. అందుకే మళ్లీ సహజ రంగుల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

వసంతానికి వర్ణ స్వాగతం
శిశిరం ముగిసి వసంతం అడుగుపెట్టే వేళ హోలీ వస్తుంది. చిగురించిన చెట్లు, వికసించిన పూలు ప్రకృతికి కొత్త అందాన్ని తెస్తాయి. అదే తరహాలో హోలీ మన జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సంగీతం, నృత్యం, ఆటపాటలు మనసులోని అలసటను తొలగించి చైతన్యాన్ని పెంచుతాయి. కాలమార్పుల సమయంలో వచ్చే నీరసాన్ని దూరం చేసి సానుకూల శక్తిని అందించే పండుగ ఇది. హోలీ అనేది కుటుంబాల్ని, స్నేహితులను ఒకచోట చేర్చే వేడుక. ఇంటింటా పిండివంటల సువాసనలు, పిల్లల సందడి, పెద్దల ఆశీర్వాదాలు… ఇవన్నీ కలిసినప్పుడు పండుగ మరింత సార్థకమవుతుంది. స్నేహితులతో నవ్వులు పంచుకుంటూ, పొరుగువారితో ఆత్మీయంగా గడిపే క్షణాలే జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలవుతాయి.

హోలీ ఆనంద కేళీ
హోలీ అనేది కుటుంబాల్ని, స్నేహితులను ఒకచోట చేర్చే వేడుక. ఇల్లంతా పిండివంటల సువాసనలు, పిల్లల సందడి, పెద్దల ఆశీర్వాదాలు.. ఇవన్నీ కలిసినప్పుడు పండుగ మరింత సార్థకమవుతుంది. స్నేహితులతో నవ్వులు పంచుకుంటూ, పొరుగువారితో ఆత్మీయంగా గడిపే క్షణాలే జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలవుతాయి. రంగులు ముఖాలపై పరచుకునే వేళలో మనసులపై కూడా ప్రేమ రంగు పూయాలి. విభేదాలను దహనం చేసి, స్నేహాన్ని ఆహ్వానించాలి. ప్రకృతికి దగ్గరగా, పరస్పర గౌరవంతో, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జరుపుకున్నప్పుడే హోలీ అసలైన మహోత్సవంగా నిలుస్తుంది. ఈ హోలీ సందర్భంగా మనమందరం ఒకటిగా నిలుద్దాం. ఆనందాన్ని పంచుకుందాం. మానవత్వాన్ని రంగుల్లో ముంచెత్తుదాం. హోలీ ఆనంద కేళీగా మారి ప్రతి హృదయం హాయిగా వికసించాలి.

ఆరోగ్యకర హోలీకి జాగ్రత్తలు
సహజ రంగులనే ఉపయోగించాలి.
రసాయన పదార్థాలతో కూడిన రంగులను దూరంగా ఉంచాలి.
కోడిగుడ్లు, హానికర పదార్థాలు వాడకూడదు.
కళ్లలో రంగు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నీటిని వృథా చేయకుండా పరిమితంగా వినియోగించాలి.
ఇతరుల సమ్మతితోనే రంగులు చల్లాలి.

గడగోజు రవీంద్రాచారి, 9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -