Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరియల్‌ ఎస్టేట్‌ రంగానికి స్వర్ణయుగం

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి స్వర్ణయుగం

- Advertisement -

మౌలిక వసతుల కల్పనకు రూ.20వేల కోట్లు
రెండేండ్లలో ఖర్చు చేస్తాం : క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌రంగానికి స్వర్ణ యుగంగా మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. దానిలో భాగంగా క్యూర్‌-ప్యూర్‌-రేర్‌ కేటగిరీలుగా రాష్ట్రాన్ని విభజించి, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దీనికోసం రెండేండ్లలో దాదాపు రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. క్రెడాయ్ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎగ్జిబిషన్‌ షోను ఆయన ప్రారంభించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, క్రెడాయ్ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎన్‌ జైదీప్‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ బీ జగన్నాధరావు, జనరల్‌ సెక్రటరీ క్రాంతి కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో రూ.7 వేల కోట్లకు పైగా విలువైన అండర్‌పాస్‌లు, రోడ్డువిస్తరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అనేక గ్రామపంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేసి, పట్టణీకరణకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్‌విండో విధానాన్ని అమలు చేస్తున్నామనీ, పారిశ్రామికరంగంతో పట్టణాలను అనుసంధానం చేసేలా భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించామన్నారు. మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు, హాస్పిటాలిటీ, పర్యాటకం సహా అన్ని అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడి వాతావరణమే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదనీ, దానివల్లే పెట్టుబడులు పెద్దమొత్తంలో వస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ వచ్చే 15 నుంచి 20 ఏండ్లలో భారతదేశం అపూర్వమైన రీతిలో పట్టణ వలసలను చూస్తుందనీ, ఇది చైనా పరివర్తనతో పోలి ఉంటుందని విశదీకరించారు. భారతదేశ జీడీపీకి దాదాపు 8 శాతం తోడ్పాటును రియల్‌ ఎస్టేట్‌ రంగం అందిస్తున్నదని చెప్పారు. మూడురోజులు జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సందర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రాపర్టీ షో కన్వీనర్‌ సుశీల్‌కుమార్‌ జైన్‌, కో-కన్వీనర్‌ ఎన్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -