అవును! నగనేత్రానికిది
పిడికెడు బూడిదే కావచ్చు
అంతర్నేత్రానికిది అవనతంచేసిన
ప్రజాపతాకపు నివాళి
అవశేషంగా మిగిలిన ఒక జాతి
స్వర రాగపు జావళి
ఫీనిక్స్ గుడ్లను పొదిగే
వెచ్చని వెదురు గూడు కూడా!
లోహ పంజరపు ఊచల్లో తరంతరం పెనుగులాడి
మరో ప్రపంచపు స్వప్న ఊయల్లో నిరంతరం తేలియాడి
పరిపూర్ణ వికాసంలో పరిణతికై పోటీపడుతూ
సరైన పంథాలో సాగిపోయిన స్వేచ్ఛాగూళ్ళ సాలీళ్ళు!
ఆటల అడుగుల్లో అడుగులేయిస్తూ
పాటల పదాల్లో పాదాలు కలుపుతూ
గుండె గుండెలో గుజ్జెన గూళ్ళు కట్టి
ఆకాశ శిఖరాలై నిలిచి తరించిన ధ్వజస్తంభాలు!
ఆర్తుల బాధలను చూసిన తక్షణమే
ఒరలను త్యజించిన కరవాలాలు!
గర్వోన్నతులముందు తలవంచకుండా
సర్వోన్నతులై అర్ధాంతరంగా
నిర్జించబడిన లక్ష్య సాధకులు!
సతత హరిత శాశ్వతత్వం కోసం
సమర శంఖారావాల్ని సదా పూరిస్తూ
సహచర ప్రాణికోటి మనుగడ కోసం
దేహాల్ని ఆత్మల్నీ సజీవంగా
బలిదానం చేసిన అసలు దేశభక్తుల ఆనవాలిదే!
– కరిపె రాజ్ కుమార్, 8125144729
పిడికెడు బూడిదే
- Advertisement -
- Advertisement -

 
                                    