బాపూఘాట్‌లో గవర్నర్, మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్‌హౌజ్ బాపూఘాట్‌లోని బాపు సమాధి వద్ద శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్‌తో కలిసి గవర్నర్ పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ మనందరికి స్ఫూర్తిదాయకమని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. స్పెషల్ ఛీప్ సెక్రెటరీ దాన కిషోర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ తాప్సీర్ ఇక్బాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, పర్యాటక, ఆర్‌అండ్‌బి, మెడికల్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు గాంధీజీకి నివాళులర్పించారు.



