Monday, March 23, 2026
E-PAPER
Homeమానవిమ‌హిళ‌ల జీవితాల హృద్య‌చిత్రణ‌ అప‌రాజిత‌

మ‌హిళ‌ల జీవితాల హృద్య‌చిత్రణ‌ అప‌రాజిత‌

- Advertisement -

శివానీ శర్మ… తన తొలి కవితా సంకలనం ‘అపరాజిత’ను ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. మహిళల కోసం యువర్‌ స్టోరీ నిర్వహించే ఓ కార్యక్రమమైన ‘షీస్పార్క్స్‌’లో ఇటీవలె ఆవిష్కరించారు. ఆమె పరిశీలన, వ్యక్తిగత జ్ఞాపకాల నుండి ఉద్భవించిన కవితలు ఇవి. ఒక మహిళ జీవితంలోని అంతరంగాన్ని మనకు పరిచయం చేస్తాయి. మహిళలు బయటకు చెప్పని ఉద్రిక్తతలు, నిశ్శబ్ద కృతజ్ఞత, రోజువారీ సంబంధాలలోని భావోద్వేగ శ్రమను మనం ఇందులో చూడొచ్చు. మహిళలు సహించే, ప్రశ్నించే, పునర్నిర్మించుకునే, ఉన్నత స్థాయికి ఎదిగే అనేక మార్గాలను నిశ్శబ్దంగా ప్రకటించే అద్భుతమైన కవితా సంపుటి ఇది. అలాంటి తన కవితా సంపుటి గురించి ఆమె ఏమంటున్నారో ఈరోజు మానవిలో…

మీ కవిత్వంలో నిశ్శబ్దానికి ఎంత ప్రాముఖ్యం ఉంది?
నిజానికి నేను రాసిన చాలా కవితలకు నిశ్శబ్దమే మూలం. మన జీవితాలలో అత్యంత లోతైన భావోద్వేగాలు కొన్ని ఎప్పుడూ బయటకు చెప్పబడవు. సాధారణంగా కుటుంబాలు సంజ్ఞలు, విరామాలు, చెప్పని విషయాల ద్వారా సంభాషిస్తాయి. ఆ నిశ్శబ్దాలను నిలుపుకునే ప్రత్యేక సామర్థ్యం కవిత్వానికి ఉందని నేను భావిస్తాను. కొన్నిసార్లు రాయబడని దానికి కూడా, రాసిన దానికి ఉన్నంత అర్థమే ఉంటుంది. ‘అపరాజిత’లోని కవితలు జీవితంలోని నిశ్శబ్ద క్షణాలలా అనిపించాలని నేను కోరుకున్నాను. పాఠకులు ఆగి, తమలో తాము ఏదో సుపరిచితమైనదాన్ని గుర్తించే క్షణాలలా.

ఈ కవితలు మీతో రాయించిన క్షణం లేదా వ్యక్తిగత అనుభవం ఏదైనా ఉందా?
‘అపరాజిత’ ఒకే ఒక్క క్షణంతో మొదలవ్వలేదు. నాలో నిశ్శబ్దంగా నిలిచిపోయిన ఎన్నో చిన్న చిన్న క్షణాలతో అది మొదలైంది. మా అమ్మతో ఓ సంభాషణ, మా నాన్న వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడాన్ని చూడటం, నా చుట్టూ ఉన్న స్త్రీలు తమ అలసటను ఎన్నడూ బయటపెట్టకుండా బాధ్యతలు మోయడాన్ని గమనించడం.. వంటి క్షణాలు నెమ్మదిగా నాలో నిండిపోయాయి. అయితే అవి చాలా కాలం పాటు నేను మోస్తున్న భావనలుగానే ఉన్నాయి. కానీ ఒక రోజు, ఈ భావనలలో కొన్ని కథలు దాగి ఉన్నాయని నేను గ్రహించాను. ఆ చెప్పలేని భావాలే కవిత్వంగా మారాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ‘అపరాజిత’ ఒక సంఘటనతో మొదలవ్వలేదు. అది జీవితంలోని ఎన్నో సంఘటనల సముదాయంతో మొదలైంది. జ్ఞాపకాలు, నిశ్శబ్దాలు, సంబంధాలు, మనం తరచుగా గమనిస్తూ అరుదుగా వ్యక్తపరిచే స్త్రీల నిశ్శబ్ద దృఢత్వమే ‘అపరాజిత’.

మీ కవితల్లో చాలా వరకు మహిళల భావోద్వేగ శ్రమను అన్వేషిస్తాయి. మీ పరిశీలన, వ్యక్తిగత జ్ఞాపకాలు.. లేదా రెండింటి నుండి పుట్టాయా?
కచ్చితంగా రెండింటి నుండి పుట్టాయి. మీరు చిన్నప్పటి నుండి తల్లులు, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు వంటి మహిళలను దగ్గరగా గమనిస్తూ పెరిగి వుంటారు. ఆ సమయంలో మీరు ఒక సూక్ష్మమైన విషయాన్ని గమనించడం ప్రారంభిస్తారు. వారు కేవలం పనితోనే కాకుండా తమ భావోద్వేగ సాన్నిధ్యంతో కుటుంబాలను కలిపి ఉంచుతారు. అందరి అవసరాలను గుర్తుంచుకుంటారు, ఉద్రిక్తతలను గ్రహిస్తారు, విభేదాలను చల్లార్చి, సంబంధాలను సజీవంగా ఉంచుతారు. ఈ శ్రమ చాలా భాగం బయటకు కనిపించదు. ఎందుకంటే అది కేవలం ప్రేమతో ముడిపడి ఉంటుంది. కొన్ని కవితలైతే నా మనసులో చెరగని ముద్ర వేసిన వ్యక్తిగత జ్ఞాపకాల నుండి వచ్చాయి. మరికొన్ని నా చుట్టూ ఉన్న మహిళలను గమనించడం ద్వారా పుట్టాయి. మహిళలు చేసే రోజువారి పనులలో ఎంత శక్తి దాగి వుందో, ఈ శ్రమను ఎంత తేలికగా తీసుకుంటుందో అనే విషయం నుండి వచ్చాయి. కనుక ఈ కవితలన్నీ కుటుంబాలలో మహిళలు నిర్మించే ఆ కనిపించని భావోద్వేగ నిర్మాణానికి ఒక నివాళి.

తల్లిదండ్రులు, తోబుట్టువుల గురించి మీరు రాసే విధానంలో ఓ సున్నితత్వం ఉంది. ఈ సంబంధాలను తిరిగి గుర్తు చేసుకోవడం మీ రచనా ప్రక్రియను ఎలా ప్రభావితం చేసింది?
ఈ కవితలు రాస్తునపుడు నా హృదయానికి సంబంధించిన పాత ఫోటో ఆల్బమ్‌లను తెరవడంలా అనిపించింది. వేగవంతమైన జీవితంలో, ఆ బంధాల లోతు గురించి ఆలోచించే తీరిక మనకు ఉండదు. కానీ నేను రాయడం మొదలుపెట్టినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ నా ముందుకు వచ్చాయి. బాల్యపు రోజులు, చిన్న చిన్న ఆప్యాయతలు, ఆ సమయంలో నేను పూర్తిగా అర్థం చేసుకోలేని మా తల్లిదండ్రుల ప్రేమ, సంతోషకరమైన జ్ఞాపకాలతో పాటు ఎన్నో విచారకరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ తిరిగి గుర్తు చేసుకోవడం, నా రాసే ప్రక్రియను చాలా భావోద్వేగ భరితంగా మార్చింది. ఇది మా తల్లిదండ్రులను కేవలం తల్లిదండ్రు లుగా మాత్రమే కాకుండా, వారి పోరాటాలు, త్యాగాలు, నిశ్శబ్ద బలాలను మోసిన వ్యక్తులుగా చూడటానికి నాకు అవకాశం కల్పించింది. ఇదంతా సహజంగానే కవితల్లోకి సున్నితత్వాన్ని తీసుకువచ్చింది.

మీ కవితలు సున్నితంగా ఉంటాయి. స్త్రీల జీవితంలో సున్నితత్వాన్ని మీరు ఒక రకమైన బలంగా చూస్తారా?
కచ్చితంగా. శక్తిలాగే, మాతృత్వపు సహజాతాలతో నిండిన సున్నితమైన హృదయం ఆమెకు ఉంది. అయినప్పటికీ యుద్ధభూమిలో నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. మనందరిలోనూ శక్తి ఉంది. తరచుగా మనలోని బలాన్ని ఆర్భాటం, ఘర్షణ లేదా ఆధిపత్యంతో ముడిపెడతాం. కానీ వాస్తవానికి, చాలా మంది మహిళలు ఓర్పు, సానుభూతి, నిశ్శబ్ద సహనం ద్వారా బలాన్ని ప్రదర్శిస్తారు. అవసరమైనప్పుడు ఆధిపత్యాన్ని కూడా కనబరుస్తారు. స్త్రీలోని మృదుత్వాన్ని చాలామంది బలహీనతగా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ అది స్థైర్యం యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటని నేను నమ్ముతాను. కరుణతో ఉండటం, సంబంధాలను మెరుగుపరచడం, కష్టాలు ఎదురైనా మౌనంగా భరించడం.. వీటన్నింటికీ అపారమైన అంతర్గత బలం అవసరం. ‘అపరాజిత’లోని మహిళలు అటువంటి బలానికి ప్రతిరూపంగా నిలుస్తారు. వారు తమ శక్తిని ప్రకటించవచ్చు లేదా ప్రకటించకపోవచ్చు. కానీ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి వారు సిద్ధంగా ఉంటారు.

అపరాజిత అనేది వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అర్థాలను ఇస్తుంది. రోజువారీ జీవితంలో ‘అజేయంగా ఉండటం’ అనేది ఎలా కనిపిస్తుంది?
నా వరకు, అపరాజితగా ఉండటం అంటే యుద్ధాలు గెలవడం లేదా ప్రపంచానికి ఏదో నిరూపించడం అని కాదు. జీవితంలోని సవాళ్లు ఎదురైనా మీ అంతరాత్మకు నిజాయితీగా ఉండటం. నిరాశ, బాధ కలిగిన క్షణాల తర్వాత కూడా ఆశను కోల్పోకుండా ఉండటం, ప్రేమించడం, పునర్నిర్మించుకోవడం. నాకు తెలిసిన చాలా మంది మహిళలు వారి రోజువారీ జీవితంలో అపరాజితలుగా ఉంటారు. వారు తమ కలలను, గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే కుటుంబాలు, వృత్తి, అంచనాలు, భావోద్వేగాలను సమతుల్యం చేసుకుంటారు. అజేయంగా ఉండటం అంటే ఎప్పుడూ పడిపోకపోవడం కాదు. దయ, ధైర్యంతో మళ్లీ లేచి నిలబడటం.
– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -