ఇరాన్ దెబ్బకు ఎఫ్-35కు భారీ నష్టం
అజేయమనుకున్న ఫైటర్ జెట్‌పై దాడి
స్టెల్త్ టెక్నాలజీకి సవాల్ విసిరిన టెహ్రాన్ వైమానిక రక్షణ
ప్రపంచ యుద్ధ వ్యూహాలపై ప్రభావం : నిపుణులు
టెహ్రాన్ : ప్రపంచంలో అత్యాధునికమైన స్టెల్త్ ఫైటర్ జెట్‌గా పేరుగాంచిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ దెబ్బతీయడం యుద్ధంలో కీలక మలుపుగా మారింది. ఇప్పటి వరకు యుద్ధంలో ఎప్పుడూ దెబ్బతినని ఈ జెట్‌పై దాడి జరగడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా అత్యాధునిక యుద్ధ సామర్థ్యానికి ప్రతీక ఎఫ్-35 ఫైటర్ జెట్. దీనిని ఇరాన్ గాలిలోనే గుర్తించి, లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఘటన 19న జరిగినట్టు సమాచారం. ఈ ఘటనకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్ వైమానిక రక్షణ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రకటించారు.
”మేము ఎక్కడైనా ఎగురుతాం..మాపై ఎవరూ కాల్పులు జరపడం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ కొన్ని గంటల్లోనే ఎఫ్-35పై దాడి జరగడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.అయితే ఇరాన్ తాజా దాడి అమెరికాకు చాలా అవమానకరమని వాషింగ్టన్ భావిస్తోంది. దీంతో దాడి విషయాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. దెబ్బతిన్న జెట్ అత్యవసరంగా మధ్యప్రాచ్యంలోని ఒక బేస్‌లో ల్యాండ్ అయిందని వాదిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం ఆ జెట్ కూలిపోయిందని ప్రకటించింది. మరో ఎఫ్-35 కూడా బందర్ అబ్బాస్ ప్రాంతంలో దెబ్బతిన్నట్టు సమాచారం.
ఎలా సాధ్యమైంది?
స్టెల్త్ టెక్నాలజీ వల్ల రాడార్‌కు కనిపించకుండా ఉండే ఎఫ్-35 జెట్‌ను ఎలా గుర్తించారు అన్నది కీలక ప్రశ్నగా మారింది. నిపుణులు ప్రకారం… ‘స్టెల్త్ అంటే పూర్తిగా కనిపించదు అనుకోవడం తప్పు’ అని అంటున్నారు. ఇరాన్ ఇన్‌ఫ్రారెడ్ సిస్టమ్ (ఐఆర్‌ఎస్‌టీ) ఉపయోగించి జెట్ నుంచి వెలువడే వేడిని గుర్తించి ట్రాక్ చేసినట్టు భావిస్తున్నారు. ఎఫ్-35 ఇంజిన్ అధిక వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ హీట్ సిగేచర్‌ను ఉపయోగించి క్షిపణి దాడి జరిపినట్టు అంచనా. ముఖ్యంగా ‘358 మిసైల్’ (ఎస్‌ఏ-67) వంటి లోయిటరింగ్ మ్యూనిషన్ ఉపయోగించి దాడి చేసి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు.
తాజా ఘటన ప్రభావం
ఈ ఘటన అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ వ్యూహాలను పున:పరిశీలించడానికి దారి తీస్తుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ వైమానిక రక్షణ బలహీనమైందని భావించి అమెరికా బాంబర్ విమానాలను వినియోగించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇకపై యుద్ధ విమానాలు మరింత ఎత్తులో ఎగరడం, అధునాతన ఆయుధాలు వినియోగించడం అవసరం కావచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
చారిత్రక పోలిక
ఈ ఘటనకు ఎఫ్-117 నైట్‌హాక్ కూల్చివేతతో పోలికలు తీసుకొస్తున్నారు. 1999లో నాటో.. యుగోస్లోవియా బాంబింగ్ సమయంలో ఈ స్టెల్త్ విమానాన్ని పాత సోవియట్ క్షిపణితో కూల్చివేశారు. ఇప్పుడు అదే తరహాలో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న జెట్ కూడా బలహీనతలు కలిగి ఉన్నాయని ఈ ఘటన చూపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.



