Thursday, October 16, 2025
E-PAPER
Homeజాతీయంఐపీఎస్‌ ఆత్మహత్యపై న్యాయవిచారణ చేయాలి

ఐపీఎస్‌ ఆత్మహత్యపై న్యాయవిచారణ చేయాలి

- Advertisement -

ప్రధానికి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి బేబీ లేఖ
పూరన్‌కుమార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రతినిధి బృందం

న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన ఐపీఎస్‌ అధికారి వై.పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ ఎం.ఎ.బేబీ ఒక లేఖ రాశారు. కొంతమంది అధికారుల చేతుల్లో కుల వివక్షను, వేధింపులను ఎదుర్కొన్నానని పేర్కొంటూ పోలీసు అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనపై తాము తీవ్రంగా ఆవేదన, ఆందోళన చెందుతున్నామని, అందుకే ఈ లేఖ రాస్తున్నామని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు. హర్యానా ఏడీజీపీ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను కామ్రేడ్‌ బేబీ నేతృత్వంలోని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం కలుసుకుంది, వారిని పరామర్శించింది. ఈ ప్రతినిధి బృందంలో కామ్రేడ్స్‌ బీవీ రాఘవులు (పొలిట్‌బ్యూరో సభ్యులు), ప్రేమ్‌చంద్‌ (హర్యానా రాష్ట్ర కమిటీ కార్యదర్శి), ఇందర్‌జిత్‌ సింగ్‌ (హర్యానా రాష్ట్ర మాజీ కార్యదర్శి), ఆర్‌.ఎల్‌.మౌద్గిల్‌ (పంజాబ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు) వున్నారు.

ఆ పర్యటన ముగిసిన వెంటనే బేబీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పూరణ్‌ కుమార్‌ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పైగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన అధికారులకు పోలీసు సర్వీస్‌లో అందుబాటులో వున్న రక్షణ యంత్రాంగాలు, జవాబుదారీతనం, పని పరిస్థితుల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందని ఆ లేఖ పేర్కొంది. ముఖ్యంగా అద్భుతమైన సర్వీసు రికార్డు కలిగిన దళిత అధికారి పూరణ్‌ కుమార్‌ ఇటువంటి తీవ్రమైన చర్యకు పాల్పడే పరిస్థితులు తలెత్తడం విచారకరమని ఆ లేఖ పేర్కొంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ దళిత విద్యార్ధి రోహిత్‌ వేముల ఆత్మహత్య ఇంకా అనేకమంది దళిత విద్యార్ధులు, అధికారులు భరించనలవికాని కుల వివక్ష, వ్యవస్థాగతమైన వేధింపులు కారణంగా తమ ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్న ఘటనలు చూస్తుంటే మన వ్యవస్థలను పట్టి పీడిస్తున్న వ్యవస్థాగత అణచివేత ఎలా వుందో తెలుస్తోందని ఆ లేఖ పేర్కొంది.

తాము వ్యక్తిగతంగా వెళ్ళి చండీగడ్‌లోని పూరణ్‌ కుటుంబ సభ్యులను కలిశామని, వారితో మాట్లాడి వారి ప్రగాఢమైన ఆవేదన, విచారం గురించి తెలుసుకున్నామని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి, న్యాయం జరిగేలా చూసేందుకు గానూ స్వతంత్ర, పారదర్శక విచారణ జరగాల్సి వుందని వారి మాటలను బట్టి స్పష్టమవుతోందని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని, పూరణ్‌ కుమార్‌ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై అలాగే కుల వేధింపుల ఆరోపణలు, వ్యవస్థాగత తోడ్పాటు అందడంలో లోపాల గురించి దర్యాప్తు చేపట్టాలని ఆ లేఖ కోరింది.

జ్యుడీషియల్‌ విచారణ నివేదిక వచ్చే వరకు పూరణ్‌ కుమార్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న అధికారులందరినీ తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దర్యాప్తు క్రమాన్ని ఏ రకంగానూ ప్రభావితం చేయకుండా వుండేందుకు ఈ చర్య తీసుకోవడం తప్పనిసరని లేఖలో పేర్కొన్నారు. సక్రమ, పారదర్శక జ్యుడీషియల్‌ విచారణ వల్ల ఇప్పటికే మనోవేదనను అనుభవిస్తున్న ఆ కుటుంబానికి ఊరట కలగడమే కాకుండా రాజ్యాంగ విలువల పట్ల దేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకమైన వివక్షను ఎదుర్కొనకుండా రక్షణ కల్పిస్తుందని ఆ లేఖ పేర్కొంది. ఈ విషయంలో ప్రధాని కార్యాలయం అత్యవసరంగా స్పందించి, తగు చర్యలు తీసుకోగలదని విశ్వసిస్తున్నామని కామ్రేడ్‌ బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -