Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆయుష్‌లో లేని ఆలనాపాలన

ఆయుష్‌లో లేని ఆలనాపాలన

- Advertisement -

అసౌకర్యాల నడుమ ఎంజీఎంలోని డిస్పెన్సరీలు
శిథిలావస్థలోని భవనంలోనే సేవలు
సౌకర్యాల్లేక తిరిగి వెళ్లిపోతున్న రోగులు
ఐదు నెలలుగా వేతనాల్లేని యోగా ఇన్‌స్ట్రక్టర్లు

ఆయూష్‌లో ఆలనా పాలన లేకుండా పోతోంది. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో వున్న హోమియోపతిక్‌, యునాని డిస్పెన్సరీల పరిస్థితి కడుదయనీయంగా వుంది. హోమియోపతిక్‌ డిస్పెన్సరీలో మెడికల్‌ ఆఫీసర్‌ రిటైర్‌ అయి వారం రోజులు గడిచినా నేటికీ మరో మెడికల్‌ ఆఫీసర్‌ నియామకం జరగలేదు. మందులు లేవు, సౌకర్యాలు అసలే లేవు. గురువారం ‘నవతెలంగాణ’ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలోని హోమియోపతిక్‌, యునాని డిస్పెన్సరీలను సందర్శించగా పలు సమస్యలు కండ్లకు కట్టాయి.

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
హోమియోపతి, యునానిలకు ఒకే భవనాన్ని కేటాయించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిస్తే వరద ఈ డిస్పెన్సరీలలోకి రావడమే కాదు.. పైకప్పు సిమెంటు రేకులు కురుస్తాయి. బకెట్‌లను పెట్టి నీళ్లను బయట పోస్తున్న దుస్థితి వుంది. దీనిపై జిల్లా కలెక్టర్‌, ఎంజిఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజాసంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వాష్‌రూమ్‌లు లేకపోవడంతో మహిళా సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ డిస్పెన్సరీలలో ఒక్కో యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించినా ప్రత్యేక షెడ్‌, మ్యాట్‌లు ఏర్పాటు చేయలేదు. ఐదు నెలలుగా వీరికి వేతనాలు లేవు.

రోగులకు అందని వైద్యసేవలు
హోమియో డిస్పెన్సరీలో వారం రోజులుగా మెడికల్‌ ఆఫీసర్‌ లేరు. ఈ డిస్పెన్సరీకి ప్రతిరోజూ 70-80 మంది ఔట్‌ పేషంట్లు వస్తుంటారు. వారం రోజుల కిందట ఇక్కడి మెడికల్‌ ఆఫీసర్‌ రిటైర్‌ అయ్యారు. నాటి నుంచి వైద్యసేవలందించడానికి మరో మెడికల్‌ ఆఫీసర్‌నైనా డిప్యూటేషన్‌పై కూడా నియమించేందుకు ఉన్నతాధికారులకు సమయం దొరకడం లేదు. హన్మకొండలోని వడ్డేపల్లి డిస్పెన్సరీకి వెళ్లాలని సిబ్బంది రోగులకు చెప్పి తిప్పి పంపుతున్నారు.

రెగ్యులర్‌ ఫార్మాసిస్టుకు డిప్యూటేషన్‌
యునాని డిస్పెన్సరీలో రెగ్యులర్‌ ఫార్మాసిస్టు స్వాతి ఉండేవారు. ఈ ఫార్మాసిస్టును హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై పంపారు. దీనిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఒక ఫార్మాసిస్టును వారం రోజులలో మూడ్రోజులు పనిచేసేలా డిప్యూటేషన్‌పై ఉంచారు. ఆ ఫార్మసిస్టు మూడ్రోజులు సోమ, మంగళ, బుధవారాలు ఎంజీఎం యునాని డిస్పెన్సరీలో, మరో మూడ్రోజులు ఐనవోలు డిస్పెన్సరీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ డిప్యూటేషన్‌లు కూడా డబ్బులు తీసుకొని చేస్తున్నట్టు వరంగల్‌ జోన్‌ ఆర్‌డిడి కార్యాలయం అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆరోపణలున్నాయి.

యోగా ఇన్‌స్ట్రక్టర్లకు కనీస వేతనాలు వెంటనే చెల్లించాలి
హోమియోపతి, యునాని డిస్పెన్సరీలలో పనిచేస్తున్న యోగా ఇన్‌స్ట్రక్టర్లకు వెంటనే కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. డిస్పెన్సరీలలో వారికి కనీస వసతులు కల్పించాలి. ఎంజిఎం ఆస్పత్రి ప్రాంగణంలో వెంటనే ఈ డిస్పెన్సరీలకు అన్ని వసతులున్న పక్కా భవనాలు కేటాయించాలి. –సింగారపు బాబు, సీఐటీయూ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -