నెల రోజులకు మాత్రమే సరిపడ స్టాక్
32 కోట్ల కుటుంబాలపై ప్రభావం
పశ్చిమాసియా సంక్షోభం ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటింట్లో మంట పుట్టించనున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 32 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుందని స్పష్టమవుతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్‌పీజీ కొనుగోలుదారు అయిన భారత్, తన అవసరాల కోసం 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో అత్యధిక భాగం హార్ముజ్ జలసంధి గుండానే రావాల్సి ఉండటంతో, ప్రస్తుతం అక్కడ రవాణా నిలిచిపోవడం భారత ఇంధన భద్రతకు పెను సవాలుగా మారిందని బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో కేవలం 30 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఒకవేళ యుద్ధం కారణంగా సరఫరా చెయిన్ పునరుద్ధరణకు సమయం పడితే, వచ్చే నెల నుండే గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమై కోట్లాది ఇండ్లలో పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడవచ్చన్నారు. అమెరికా నుంచి అత్యవసరంగా దిగుమతి చేసుకోవాలని భావించిన అక్కడి నుంచి సరుకు చేరడానికి కనీసం 25 రోజులకు పైగా సమయం పడుతుంది. ఇది గల్ఫ్ దేశాల నుంచి పట్టే ఒక వారం సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ కావడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరగనున్నాయి.
చమురు పరిస్థితి అంతంతే..
గ్యాస్‌తో పాటు చమురు లభ్యత పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 100 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి స్టోరేజ్ ట్యాంకులు, భూగర్భ రిజర్వుల్లో, ఇండియాకు విదేశాల నుంచి వస్తున్న చమురు నౌకల్లో ఉన్నాయి. ఇవి కేవలం 40-45 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతాయని రిపోర్టులు వస్తోన్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం వాడే చమురులో దాదాపు 88 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ తయారీకి అవసరమైన ముడి చమురులో 50 శాతానికిపైగా పశ్చిమాసియా దేశాల నుంచి వస్తుంది.
పారిశ్రామిక రంగం బెంబేలు..
పారిశ్రామిక అవసరాలకు వాడే ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఇప్పటికే 50 శాతం వరకు కోత విధించినట్టు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ప్రకటించడం పారిశ్రామిక రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ముడి చమురు నిల్వలు దాదాపు 8 వారాల వరకు ఉన్నప్పటికీ, సరఫరా పూర్తిగా నిలిచిపోతే ఇంధన రేషనింగ్ చేయాల్సిన గడ్డు పరిస్థితి తలెత్తవచ్చని ఆ వర్గాలు బెంబేలెత్తుతున్నాయి. ఇది రవాణా వ్యవస్థపై ప్రభావం చూపి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటేలా చేసి ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



