Friday, January 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅశాంతి రగిల్చే 'శాంతి'చట్టం!

అశాంతి రగిల్చే ‘శాంతి’చట్టం!

- Advertisement -

ఇటీవల అమల్లోకి వచ్చిన ”సస్టైనబుల్‌ హార్నెసింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా చట్టం, 2025”పై పౌర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం న్యూక్లియర్‌ పరిశ్రమలో అసురక్షిత పద్ధతులను ప్రోత్సహిస్తుంది, దీని వల్ల భారతపౌరులు న్యూక్లియర్‌ విపత్తు ప్రమాదానికి గురవుతారు. అలాగే, న్యూక్లియర్‌ ప్రమాదాల నుంచి ఉత్పన్నమయ్యే భారీ బాధ్యతలతో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదం కలిగే అవకాశాలే ఎక్కువ. ఈ చట్టం సివిల్‌ లయబిలిటీ ఫర్‌ న్యూక్లియర్‌ డ్యామేజ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 17(బి)ను తొలగిస్తుంది. ఈ సెక్షన్‌ సరఫరా చేసిన ఉపకరణాలలో దాగిఉన్న లోపాలు లేదా స్పష్టమైన లోపాల వల్ల ప్రమాదం జరిగితే సరఫరాదారులను జవాబుదారీగా చేసేది. ఇది అమెరికా ఒత్తిడి కింద జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు 23 మే 2025న జారీచేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో భారత్‌ దేశీయ న్యూక్లియర్‌ బాధ్యత నియమాలను అంతర్జాతీయ నిబంధనలతో సమలేఖనం చేయాలని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ను ఆదేశించారు.

ఈ నిబంధన తొలగింపు మునుపటి న్యూక్లియర్‌ ప్రమాదాల నుంచి వచ్చిన శాస్త్రీయ నేర్పులకు విరుద్ధం. ఇప్పటివరకు జరిగిన మూడు ప్రధాన ప్రమాదాలు-ఫుకుషిమా, చెర్నోబిల్‌, థ్రీ మైల్‌ ఐలాండ్‌-లలో డిజైన్‌ లోపాలు ముఖ్య పాత్ర పోషించినట్లు నిరూపితమైంది. శాంతి చట్టం న్యూక్లియర్‌ సంఘటనకు గరిష్ట బాధ్యతను 300 మిలియన్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (సుమారు రూ.4,500 కోట్లు)కు పరిమితం చేస్తుంది. కానీ ఇది ఫుకుషిమా విపత్తు శుభ్రపరచడానికి అంచనా వ్యయంలో సుమారు వెయ్యవ వంతు మాత్రమే. అలాగే చెర్నోబిల్‌ ప్రమాదంలో గోవా పరిమాణంలో ఉన్న ప్రాంతం నివాస యోగ్యం కాకుండా పోయింది. భారత్‌ దట్టమైన జనాభా కలిగిన దేశం కావడంతో న్యూక్లియర్‌ విపత్తు నష్టాలు మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఈ స్వల్ప బాధ్యత పరిమితి అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అపర్యాప్తం. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం, న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌ మధ్య విభజించబడుతుంది. ఆపరేటర్‌ బాధ్యత ప్లాంట్‌ పవర్‌ అవుట్‌పుట్‌ ఆధారంగా గ్రేడ్‌ చేయబడింది.చిన్న ప్లాంట్లు (150 ఎండబ్ల్యూఈ కంటే తక్కువ) ఆపరేటర్లకు ప్రమాదం ఎంత నష్టం కలిగించిన గరిష్ట బాధ్యత రూ.వంద కోట్లు మాత్రమే. అయితే, చిన్న న్యూక్లియర్‌ రియాక్టర్‌ నిర్మాణం, నిర్వహణ వ్యయం ఈ మొత్తాన్ని ఎన్నోరెట్లు మించిపోవచ్చు.

ఆపరేటర్‌ గరిష్ట జరిమానా చెల్లించి భద్రత లోపాలను సరిచేయకుండా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా శాంతి చట్టం లాభాపేక్షతో కూడిన ప్రయివేట్‌ ఆపరేటర్లకు తలుపులు తెరిచింది. శాంతి చట్టం అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్‌ను ప్రస్తుత రూపంలోనే కొనసాగిస్తుంది. అంతేకాకుండా, దాని సభ్యులను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెక్రటరీ అధ్యక్షత వహించే అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ నియమిస్తుంది. అంటే, రెగ్యులేటర్‌ను నియమించేది దాని సౌకర్యాలను రెగ్యులేట్‌ చేయాల్సిన సంస్థే. శాంతి చట్టం 2012లో పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన విలువైన సూచనలను పట్టించుకోలేదు. దీనివల్ల ఎన్డీయే ప్రభుత్వం న్యూక్లియర్‌ రెగ్యులేటర్‌కు స్వతంత్రత ఇవ్వడానికి ఎటువంటి ఉద్దేశం లేదని మాట్లాడటం, న్యూక్లియర్‌ రియాక్టర్ల సమీపంలో నివసిస్తున్న ప్రజల భద్రతపై పూర్తి నిర్లక్ష్యం వహించడమే అవుతుంది. చట్టం సెక్షన్‌ 39(4) న్యూక్లియర్‌ సౌకర్యాలపై సమాచారం పొందే పౌరుల హక్కును రద్దుచేస్తుంది, న్యూక్లియర్‌ రంగాన్ని ప్రయివేట్‌, విదేశీ వ్యాపారస్తులకు అనుకూలతకు ఎక్కువ ఉపయోగపడుతుంది.

నిబంధన అవకాశాలు, దుర్వినియోగానికి తావిస్తుంది. దేశ న్యూక్లియర్‌ ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా మార్చే ఈ ముఖ్యమైన చట్టం స్వల్ప పార్లమెంటరీ చర్చతో, పార్లమెంటరీ కమిటీ పంపకుండా ఆమోదించబడి నందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బిల్‌ టెక్స్ట్‌ 2025 డిసెంబర్‌ 15న అందుబాటులోకి వచ్చింది, 17నాటికి లోక్‌సభ ఆమోదించింది, 18 నాటికి రాజ్యసభ ఆమోదించింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తుంది, ఎందుకంటే పౌరులు లేదా శాసనసభ్యులు చట్టాన్ని పరిశీలించి, వ్యాఖ్యానించే సరిపడా సమయం లభించలేదు. శాంతి చట్టం ప్రభుత్వం దిగుమతి చేసుకున్న లైట్‌-వాటర్‌ రియాక్టర్లపై ఆధారపడి న్యూక్లియర్‌ రంగాన్ని పెంచాలని నిర్ణయించినట్లు చూపిస్తుంది. అయితే, అటువంటి రియాక్టర్లు, దిగుమతి యూరేనియంపై పెద్దఎత్తున ఆధారపడటం విద్యుత్‌ ధరలు పెరగడానికి, భారత్‌ శక్తి స్వావలంబనపై ప్రతికూల ప్రభావం చూపడానికి దారితీస్తుంది.

  • డా.ఎం.సురేష్‌బాబు, 9989988912
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -