Wednesday, March 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకిచెన్‌లో 'ధరల' బాంబ్‌

కిచెన్‌లో ‘ధరల’ బాంబ్‌

- Advertisement -

నిత్యావసరాలు.. నిర్మాణ వస్తువులు భారం
సగటున 30శాతం వరకు పెరిగిన ధరలు
మండుతున్న నూనెలు.. సబ్బుల రేట్లు సైతం పెంపు
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
ముడి చమురు ధరల పెంపుతో రవాణా చార్జీల మోత
కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు.. బ్లాక్‌లో విక్రయం

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినట్టు అమెరికా ప్రకటించినా.. ఇజ్రాయెల్‌, అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి వంటింట్లో ‘యుద్ధం’ మొదలైంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిత్యావసరాలు మొదలు నిర్మాణరంగ వస్తువుల వరకూ సగటున 10-30 శాతం వరకు ధరలు పెరిగాయి. నూనెలు మండుతుండగా.. పప్పుల రేట్లు సైతం భారీగా పెరిగాయి. యుద్ధం కారణంగా గ్యాస్‌ సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళనతో వినియోగదారులు సిలిండర్లను ముందస్తుగా బుక్‌ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్యాస్‌ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌లో సిలిండర్లను విక్రయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రూ.947.5 ఉండే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.2000కు పైగా ధరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. అంతర్జాతీయంగా సరఫరా దెబ్బతినడంతో సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌, పల్లీ నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి.

నిత్యావసరాలు.. నిర్మాణరంగ రేట్ల పెంపు
నిర్మాణరంగం వస్తువుల ధరలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. సబ్బులు, డిటర్జెంట్లపై 20శాతం ధరలు పెరిగాయి. గోధుమ పిండిపై కిలోకు రూ.7-10 వరకు రేటు పెంచారు. కందిపప్పుపై కిలోకు రూ.10-20 వరకు ధరలు పెరిగాయి. మనదేశం ఏటా 5-6 మిలియన్‌ టన్నుల మేర కంది పప్పు, పెసరపప్పు వంటి పప్పు దినుసులను మయన్మార్‌, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. కందిపప్పు యుద్ధానికి ముందు వరకు రూ.125ఉండగా ప్రస్తుతం రూ.150కి పెరిగింది. మినపప్పు రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.140కి చేరింది. కొందరు వ్యాపా రులు ఉన్న నిల్వలను బ్లాక్‌ మార్కెట్‌ కు తరలిస్తున్నట్లు ఆరోప ణలున్నాయి. పప్పులతో పాటు డ్రైఫ్రూట్స్‌, నట్స్‌కు సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, ఆప్రికాట్‌ వంటివి ఇరాన్‌, అఫ్ఘనిస్తాన్‌ నుంచే మన దేశానికి వస్తున్నాయి. మమ్రా బాదం కిలోకు గతేడాది అక్టోబర్‌ నెలలో రూ.1800 వద్ద ఉండగా ఇప్పుడు రూ.2800లకు పెరిగింది. ఇరానీ పిస్తా ధర రూ.840 నుంచి రూ.1300కు చేరుకుంది. ఇరానీ ఆప్రికాట్‌ ధర డిసెంబర్‌ నెలలో రూ.750 వద్ద ఉంటే ఇప్పుడు రూ.1400 పలుకుతోంది. టీ పొడుల ధరలు కూడా రూ.10కి పైగా పెరిగాయి. ఉల్లిగడ్డ పై కిలోకు రూ.10 వరకు పెరిగింది. ఎగుమతులు నిలవడంతో ఒక గుడ్లు తప్ప మిగతా నిత్యావసరాల ధరలన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్క కుటుంబం నెలవారీ ఖర్చుల్లో 30శాతం వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. నిర్మాణ రంగానికి సంబంధించిన సిమెంటు రేటు మొన్నటి వరకు బస్తా రూ.310 ఉండగా ఇప్పుడు రూ. 325 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే శానిటరీ పైపులు, పింగాణి బేసిన్స్‌ ధరలు సైతం పెరిగాయి. రూ.900 ఉన్న పైపులు ఇప్పుడు రూ. 1200 చొప్పున విక్రయిస్తున్నారు.

వంట నూనెల మంట
వంట నూనెలు.. లీటర్‌ పామోలిన్‌ ధర రూ.145, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.175కు చేరాయి. బ్రాండ్‌ ను బట్టి ధరలు మారుతున్నాయి. జనవరి ధరలతో పోలిస్తే ఈ రెండు రకాల నూనెలు లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. లీటర్‌ సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రూ.185 వరకు ఉండగా, ఆన్‌ లైన్లో రూ.183 పైగానే పలుకుతోంది. గ్యాస్‌ కొరత పేరుతో హోటళ్లలో అల్పాహారం, భోజనం రేట్లు ఇప్పటికే సగటున రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు, పెరిగిన సరకు రవాణా ఖర్చులు ఇందుకు కారణమని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 60% ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. వంటనూనెల్లో ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ప్యాకింగ్‌ చేస్తోంది. కొన్ని సంస్థలు లీటరుకు 910 గ్రాముల ప్యాకింగ్‌ చేస్తుండగా, మరికొన్ని సంస్థలు 800 గ్రాముల ప్యాకింగ్‌తో ఉత్పత్తులు విడుదల చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ధరల పెంపు, తగ్గుదల ఉంటోంది. కొన్ని సంస్థలు 750 గ్రాముల ఉత్పత్తులే విక్రయిస్తు న్నాయి. పామోలిన్‌ ధరలే పరిశీలిస్తే.. విజయ సంస్థ మార్కెట్లో లీటర్‌ (910గ్రాములు) రూ.145చొప్పున విక్రయిస్తోంది. మరో సంస్థ 750 గ్రాముల ఉత్పత్తినే రూ.141 చొప్పున హోల్‌ సేల్‌లో అమ్ముతోంది. మొత్తమ్మీద యుద్ధం వంటింటిని అతలాకుతలం చేస్తోందని గహిణులు వాపోతున్నారు.

సరుకులన్నింటి ధరలూ పెరిగాయి
ఏనుగు స్వరూప, కౌన్సిలర్‌-గృహిణి

సరుకులన్నింటి ధరలు పెరిగాయి. సామాన్యులపై విపరీతమైన భారం పడుతోంది. అన్ని వస్తువుల ధరలు 10-40 % వరకూ పెంచారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని మహిళలు అంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -