Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిరాజకీయ నైచ్యానికి తార్కాణం

రాజకీయ నైచ్యానికి తార్కాణం

- Advertisement -

రాజకీయ అభిప్రాయాలు అందరికీ ఉండొచ్చు. కొందరికి అవి అవ్యక్తంగా.. మరికొందరికి వ్యక్తంగా ఉండొచ్చు. కానీ ప్రత్యర్థులను దుయ్యబట్టడానికి కుటిల రాజకీ యాలకు దిగడం అమిత్‌షా లాంటి బీజేపీ నాయకులకే సాధ్యం. ఉపరాష్ట్రపతి పదవికి వచ్చే నెల తొమ్మిదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది. కేంద్రంలో అధిóకారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే మహారాష్ట్ర గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసింది. ప్రతిపక్ష ”ఇండియా” బ్లాక్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డిని రంగంలోకి దించింది. సుదర్శన్‌రెడ్డి మచ్చలేని సుప్రీం కోర్టు వూర్వ న్యాయమూర్తి, ఆయనకు ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. అయితే మానవ హక్కుల పరిరక్షణకోసం పాటు పడే న్యాయమూర్తిగా ఖ్యాతి ఉంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సుదర్శన్‌ రెడ్డిని ‘నక్సలైట్‌’ అని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతల అలవాటు ప్రకారం నక్సలైట్ల సమర్ధకుడు, అర్బన్‌ నక్సల్‌ అన్నా కొంత ఔచిత్యం ఉండేది. కానీ అమిత్‌షా సుదర్శన్‌ రెడ్డికి నేరుగా నక్సలైట్‌ ముద్ర వేసేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని అణచడానికి అప్పటి బీజేపీ ప్రభుత్వం కొందరు గిరిజనులకు ఆయుధాలిచ్చి సల్వాజుడుం పేరుతో నక్సలైట్ల నుంచి కాపాడుకునే బాధ్యత ప్రజల మీదకే తోసేసింది. మావోయిస్టుల్లో గిరిజనులు అధిక సంఖ్యలోనే ఉంటారు. అంటే గిరిజనులకు మధ్యే తంపులు పెట్టేపనికి బీజేపీ ఒడిగట్టింది. ఇదంతా జరిగినప్పుడు అమిత్‌ షా ఢిల్లీ రాజకీయాల్లో లేరు. కానీ సల్వాజుడుం చట్ట విరుద్ధమైందని, రాజ్యాంగ వ్యతిరేకమైందని న్యాయమూర్తులు సుదర్శన్‌ రెడ్డి, ఎస్‌.ఎస్‌.నిజ్జర్‌ తీర్పు చెప్పారు. ఆ తీర్పును అమిత్‌షా నేడు ఇండియా బ్లాక్‌ ఉప రాష్ట్రపతి అధ్యర్థి అయిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని విమర్శించడానికి ఆయుధంగా వినియోగిం చు కుంటున్నారు. న్యాయమూర్తులు చట్టం ప్రకారం, రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్తారే తప్ప తమ రాజకీయ భావాల ప్రభావం చూపే తీర్పులు చెప్పరు. అయినా ఆ తీర్పు ఏ న్యాయ మూర్తులు ఇచ్చారన్నది ప్రధానం కాదు. అది సుప్రీంకోర్టు తీర్పు. కానీ, అమిత్‌ షాకు ఇలాంటి ధర్మ సూక్ష్మాలతో ఎటూ పనిలేదు. దానీ ఆధారంగా సుదర్శన్‌ రెడ్డిని నక్సలైట్‌గా ముద్ర వేయడం రాజకీయ నైచ్యానికి తార్కాణం.

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఈ తీర్పు కారణంగా కొన ఊపిరితో నక్సలైట్‌ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని అమిత్‌షా వ్యాఖ్యానించారు. అంతేకాదు, సల్వాజుడుం వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని, రద్దుచేయాలని ఆదేశించడం ద్వారా ఆయన గిరిజనుల స్వీయ హక్కుల్ని కాలరాశారని ఆరోపించారు. దీనిపై జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. ”కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను. కానీ, అది నాతీర్పుకాదు.. సుప్రీంకోర్టు ఇచ్చినది. నలభై పేజీల ఆ తీర్పును అమిత్‌ షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు. ఇదే నేను చెప్పదలచుకున్నా. ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం” అని ఆయన అన్నారు.
గిరిజనులు తమను తాము కాపాడుకునేందుకే సల్వాజుడుం ఏర్పాటు చేసుకుంటే…గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను నక్సల్స్‌ కూల్చేస్తుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలను మోహరించాయి… జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఒక్క కలంపోటుతో వాళ్లను రోడ్డున పడేశారంటూ…జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని గిరిజన వ్యతిరేకిగా బట్టకాల్చి మీదేసే కుటిల రాజకీయాలకు సైతం అమిత్‌షా వెనుకాడకపోవడం ప్రజాస్వామ్య వాదులను కలవరపెడుతోంది. ఈ తీర్పునకు సంబంధించి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి కన్నా రాహుల్‌గాంధీ ఎక్కువ సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యా నించడం కడు విచారకరం. సుప్రీంకోర్టు తీర్పుకు రాహుల్‌గాంధీకి ఏం సంబంధం? నిజానికి ఆ తీర్పు అమిత్‌షా ఆరోపిస్తున్నట్టుగా నక్సలైట్లకు అనుకూలమైంది కాదు. వారిని సమర్థించేదీ అంతకంటే కాదు. ప్రభుత్వ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నడవడికను ఆతీర్పు తప్పు పట్టిందంతే.
వాస్తవానికి ఆ తీర్పులో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఎక్కడా నక్సలిజాన్ని, దాని సిద్దాంతాలను సమర్థించలేదని.. ఆ తీర్పు సారాంశంలో ఎక్కడా అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన పద్దెనిమిది మంది మాజీ న్యాయమూర్తులు షా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా రాజ్యాంగ బద్ధమైన హోదాకు జరుగుతున్న పోటీ అన్న సంగతే కేంద్రమంత్రి విస్మరించడం శోచ నీయం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవికి జరిగే ప్రచారం మర్యాదగా, హుందాగా ఉండాలే కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించడం ద్వారా షా ‘న్యాయవ్యవస్థ’ స్వతంత్రతను సందేహంలో పడేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలతో ముడివడింది కావొచ్చు. కానీ, ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సల్వాజుడుం కేసులో తీర్పును తప్పు పట్టడం అంతకన్నా హేయమైన పని.

అనంతోజు మోహన్‌కృష్ణ
8897765417

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad