Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆటలుకుర్రాళ్లపై కోట్ల వర్షం

కుర్రాళ్లపై కోట్ల వర్షం

- Advertisement -

కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌కు రూ.14.2 కోట్లు
కామెరూన్‌ గ్రీన్‌కు రికార్డు రూ. 25.20 కోట్లు
మతీశ పతిరణకు రూ. 18 కోట్ల ధర
ఐపీఎల్‌ 2026 ఆటగాళ్ల మినీ వేలం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలం సహజంగానే క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించింది. భారత స్టార్‌ క్రికెటర్లు, విదేశీ క్రికెటర్ల కోసం బ్యాంక్‌ ఖాతాలను గుల్ల చేసుకునే ప్రాంఛైజీలు.. ఈ సారి కాస్త భిన్నంగా దేశవాళీ యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించారు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ (ఉత్తరప్రదేశ్‌), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కార్తీక్‌ శర్మ (రాజస్తాన్‌)లు రూ. 14.2 కోట్ల చొప్పున దక్కించుకున్నారు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ రికార్డు రూ.25.20 కోట్ల ధర దక్కించుకోగా.. శ్రీలంక పేసర్‌ మతీశ పతిరణ రూ. 18 కోట్లు ఎగరేసుకుపోయాడు. మంగళవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్‌ 2026 మినీ ఆటగాళ్ల వేలంలో 369 మంది క్రికెటర్లు బరిలో నిలువగా.. ప్రాంఛైజీలు కొందరినే కొనుగోలు చేశాయి.

నవతెలంగాణ-అబుదాబి
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. 2022లో పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ గరిష్టంగా రూ.10 కోట్ల ధర దక్కించుకోగా.. తాజాగా అన్‌క్యాప్‌డ్‌ దేశవాళీ క్రికెటర్లు కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌లు ఏకంగా రూ.14.2 కోట్ల ధరను సొంతం చేసుకున్నారు. ఐదుసార్లు చాంపియన్‌, వెటరన్‌ క్రికెటర్ల జట్టుగా ముద్రపడిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. దేశవాళీ కుర్రాళ్ల కోసం ఏకంగా రూ.28.4 కోట్ల మొత్తాన్ని వెచ్చించటం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌.. దేశవాళీ టీ20ల్లో సత్తా చాటుతున్నాడు. అతడి నైపుణ్యం చూసి సూపర్‌కింగ్స్‌ ట్రయల్స్‌కు పిలిచింది. రూ.30 లక్షల కనీస ధరతో ప్రశాంత్‌ వీర్‌ పేరు వేలంలోకి రాగానే.. ప్రాంఛైజీలు పోటీపడ్డాయి.

ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలుత పోటీ పడ్డాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ఆ తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం రేసులోకి వచ్చాయి. ప్రశాంత్‌ వీర్‌ కోసం ఆఖరు వరకు పోటీపడిన సన్‌రైజర్స్‌.. రూ.14.2 కోట్లకు సూపర్‌కింగ్స్‌కు యువ ఆల్‌రౌండర్‌ను వదిలేసింది. వీర్‌ను దక్కించుకున్న సూపర్‌కింగ్స్‌.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కార్తీక్‌ శర్మను సైతం తీసుకుంది. కార్తీక్‌ శర్మ రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌లు తొలుత బిడ్‌ వేయగా.. సూపర్‌ జెయింట్స్‌, నైట్‌రైడర్స్‌, సూపర్‌కింగ్స్‌ పోటాపోటీగా బిడ్‌ వేశాయి.

ఆఖరుకు సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ అతడి ధరను రూ.14 కోట్లకు తీసుకెళ్లాయి. చివరకు రూ.14.2 కోట్లకు కార్తీక్‌ శర్మను సూపర్‌కింగ్స్‌ కొనుగోలు చేసింది. ప్రశాంత్‌ వీర్‌, కార్తీక్‌ శర్మతో పాటు పలువురు దేశవాళీ క్రికెటర్లు ఈ వేలంలో కోట్ల డీల్‌ దక్కించుకున్నారు. జమ్ము కశ్మీర్‌ పేసర్‌ అకిబ్‌ నబి రూ.8.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌, 23 ఏండ్ల పేస్‌ ఆల్‌రౌండర్‌ మాంగేశ్‌ ఆదవ్‌ రూ.5.2 కోట్లకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, వికెట్‌ కీపర్‌ తేజస్వి దహియ రూ. 3 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముకుల్‌ చౌదరి రూ.2.6 కోట్లకు సూపర్‌జెయింట్స్‌, అక్షత్‌ రఘువంశీ రూ. 2.2 కోట్లకు సూపర్‌జెయింట్స్‌, పేసన్‌ నమన్‌ తివారి రూ. 1 కోటికి సూపర్‌జెయింట్స్‌ గూటికి చేరారు.

కామెరూన్‌ గ్రీన్‌.. రూ.25.20 కోట్లు
మినీ వేలంలో రికార్డు ధర పలుకుతాడనే భారీ అంచనాలు నడుమ వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌.. ప్రాంఛైజీల మధ్య గట్టి పోటీకి కారణమయ్యాడు. భారీ పర్స్‌తో వేలంలోకి వచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌లు రూ. 2 కోట్ల కనీస ధరతో కామెరూన్‌ గ్రీన్‌కు బిడ్‌ మొదలుపెట్టాయి. రూ.13.40 కోట్ల వద్ద ముంబయి ఇండియన్స్‌ బిడ్‌ నుంచి తప్పుకోగా.. నైట్‌రైడర్స్‌కు పోటీ ఇస్తూ సూపర్‌కింగ్స్‌ ఎంట్రీ ఇచ్చింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆఖరు వరకు కామెరూన్‌ గ్రీన్‌ వరకు పోటీపడింది. కానీ రూ. 25.20 కోట్ల రికార్డు ధరకు కామెరూన్‌ గ్రీన్‌ను నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది. భారత స్టార్‌ క్రికెటర్లు రిషబ్‌ పంత్‌ (రూ.27 కోట్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (రూ.26.75 కోట్లు) తర్వాత అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా గ్రీన్‌ నిలిచాడు.

గతంలో మిచెల్‌ స్టార్క్‌ రూ.24.75 కోట్లు, పాట్‌ కమిన్స్‌ రూ.20.50 కోట్లతో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్లుగా నిలిచారు. కామెరూన్‌ గ్రీన్‌ ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ ఏడాది అనూహ్యంగా వదులుకున్న పేసర్‌ మతిశ పతిరణ. పవర్‌ప్లే, స్లాగ్‌ ఓవర్లలో గొప్పగా రాణించిన మతిశ పతిరణ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భారీ ధర వెచ్చించింది. ఇతర ప్రాంఛైజీల నుంచి గట్టి పోటీ ఎదురైనా వెనక్కి తగ్గలేదు. రూ.18 కోట్లకు పతిరణ నైట్‌రైడర్స్‌ సొంతమయ్యాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లియాం లివింగ్‌స్టోన్‌ సైతం భారీ ధర సాధించాడు. రూ.13 కోట్లకు లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది.

బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ రూ. 9.20 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గూటికి చేరగా.. జోశ్‌ ఇంగ్లిశ్‌ రూ.8.60 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్‌ సొంతమయ్యాడు. భారత స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ రూ.7.20 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడనుండగా.. గత సీజన్‌లో రికార్డు ధర పలికిన ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను నైట్‌రైడర్స్‌ మళ్లీ కొనుగోలు చేయలేదు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ. 7 కోట్లకు వెంకటేశ్‌ అయ్యర్‌ను తీసుకుంది. విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హౌల్డర్‌ మళ్లీ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. సూపర్‌ ఫామ్‌లో జేసన్‌ హౌల్డర్‌ను రూ. 7 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ తీసుకుంది. సఫారీ బ్యాటర్‌ డెవిడ్‌ మిల్లర్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌, ఎన్రిచ్‌ నోకియాను కనీస ధర రూ.2 కోట్లకు సూపర్‌జెయింట్స్‌ దక్కించుకున్నాయి.

ఆమన్‌ రావు అదరహో!
ఐపీఎల్‌ మినీ వేలంలో హైదరాబాదీ యువ ఆటగాడు ఆమన్‌ రావు మెరిశాడు. జూనియర్‌ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఆమన్‌ రావు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. దేశవాళీ జూనియర్‌ క్రికెట్లో రాణించిన ఆమన్‌ రావు పలు ఐపీఎల్‌ ప్రాంఛైజీల ట్రయల్స్‌కు హాజరయ్యాడు. రూ. 30 లక్షల కనీస ధరకు యాక్సిలరేషన్‌ రౌండ్‌లో వేలంలోకి వచ్చిన ఆమన్‌ రావును రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. యువ ఆటగాళ్లను సానపట్టడంలో రాయల్స్‌కు ఓ రికార్డుంది. మరి ఆమన్‌ రావు సైతం రాయల్స్‌ శిబిరంలో, కుమార సంగక్కర శిక్షణ సారథ్యంలో ఏ స్థాయికి చేరుకుంటాడో చూడాలి. యువ ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ను రూ.75 లక్షల కనీస ధరకు చెన్నై సూపర్‌కింగ్స్‌.. పథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకున్నాయి. హైదరాబాద్‌ క్రికెటర్లు సివి మిలింద్‌, తనయ్ త్యాగరాజన్‌లు వేలంలో ప్రాంఛైజీల నిరాకరణకు గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -