Monday, November 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుల దురహంకార హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

కుల దురహంకార హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

- Advertisement -

– పోలీసుల పాత్రపై నిగ్గు తేల్చాలి
– కుల, మతాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి
– నిందితులను కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు
– ఎల్లంపల్లిలో ఎర్ర రాజశేఖర్‌ ఆత్మగౌరవ సభ
– సామాజిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర
నవతెలంగాణ-షాద్‌నగర్‌

దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌ కుల దురహంకార హత్యలో పోలీసుల పాత్రపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, కులోన్మాద హంతకులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం మొగిలిగిద్ద నుంచి ఎల్లంపల్లి వరకు సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. భారీ ప్రదర్శన నిర్వహించి, అనంతరం మృతుడు ఎర్ర రాజశేఖర్‌ ఇంటి వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ప్రముఖ అడ్వకేట్‌ సంగమేశ్వర్‌ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. కుల దురహంకార హత్యలను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. కుల దురహంకార హత్యల్లో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పౌర సమాజం కులాంతర వివాహాలను నేరంగా భావించకూడదని చెప్పారు.

చిన్న కులాలు అంటే ఎందుకంత కక్ష సాధింపు చర్యలని, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిందితుడు కాగుల వెంకటేష్‌ ఆస్తులను జప్తు చేసి బాధిత రాజశేఖర్‌ కుటుంబానికి ఇవ్వాలన్నారు. దేశంలో దళితులు అత్యంత ప్రమాదంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు, క్రైస్తవుల వల్ల దళితులపై దాడులు జరగడం లేదని, కేవలం హిందూమతంలో ఉన్న దళితులపై హిందూమతంలో ఉన్న అగ్రకులోన్మాదులు దాడులకు పాల్పడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు మాట్లాడుతూ.. నిలువ నీడలేని రాజశేఖర్‌ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. రాజశేఖర్‌ భార్య వాణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అలాగే ఐదెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాజశేఖర్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు బోడ సామేల్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్‌, సీపీఐ(ఎం) డివిజన్‌ కార్యదర్శి ఎన్‌.రాజు, మాదిగ ఐక్యవేదిక కన్వీనర్‌ దొడ్డి శ్రీనివాస్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ, ధర్మసమాజ్‌ పార్టీ రాష్ట్ర నాయకులు భిక్షపతి, ఉపాధ్యక్షులు శ్రీనునాయక్‌, బుద్ధిష్టు బాదేపల్లి సిద్ధార్థ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి. జగదీష్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్‌నాయక్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్నయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.శంకర్‌, డీఎస్‌పీ నాయకులు శివ, అనిల్‌, జాంగారి రవి, కర్రేళ్ల సురేందర్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -