Sunday, March 8, 2026
E-PAPER
Homeసోపతిచిన్న నిరాదరణ - జీవితం అంతం కారాదు

చిన్న నిరాదరణ – జీవితం అంతం కారాదు

- Advertisement -

ఒక అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి ఒప్పుకోలేదని కన్నతల్లితండ్రులను చంపేసిందని… ఈ అమానుష వార్తకు చలించి పోయి, (ప్రేమ ఇప్పుడొక దిష్టి బొమ్మ) అనే హృదయవిదారక కవితను డా|| నామోజు బాలాచారి రాసారు. అది చదవగానే నాకనేక ప్రశ్నలు నన్ను వెంటాడాయి.
ఈ ఘటన విన్న వెంటనే మనసు కలచివేసింది. ప్రేమ అనే పవిత్ర భావం, కోపం, ఆవేశం, అసహనం కలిసినప్పుడు ఎలా భయంకరంగా మారుతుందో ఇలాంటి సంఘటనలు మనకు గుర్తుచేస్తాయి. ఒక అమ్మాయి తన ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో కన్నతల్లితండ్రులనే హత్య చేసింది. ఇది వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, సమాజానికి గట్టి హెచ్చరిక.

ఈ అమానుషానికి వెనుక నేపథ్యం…
భావోద్వేగ నియంత్రణా లోపం…వల్లనే అనిపిస్తున్నది. ఈ రోజుల్లో యువతలో తక్షణ స్పందన (ఱఅర్‌aఅ్‌ తీవaష్‌ఱశీఅ) ఎక్కువ. తాము కోరుకున్నవాటికి చిన్న నిరాకరణను కూడా ‘జీవిత అంతం’గా భావించడం పెరిగింది. దీనికి క్షణికావేశం ఒకటైతే, భావాలను వ్యక్తపరచడం తెలియక, తాను ఎందుకు ఆ వ్యక్తిని కావాలనుకుంటున్నదో? అతనిలోని పాజిటివ్‌ గుణాలు తమ కుటుంబానికి ఎంత బలమో? తానిష్టపడడానికి ఏ గుణాలు బలంగా ఆకర్షించాయో? లేదా ఇతర కారణాలు తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించలేకపోవడం… ఒక వేళ చెప్పితే వారు కాదంటే ఆ ఓటమిని అంగీకరించలేక, అనుకున్నది కాలేదనే తాత్కాలిక ఆవేశాన్ని నియంత్రించుకోలేక ఇలాంటి దారుణాలు చేయడానికి సిద్ధపడతున్నారు.
మరో కారణం తమ ప్రేమపై తమకే అతిశయ భావన ఎక్కువ…ఇది కలగడానికి సినిమాలు, సోషల్‌ మీడియా ద్వారా ‘ప్రేమ కోసం ఏదైనా చేయాలి’ అనే అతిగా ఊదరగొట్టే భావజాలంతో రాసిన సంభాషణలు కొంత కారణమనిపిస్తున్నాయి.
నిజ జీవితంలో అలా చేయడం సాధ్యమా? అని ఆలోచించక… తొందరపాటు తనంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
నేను ప్రేమకు వ్యతిరేకిని కాను! ప్రేమ అనేది పరస్పర గౌరవం, నమ్మకం. కానీ దాన్ని స్వార్థంగా, స్వాధీనంగా భావించినప్పుడు అది మానసిక అస్వస్థతగా మారుతుంది. అదే ప్రేమ తల్లిదండ్రుల మీద ఉండకపోవడానికి కారణం?

కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకోకపోవడమే లోపం అది కూడా తల్లిదండ్రులు, పిల్లల మధ్య మనస్పూర్తిగా మాట్లాడుకోకపోవడం ఒక ముఖ్య కారణం. ఎందుకో ఏమో గానీ స్నేహితుల దగ్గర చెప్పిన విషయాలు కూడా తల్లిదండ్రులతో చెప్పరు!
తమ పిల్లల ప్రేమ వ్యవహారం ఊరంతా, దేశమంతా తెలిసిన తర్వాత తమ పిల్లవాడి జీవితంలో జరిగే విషయాలు ఎప్పటికో తల్లిదండ్రులకు తెలుస్తాయి… కన్నప్పటి నుండి పుట్టెడు ప్రేమతో పెంచుకున్న పిల్లలు ఒక్కసారిగా చాలా దూరమైన ఫీలింగ్‌ తల్లిదండ్రులకు వచ్చి, కోల్పోతామేమోనన్న బాధలో తాత్కాలికంగా వద్దని అన్నా… పిల్లలు సరైన కారణంచెప్పితే తప్పక ఒప్పుకుంటారు.
అక్కడక్కడ తల్లిదండ్రులు మొండిగా, పిల్లల అభిప్రాయాలు వినకపోవడం, వారి నిర్ణయాలు ఆదేశాల్లా మారడం, పరస్పర అవగాహన లేకపోవడం ఇవి విభేదాలను తీవ్రతరం చేస్తాయి. మరో కారణం- మానసిక ఆరోగ్య నిర్లక్ష్యం యువతలో డిప్రెషన్‌, ఆందోళన, ఆత్మవిశ్వాస లోపం, ఆవేశ స్వభావం వంటి సమస్యలు గుర్తించకుండా వదిలేస్తున్నారు. సమయానికి మానసిక సలహా (షశీబఅరవశ్రీశ్రీఱఅస్త్ర) అందితే ఇటువంటి ఘోరాలు తగ్గవచ్చు. అతి గారాబపు పిల్లలు డిజిటల్‌ ప్రపంచంలో మునిగిపోవడం ఇవన్నీ కలిసి మనిషిని అనుభూతిలేని స్థితికి తీసుకెళ్తున్నాయి.
మనసులో కోపం వచ్చిన క్షణం, ”ఇది తాత్కాలికం” అనే బుద్ధి లేకపోతే, వివేకం కోల్పోయిన ఆ ఒక క్షణిక ఆవేశపుచర్య జీవితాంతపు శిక్షగా మారుతున్నది. ఈ సంఘటన సమాజానికిచ్చే సంకేతం ప్రమాదం అంచున కుటుంబ వ్యవస్థ ఉన్నదని… కుటుంబ వ్యవస్థలో సంభాషణ సంక్షోభం ఉన్నదన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

యువతకు భావోద్వేగ విద్య అవసరం. ప్రేమ, వివాహం వంటి విషయాల్లో పరస్పర గౌరవం తప్పనిసరిగా ఉండేలా చూడాలి! దాంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు ఘోరంగా ఉంటాయని ఈ ఘటన మనకు చెబుతున్నది…
”సంబంధాలు బలహీనపడితే సమాజం బలహీనమవుతుంది.” తిలా పాపం..తలా పిడికెడు అన్న సామెత వలె ఇలాంటి ఘోర సంఘటనలు జరగడానికి తల్లిదండ్రుల పాత్ర, పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడక పోవడం, వారి అభిప్రాయాలను గౌరవించక పోవడం, ప్రేమ, వివాహం వంటి విషయాల్లో స్పష్టంగా మాట్లాడి మంచిచెడ్డలు విడమరిచి చెప్పాలి. పిల్లలు ఆవేశంగా ఉన్నప్పుడు పెద్దవారు ప్రశాంతంగా మాట్లాడటం, అవసరమైతే కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లడం, తల్లిదండ్రులు తమ అధికారాన్ని వారిపై చూపకుండా మార్గదర్శకులు కావాలి. ఇంకా శతిమించితే సామాజిక కార్యకర్తల జోక్యం చేసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో భావోద్వేగ నియంత్రణపై వర్క్‌షాపులు కుటుంబ సలహా కేంద్రాల పనితనం మెరుగు పరచాలి! మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాలు, ప్రేమ, వివాహం, వ్యక్తిగత స్వేచ్ఛపై చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు చేయాలి! యువతకు సహాయం చేసే హెల్ప్‌లైన్ల ప్రచారం చేయాలి.
కుటుంబాల్లో సంభాషణ సంస్కతిని పెంచాలి! యువతకు మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి! ప్రేమ, వివాహం విషయాల్లో పరస్పర గౌరవం ఉండాలి. ప్రేమ జీవితం నిర్మించాలి కానీ నాశనం చేయకూడదు!
తల్లిదండ్రులు పిల్లల హదయాన్ని వినాలి; పిల్లలు తల్లిదండ్రుల ఆందోళనను అర్థం చేసుకోవాలి. మానవత్వం కోల్పోవడం ఒక్కసారిగా జరగదు, అది సంభాషణ కోల్పోయిన క్షణం మొదలవుతుంది. సమాజం జాగ్రత్తగా మారితేనే ఇలాంటి దుర్ఘటనలు తగ్గుతాయి. మనసులను దగ్గర చేయడం… అదే నిజమైన పరిష్కారం.

రంగరాజు పద్మజ, 9989758144

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -