Wednesday, December 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా పంపిణీకి ప్రత్యేక యాప్‌

యూరియా పంపిణీకి ప్రత్యేక యాప్‌

- Advertisement -

ఈనెల 20 నుంచి అందుబాటులోకి
ఎకరా వరి సాగుకు మూడు బస్తాల యూరియా
మిర్చికి ఐదు బస్తాలు, ఇతర పంటలకు రెండు బస్తాలు
యూరియా పక్కదారి పట్టకూడదనే ఈ నిర్ణయం
వ్యవసాయానికి శాస్త్ర సాంకేతిక తోడవ్వాలి
వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. గోపి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రైతులకు యూరియా పంపిణీ కోసం ఈ నెల 20 నుంచి ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి రాబోతున్నదని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి ప్రకటించారు. యారియా పక్కదారి పట్టకుండా రైతులకే అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్యవసాయానికి శాస్త్ర సాంకేతికత తోడవ్వాల్సిన ఆవశ్యకతను చెప్పారు. ఇప్పటికే వాట్సాప్‌ ఛానల్‌ ద్వారా రైతులకు సమాచారం ఇస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరా బాద్‌లోని వ్యవసాయ శాఖ కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లా డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఎరువులు’ యాప్‌ను నిర్వహి స్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఐసీ దీన్ని తయారు చేసిందని తెలిపారు. ప్రత్యేక యాప్‌లో పట్టాదారు పాస్‌బుక్‌ నెంబర్‌ యాడ్‌ చేస్తే ఫోన్‌నెంబర్‌కు ఓటీపీ వస్తుందనీ, ఆ తర్వాత వివరాలు నింపాలని సూచించారు.

యాప్‌లో మన జిల్లా, మండలం, గ్రామంలోని కేంద్రాల్లో ఎన్ని యూరియా బస్తాలున్నాయో కూడా ఈజీగా తెలుసుకోవచ్చునని తెలిపారు. వరి సాగు చేస్తే ఎకరాకు మూడు బస్తాలిస్తామనీ, మిర్చి పంటకు ఐదు బస్తాలు, ఇతర పంటలకు రెండు బస్తాల చొప్పున యూరియా ఇస్తామని చెప్పారు. ఎకరం లోపు రైతులకు ఒకే విడతలో, రెండు నుంచి ఐదెకరాల రైతులకు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల రైతులకు మూడు విడతల్లో, ఆపై ఉన్న రైతులకు నాలుగు విడతల్లో యూరియా బస్తాలు అందజేస్తామని వివరించారు. యాప్‌లో అధిక యూరియా కోసం ఒక పంటను టిక్‌ చేసి మరో పంట సాగు చేస్తే కొనుగోలు సమయంలో ఇబ్బంది అవుతుందని హెచ్చరించారు. కౌలు రైతులు ఆధార్‌, పేరుతో పాటు పట్టాదారు పాస్‌బుక్‌ నెంబర్‌ ఎంట్రీ చేస్తే భూ యజమానికి ఓటీపీ వెళ్తుందనీ, కౌలు దారులు దాన్ని తెలుసుకుని నమోదు చేస్తే బుక్‌ అవుతుందని వివరించారు.

డీలర్లు కూడా తమ షాపులో ఎంత యూరియా అందుబాటులో ఉంది…ఈ రోజు ఎంత అమ్మారు…అనే వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేలా యాప్‌ రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం యూరియాను మాత్రమే పెట్టామనీ, డీఏపీ, ఇతర ఎరువులను నార్మల్‌గానే కొనుగోలు చేసుకోవచ్చునని చెప్పారు. యాప్‌ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకవేళ రైతు గడువులోగా యూరియా తీసుకోకుంటే మళ్లీ బుక్‌ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించామని చెప్పారు. యాప్‌లో నమోదు చేయడంలో ఇబ్బందులో ఎదురైతే వ్యవసాయ అధికారులతోగానీ, డీలర్లతోగాని బుక్‌ చేయించుకోవచ్చునని తెలిపారు. షాపులవద్ద రైతులకు యాప్‌లో యూరియా బుక్‌ చేసేందుకు మహిళా గ్రూపుల సహాయం కూడా తీసుకుంటామని చెప్పారు.

దీంతో రైతులందరికీ సకాలంలో యూరియా అందుతుందనీ, షాపుల ముందు రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. అక్టోబర్‌ – మార్చి సీజన్‌ కు 10లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని తెలిపారు. 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి టెక్నికల్‌ సమస్యతో ఆగిపోవడంతో లాస్ట్‌ సీజన్‌లో ఇబ్బందులు తలెత్తాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 10వేల యూరియా పంపిణి కేంద్రాలున్నాయనీ, అందులో మూడు వేలు ప్రభుత్వ కేంద్రాలు కాగా మిగతావి ప్రయివేటువి అని వివరించారు. మరిన్ని కేంద్రాలను పెంచాలనే ఆలోచన ఉందన్నారు. యూరియా పంపిణి ఒకే వద్ద కాకుండా డిసెంట్రలైజ్డ్‌ చేయాలని చూస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -