Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకల్లుగీత కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి

కల్లుగీత కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి

- Advertisement -

కేజీకేఎస్‌ 68వ వార్షికోత్సవంలో వక్తలు
కవులు, రచయితలు, కళాకారుతో ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కల్లుగీత కార్మిక సంఘం 68వ వార్షికోత్సవాలు ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు హాజరయ్యారు. కల్లుగీత వత్తిలో ఇబ్బందులతో పాటు తాటి ఈత చెట్ల ఔన్నత్యాన్ని తెలియజేస్తూ పాటలు, కవితలు వినిపించారు. ఆ సంఘం అధ్యక్షులు ఎంవీ రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు అనేక మార్పులు జరుగుతున్నాయనీ, కల్లుగీత వృత్తిలో కూడా ఆధునీకరణ తీసుకురావాలనీ, అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కోటి తాటి, ఈత చెట్ల సంపద ఉన్నదనీ, ఐదు లక్షల కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నాయని తెలిపారు. ప్రకృతి పానీయం కల్లు, నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిదనీ, తాటి ఈత చెట్ల ద్వారా అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు అనేక హక్కులు సంఘం ద్వారా సాధించుకున్నామని తెలిపారు. సొసైటీలు, గీచే వానికే చెట్టు పథకం, పెన్షన్‌, ఎక్సిగ్రేషియా, చెట్ల పెంపకానికి భూమి, నీరా కేఫ్‌, ప్రమాద నివారణకు సేఫ్టీ కిట్టు లాంటి కొన్ని సమస్యలు సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజా సంస్కృతిక కేంద్రం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పదని చెప్పారు. కల్లుగీత కార్మికుల కష్టాలను పరిష్కార మార్గాలను పాటలు, కవిత్వం, రచనల ద్వారా సమాజానికి తెలియజేయాలని కళాకారులకు విజ్ఞప్తి చేశారు. కల్లుగీత వృత్తిలో ప్రమాదాల బారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న సుప్రజ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిగ విజరు కుమార్‌ గౌడ్‌కి, వృత్తిలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం, పిల్లల చదువుల కోసం సహాయం అందిస్తున్న కాన సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారి ప్రతినిధి నాతి గణేష్‌ గౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు, గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్‌ బాలగోని బాలరాజ్‌ గౌడ్‌, కన్వీనర్‌ ఐలి వెంకన్న గౌడ్‌, ఎలికట్టె విజరు కుమార్‌ గౌడ్‌, అంబాల నారాయణ గౌడ్‌, వంగ సదానందం గౌడ్‌, ప్రముఖ కవులు, రచయితలు , గాయకులు కట్ట గాని రవీందర్‌, గోపగాని రవీందర్‌, మానుకోట ప్రసాద్‌, కోల జనార్ధన్‌, బుర్రసతీష్‌, సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి భీమ గాని చంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వెంకట నరసయ్య , గొర్రెల మేకల పెంపక దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడత రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -