పిసినారిగా, మధ్యతరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, కామెడీ విలన్‌గా, నవ్వించే పోలీస్‌గా, భయపెట్టే మాంత్రికుడిగా… ఇలాంటి ఎన్నో పాత్రలకు తన నటనతో జీవం పోసిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో భిన్న పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు శకం ముగిసిన తరువాత ఆ లోటును భర్తీ చేసిన నటుడు కోట శ్రీనివాసరావే. తన నటనతో ఓ పక్కన నవ్విస్తూనే.. మరోపక్క ప్రతి నాయకుడిగా విలనిజానికి సరికొత్త అర్థం చెప్పి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న వైనమే ఆయన్ని అరుదైన విలక్షణ నటుడిగా నిలబెట్టింది.
కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నప్పట్నుంచే నటన అంటే అమితాసక్తి. దీనికితోడు తన అన్నయ్యలు ఇద్దరూ కూడా నటన అంటే మక్కువ కలవారే కావడంతో రంగస్థలం వైపు నడిచేలా చేసింది. ఓ పక్క స్టేట్‌బ్యాంక్‌లో పనిచేస్తూనే మరో పక్క నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు.
కోటను చిత్రసీమకు పరిచయం చేసింది దర్శకుడు కె.వాసు. ఆయన తెరకెక్కించిన ‘ప్రాణం ఖరీదు’ (1978)తోనే కోట తొలిసారి తెరపై తళుక్కు మన్నారు. ఇదే సినిమాతో చిరంజీవి కెరీర్ స్టార్ట్ కావడం విశేషం.
నాటకాల్లో కోట ప్రతిభను గమనించిన జంధ్యాల ‘అమరజీవి’, ‘బాబాయ్ – అబ్బాయ్’ వంటి తదిరత చిత్రాల్లో అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. ఇటువంటి తరుణంలో కోట నట జీవితాన్ని ‘ప్రతిఘటన’ మలుపు తిప్పింది. టి.కష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో ‘నమస్తే తమ్మీ..’ అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్యగా కోట అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇందులోని నటనకుగాను ఆయన తొలి నంది అవార్డును అందుకున్నారు. అంతేకాదు సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహం చేసిందీ పాత్రే కావడం మరో విశేషం.
అలాగే జంధ్యాలను సైతం ‘ప్రతిఘటన’ సినిమా మురిపించింది. కోటలోని నటునికి ఛాలెంజ్ విసిరేలా ఆయన ‘అహ…నా పెళ్ళంట’ సినిమా కోసం ‘లక్ష్మీపతి’ పాత్రను క్రియేట్ చేశారు. జంధ్యాల అంచనాలను మించి ఆ పాత్రలో కోట అత్యద్భుతంగా నటించారు.
అందులో పలు సన్నివేశాల్లో కోట పూయించిన నవ్వులు ఈనాటికీ గుబాళిస్తూనే ఉండడం విశేషం. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అయితే ఈ కథను జంధ్యాల నెరేట్ చేసినప్పుడు నిర్మాత రామానాయుడు ‘లక్ష్మీపతి’ పాత్రలో రావుగోపాలరావుని ఊహించుకున్నారు. కానీ ఈ పాత్రకు కోట అయితే బాగుంటుందని రామానాయుడిని అతికష్టమ్మీద జంధ్యాల ఒప్పించారు. అప్పటి వరకు మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కోటకు ‘అహ..నా పెళ్లంట’ సక్సెస్‌తో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
కామెడీ విలన్‌గా ప్రేక్షకులను కితకితలు పెట్టిన కోట ‘గణేష్’ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో వణుకు పుట్టించారు. ప్రజల రక్తం తాగే ఆరోగ్య మంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. ఈ సినిమాలో గుండుతో, భయంకరమైన కళ్ళతో ఆయన ఆహార్యం కూడా భయంకరంగా ఉంటుంది.
‘గాయం’లో ‘గదైతే నేను ఖండిస్తున్న’ అంటూ గురు నారాయణ్ పాత్రతో కోట తెరపై చేసిన సందడేమీ తక్కువ కాదు. ఈ పాత్రకు విరుద్దంగా ‘మనీ’ సినిమాలో బట్లర్ ఇంగ్లీష్‌తో మాట్లాడే అల్లాదీన్‌గా ప్రేక్షకులను మనసారా నవ్వించారు.
అలాగే ‘మామగారు’ సినిమాలో పోతురాజుగా కోట ఆకట్టుకున్నారు. ఈ సినిమాతోనే బాబూ మోహన్, కోట కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ ఇద్దరి కాంబో దాదాపు 100 సినిమాల్లో నటించింది. ఈ కాంబో అంటే ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు.
ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని ‘మండలాధీశుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌లా కోట నటించారు. అయితే ఇందులో నటించిన తీరు, చెప్పిన డైలాగ్‌ల విధానంపై కోట తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోల దగ్గర్నుంచి నేటి తరం హీరోల చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఘనత కోటదే. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగులో 750 చిత్రాలకు పైగా నటించి చెరిగిపోని ముద్ర వేశారు. తమిళం, కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లో నటించా రాయన. ప్రజానాయకుడిగానూ ప్రజల్లో మంచి స్థానం సొంతం చేసుకున్నారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘హరి హర వీరమల్లు’.
విలక్షణ పాత్రలకు, వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన కోట తన నట జీవితంలో తొమ్మిది నంది పురస్కారాలను అందుకున్నారు. ప్రతిఘటన (1995), గాయం (1993), తీర్పు (1994), లిటిల్ సోల్జర్స్ (1996), గణేష్ (1998), చిన్న (2000), పృథ్వీనారాయణ (2002), ఆ నలుగురు (2004), పెళ్ళైన కొత్తలో (2006) చిత్రాలకు నంది అవార్డులను దక్కించుకున్నారు. అలాగే 2012లో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాకు సైమా అవార్డును అందుకున్నారు. అరుదైన విలక్షణ నటుడిగా సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2015లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సముచితంగా గౌరవించింది.
‘ప్రతిఘటన’లో మినిస్టర్ కాశయ్యగా తనదైన నటనతో ప్రేక్షకుల్ని అబ్బురపరచిన కోట తెలుగునాట ప్రతిభగల నటీనటులకు కొదవ లేదని వాదించిన సందర్భాలు కోకొల్లలు. మనవాళ్ళకి కాకుండా అర్హత లేని పరభాషా నటీనటులకు తెలుగుచిత్ర పరిశ్రమ అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఎన్నోసార్లు బహిరంగంగా చర్చించిన ఏకైక నటుడు కూడా కోటనే.
కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కూతుర్లు, కొడుకు ప్రసాద్ ఉన్నారు. అయితే కొన్నేళ్ళ క్రితం కొడుకు ప్రసాద్ ఓ ప్రమాదంలో చనిపోయారు. అప్పట్నుంచి మానసికంగా కోట బాగా కృంగిపోయారు. అయినప్పటికీ వెండితెరపై ఆ బాధని తెలియనీకుండా అలరించారు. కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుతో కోట శ్రీనివాసరావు ఆంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం మహా ప్రస్థానంలో ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివానం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది.
అరుదైన విలక్షణ నటుడు
ఎన్నో విలక్షణ పాత్రలకు జీవం పోసి తనకు తానే సాటి అని నిరూపించుకున్న కోట శ్రీనివాసరావు మృతికి దేశ ప్రధాని మోడీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు కోట చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు.
– తెలంగాణ ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి
కోట ఒక అపూర్వ నటుడిగా భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘం. ఆయన నట వారసత్వం చిరకాలం గుర్తుండిపోతుంది.
– తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
‘ప్రాణం ఖరీదు’తో ఆయన నేనూ ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఏ పాత్ర అయినా తను మాత్రమే చేయగలడన్నంత గొప్పగా నటించారు. – చిరంజీవి
4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు. తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. – బాలకృష్ణ
మీతో పంచుకున్న క్షణాలు..మీ ప్రేమ, అసమాన ప్రతిభ అన్నింటికిమించి మీ సెన్సాఫ్ హ్యూమర్ అన్నింటిని మిస్ అవుతున్నాం. – నాగార్జున
ప్రియమైన కోట మిమ్మల్ని ఇకపై చాలా మిస్ అవుతాం. మీ ప్రతిభ, మీ ఉనికి, మీ మంచి మనసుని ఎప్పటికీ మరచిపోలేం. – మోహన్‌బాబు
కోట సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన మరణం పరిశ్రమకే కాదు వ్యక్తిగతంగా నాకూ తీరని లోటు.
– మహేష్‌బాబు
కోట శ్రీనివాసరావు.. ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రకి ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. -ఎన్టీఆర్
నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయి’లో కోట ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత ‘గోకులంలో సీత’, ‘గుడుంబా శంకర్’, ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్ సింగ్’ తదితర చిత్రాల్లో కలసి నటించాం. కోట డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. – పవన్‌కళ్యాణ్
కోట మరణ వార్త నన్నెంతో కలచివేసింది. నటనలో నిష్ణాతుడు, పోషించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన లెజెండ్. – దర్శకుడు రాజమౌళి
కోట లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. నటన ఉన్నంతకాలం ఆయన ఉంటారు. కోట నటరాజపుత్రులు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. – బ్రహ్మానందం
సినీ రంగంలో ఉన్న అతికొద్ది మంది గొప్ప నటుల్లో కోట ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటనతో నా సినిమాలు ‘శివ’, ‘గాయం’, ‘మనీ’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’ మరింత ప్రభావవంతంగా వచ్చాయి. అది వెలకట్టలేనిది. కోట మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ, మీ పాత్రలు బతికే ఉంటాయి.
– రామ్‌గోపాల్ వర్మ
ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. నేను, కోట కలిసి ఎన్నో సినిమాల్లో నటించాం. మేం సినిమాల్లోనే కాదు బయట కూడా సరదాగా ఉండేవాళ్ళం. రెండు రోజుల కిందటే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేనొచ్చేసరికి ఆయన లేడు. నా కోటన్న వెళ్ళిపోయాడు. మా జీవితాల్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ కోట భౌతికకాయానికి నివాళి అర్పిస్తూ నటుడు బాబూమోహన్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.