440 కంపెనీల్లో కార్మికుల సమస్యలపై సర్వే చేశాం
ప్రజాసంఘాలతో ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటం
షాహి కార్మికుల విజయంలో సీఐటీయూ పాత్ర క్రియాశీలకం: సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
అనంతలవట్టం ఆనందన్‌నగర్
(విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ హాల్) నుంచి నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్న
తెలంగాణలో మూడంచెల వ్యూహాత్మక విధానాన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నామనీ, సీఐటీయూ, ఏఐకేఎస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త పోరాట కార్యాచరణలో భాగంగా సమన్వయంతో ముందుకు సాగుతున్నామని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య చెప్పారు. అనంతలవట్టం ఆనందన్ నగర్ (విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ హాల్)లో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలో గురువారం తెలంగాణ రిపోర్టును ఆయన ప్రవేశపెట్టారు. జులై 9న జరిగిన సార్వత్రిక సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహించామని తెలిపారు. సింగరేణిలో సీఐటీయూ చొరవతో విస్తృత ప్రచారం చేశామన్నారు.
ఉత్పాదక రంగం, బొగ్గు, నిర్మాణం, రవాణా, స్కీమ్ వర్కర్లు, బీడీ కార్మికులు, ఇలా ప్రతి రంగంలోనూ కార్మికులకు చేరువయ్యేందుకు చేస్తున్న కృషిని వివరించారు. తెలంగాణలోని 63 పారిశ్రామిక క్లస్టర్లలో 55 క్లస్టర్లకు క్యాడర్‌ను కేటాయించామనీ, 440 కంపెనీల్లోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడానికి సర్వే నిర్వహించామని తెలిపారు. కనీస వేతనాల కోసం పది రోజుల పాటు జీపు జాతా నిర్వహించామనీ, రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి 28 కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ముగింపుగా లేబర్ కమిషనరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టామని వివరించారు. యూనియన్లు లేని గ్లాండ్ ఫార్మా, సింజెంటా వంటి ఆధునిక పరిశ్రమల్లో కూడా యజమాన్యాలు కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సి వచ్చిందనీ, దానిలో సీఐటీయూ కృషి ఉందని తెలిపారు.
శాండ్విక్ కంపెనీలో మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీసవేతనం కంటే అదనంగా నెలకు రూ.7,450 పెంచడానికి అంగీకరించిందనీ, చార్మినార్ బీర్ ఫ్యాక్టరీలోని కాంట్రాక్ట్ కార్మికులు కూడా యూనియన్ సహాయంతో సమ్మెకు వెళ్లి, రెగ్యులర్ కార్మికులతో సమానంగా వేతనాలు పెంచుకున్నారని ఆయన గుర్తుచేశారు. రాంకీ మేనేజ్‌మెంట్ కింద ఉన్న 1,850 మంది రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులను ఒకే యూనియన్ కింద ఏకం చేసి, సమ్మె నిర్వహించి విజయవంతమైన ఒప్పందం కుదుర్చుకున్న అనుభవం రాష్ట్రంలో ఉందని ప్రస్తావించారు. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, డిఫెన్స్ రంగాల్లో 32 ఆధునిక పరిశ్రమలున్న ఒక పారిశ్రామిక ప్రాంతంలో యూనియన్లు లేని నాలుగు కంపెనీల్లో యాజమాన్యాలు త్రైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. బొగ్గురంగం సింగరేణి కాలరీస్‌లో స్థానిక సమస్యలపై మంచి పని జరుగుతోందన్నారు.
”సిగాచీ’ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలి 48 మంది కార్మికులు చనిపోయారు. రెండు మృతదేహాలు దొరకలేదు. సీఐటీయూ నాయకులు అదే రోజున ఘటనా స్థలాన్ని సందర్శించారు. యూనియన్ వాలంటీర్లు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికీ రూ.5 వేల చొప్పున విరాళం అందించారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో పోరాటం చేశాం. బాధితులను ఆదుకోవాలనే ఆందోళనతో రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఘటనా స్థలాన్ని సందర్శించి తమ డిమాండ్లను అంగీకరించారు. ఆ కంపెనీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ జోక్యం కార్మికులపై ప్రభావం చూపింది. ఆ ప్రచార ప్రభావంతో ఆ పారిశ్రామిక ప్రాంతంలో ఒక కొత్త యూనియన్ నమోదైంది.
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం నాలుగేండ్లుగా సుధీర్ఘ పోరాటాన్ని ఇతర ప్రజాసంఘాలతో కలిసి పోరాట వేదిక ఏర్పాటు చేసి 20 జిల్లాల్లో 69 కేంద్రాల్లో 23,570 గుడిసెలు వేశాం’ అని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పోరాటాలను వివరించారు. ‘గత నెలలో ‘షాహి’ అనే గార్మెంట్ ఎగుమతి కంపెనీలో 12 రోజుల పాటు జరిగిన సమ్మె విజయవంతంగా ముగిసింది. అక్కడ 16 ఏండ్లుగా పని చేస్తున్న 1500 మంది మహిళా కార్మికులు, ఏ యూనియన్ లేకపోయినా తమంతట తామే బయటకు వచ్చి సమ్మె చేశారు. వారు యాజమాన్యం దోపిడీనీ, వేధింపులను సహించలేకపోయారు. వారిలో సగం మంది వలస వచ్చిన మహిళలే.
గతంలో యాజమాన్యం నాయకులను కొనుగోలు చేసి, రెండుసార్లు యూనియన్లను విచ్ఛిన్నం చేసిన అనుభవం ఉంది. ఈ సారి కార్మికులు కంపెనీ ముందు పగలూ రాత్రి తేడా లేకుండా రెండ్రోజులపాటు రోడ్డుపై కూర్చున్నారు. ఆ తర్వాత వారు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడే కూర్చున్నారు. ఈ పోరాటంలో సీఐటీయూ జోక్యం క్రియాశీలకంగా మారింది. సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకత్వంలో పవర్‌లూమ్ కార్మికుల నెల రోజుల సుధీర్ఘ సమ్మె విజయవంతంగా ముగిసింది. గిగ్ వర్కర్ల మధ్య, ముఖ్యంగా ప్లాట్‌ఫామ్ వర్కర్ల మధ్య సర్వే నిర్వహించాం. వ్యవసాయేతర గ్రామీణ కార్మికులపై కూడా విస్తృతమైన సర్వే చేశాం. దీంతో పాటు తెలంగాణలో సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం’ అని ఆయన పోరాట రూపాలను వివరించారు.



