Sunday, November 9, 2025
E-PAPER
Homeసోపతిలోక సంచారి… కథల విహారి…

లోక సంచారి… కథల విహారి…

- Advertisement -

పేదరికం సంకల్పానికి… సృజనకు అడ్డు కాదు. సాధించాలన్న తపన, కోరిక, ఆసక్తి, కృషి ఉంటే అది అసాధ్యం కాదని అనేక మంది అనేక సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘బాల’ సాహితీవేత్త కథ కూడా అటువంటిదే. కనీస వసతులు అంటే, ఇల్లు, ఇతర వసతులు, రాసుకునేందుకు కుర్చీ, టేబులు ఇలా ఏవీ తనకు అందుబాటులో లేకున్నా, గుడారంలో నివసిస్తున్నా వాటన్నింటిని అధిగమించి రచనారంగంలో రాణించి నిలిచిన బాల సృజనకారుడు ఆవుల పోతరాజు.

చిరంజీవి పోతురాజు తల్లితండ్రులు శ్రీమతి ఆవుల తిరుపతమ్మ – యాకయ్య. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లోని టేకులపల్లి గ్రామం. పోతరాజు జనవరి 01, 2008న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పుట్టాడు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నాడు. తల్లితండ్రులు సంచార వృత్తిజీవనానికి చెందిన గంగిరెద్దులతో జీవనం సాగిస్తున్నారు. నిజానికి సంచార జీవనంలో భాగంగా రోజుకొక ఊరిలో ఉండే వీళ్ళు కొడుకు చదువు కోసం సత్తుపల్లిలో ఊరి బయట గుడారం వేసుకుని ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పోతురాజు తొమ్మిదవ తరగతిలోనే రచన పట్ల ఆసక్తిని, సాహిత్యంపట్ల అభిరుచిని పెంచుకున్నాడు. టీచర్‌ రమాదేవి ప్రోత్సాహంతో వేమన శతకాన్ని నేర్చుకుని ‘వేమన శకతం అవధానం’ నిర్వహించి జిల్లా విద్యాధికారి ఆశీస్సులు, అభినందనలు అందుకున్నాడు. ఈ అవధానం ‘గార్లపాటి-బోలేపల్లి ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంఘటన పోతరాజును సాహిత్య రంగం వైపుకు మరల్చింది. ఖమ్మం బాల సాహిత్య వికాసకారుడు షఫీ సంకలనం చేసిన కథా సంకలనం కోసం ‘కష్టేఫలి’ అనే తొలి కథను రాశాడు. ఇది ‘ఖమ్మం జిల్లా కథల పల్లకి’లో అచ్చయ్యింది. ఆ స్ఫూర్తితో కథా రచనను తనకు ఇష్టమైన పనిగా చేసుకున్న పోతరాజు చక్కని కథను రాశాడు.

వేసవి సెలవుల్లో తనకు తారసపడ్డ అంశాలు, ఇతివృత్తాలను కథలుగా మలిచి, ‘నాన్నే నా హీరో’ పేరుతో సంపుటిగా గార్లపాటి-బోలేపల్లి ట్రస్టు చొరవతో పుస్తకంగా తెచ్చాడు. అందుకు తొలి నుండి అతనిని ప్రోత్సహించిన రమాదేవి టీచర్‌ ఆశీస్సులు, మార్గదర్శనం తోడయ్యాయి. ఇందులోని తొలికథ అయిన ‘నాన్నే నా హీరో’ పేరును ఈ కథా సంపుటికి పెట్టారు. ఇందులోని అశం చిన్నదే, కాని రాసిన విధానం బాగుంది. ఇందులోని రోహన్‌ వాళ్ళ నాన్నతో బజారుకు వెళ్ళినప్పుడల్లా దుకాణంలో కనిపించే ప్రతి వస్తువు తనకు కావాలని మారాం చేసేవాడు. ప్రతిసారి తండ్రి సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇలా చాలా సార్లు జరిగింది. తన తండ్రి పిసినారి అని, ఏదీ కొనివ్వడని, తనకోసం ఖర్చుచేయడని అనుకుంటున్న సందర్భంలో ఒక ప్రమాదంలో రోహన్‌ కాలు విరుగుతుంది. అసుపత్రిలో చేర్పించి వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చుచేస్తాడు. దాంతో పిసినారి అనుకున్న తన తండ్రి తనకోసం ఏదైనా చేస్తాడని తెలుసుకుంటాడు. ‘నిజానికి జేబులో డబ్బులు ఉండి, తనకు నచ్చిన వస్తువు కనిపించినా కొనుక్కోలేని వ్యక్తి పిసినారి కాడు, అతన్ని ‘నాన్న’ అంటారు’ అన్న ఇందులోని వాక్యం అందరు తండ్రులకు వర్తిస్తుంది.

ఇందులోని మరోకథ ‘టోబియా’. ఈ పేరు గమ్మత్తుగా ఉంది కదూ! టోబియా ఒక విద్యార్థి పేరు. తోటి విద్యార్థులు ‘టోపీ.. టోపీ’ అని ఎగతాళి చేస్తుంటారు. అది విని టోబియా బాధపడతాడు. టీచర్‌కు టోబియా తోటి విద్యార్థులపై పిర్యాదు చేస్తాడు. టీచర్‌ విద్యార్థులను పిలిచి మందలిస్తాడు. అయినా వారిలో మార్పు రాదు. ఇదే విషయం తల్లితో చెప్పి బాధపడతాడు. తన పేరును ఎగాతాళి చేస్తున్నారు, తనకు ఆ పేరెందుకు పెట్టావని అడగగా, గ్రీకు భాషలో టోబియా అంటే ‘దేవుడు మంచివాడు’ అని అర్థం. నీవు దేవుడంత మంచివాడిగా ఉండాలని ఆ పేరు పెట్టానని అంటుంది. ఆ విషయం తెలిసి ఇక తోటి విద్యార్థులు తనను ఎంతగా ఆట పట్టించినా పట్టించుకోడు. టీచర్‌ టోబియా అనే పదం అర్థాన్ని చెప్పగానే విద్యార్థులందరూ ఆ రోజు నుండి ఆటపట్టించడం మానేస్తారు.
ఇందులోని మరో మంచికథ ‘చెరువు చోరి’.

పోతరాజు శీర్షికను ఎంచుకోవడంలోనే వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. వర్షాకాలం ఇండ్లలోకి వరద నీరు చేరుతుంది. కిరణ్‌ వాళ్ళ ఇల్లు వరద నీటిలో నాని కూలిపోతుంది. అక్కడున్నవన్నీ వరదలో నాశనం అయిపోతాయి. తరువాత విచారణలో వీళ్ళు చెరువును ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారని తేలుతుంది. చెరువును ఆక్రమించి ఇల్లు కట్టుకుని తాను చేసిన తప్పును అధికారుల ముందు ఒప్పుకుంటాడు కిరణ్‌ వాళ్ళ నాన్న. అధికారులు మందలించి మరోచోట ఇల్లు కట్టుకునేందుకు సహాయం చేస్తారు. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అద్దం పడుతుంది. ఇలా తనకు తారసపడిన, ప్రతి అంశాన్ని సంఘటనలను కథలుగా మలిచిన ఇతను రచనలోనే కాదు, చదువులోనూ ప్రతిభావంతుడుగా నిలిచాడు. బడి దశలోనే చక్కని కథలను రాసిన పోతరాజు మరిన్ని మంచి కథలనురాయాలని కోరుకుందాం.

  • డా|| పత్తిపాక మోహన్‌
    9966229548
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -