– కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి : ఏఐఆర్‌టీడబ్యూఎఫ్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్
నవతెలంగాణ – ముషీరాబాద్
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఏఐఆర్‌టీడబ్యూఎఫ్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ట్రాన్స్‌పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.కోటయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంధన ధరల భారంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీం అమలు కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాదికిó తీవ్ర నష్టం కలుగుతోందని, దీనివల్ల వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే డ్రైవర్లకు నెలకు రూ.4,500 జీవనభృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతోపాటు వాహనాల ఈఎంఐలు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్ ఖర్చులు భారీగా పెరిగాయని తెలిపారు. అదే సమయంలో ఆదాయం తగ్గిపోవడం కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
ఓలా, ఉబెర్, ర్యాపిడో, పోర్టర్, స్విగ్గి, జొమాటో వంటి యాప్ ఆధారిత సంస్థలు అధిక కమీషన్లు వసూలు చేస్తూ డ్రైవర్లను దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ప్రయివేటు యాప్‌లను రద్దు చేసి ప్రభుత్వ యాప్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం కోల్పోయిన లేదా గాయపడిన డ్రైవర్లకు సరైన భద్రతా వ్యవస్థ లేకపోవడం ఆందోళనకరమని, ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. ఆటో మీటర్ చార్జీలు పెంచడంతోపాటు క్యాబ్ కిరాయి రేట్లు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రవాణా కార్మికులందరూ ఐక్యంగా పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కృష్ణ, ముఖేష్, రవి, ప్రేమాజీ, రాములు, లావణ్య, ఆసిఫ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



