కాలం మారుతుంది. ఏనాటికైనా మార్పు దిశగా అడుగులు పడతాయి. దీనికి నిదర్శనంగా ఇటీవల రెండు వేర్వేరు దేశాల న్యాయస్థానాలు రెండు గొప్ప తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్న మహిళలకు ఓ భరోసాను ఇచ్చాయి. ఆ తీర్పులు ఏమిటో ఆ వివరాలు ఏంటో ఈరోజు మానవిలో తెలుసుకుందాం…
మొెదటి తీర్పు మార్చి 21 యుఏఇ మదర్స్ డే రోజున దుబాయి క్రౌన్ ప్రిన్స్ అలాగే యూఏఇ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు డిఫెన్స్ మినిస్టరైన His Highness Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం. ప్రపంచ దేశాలకు భిన్నంగా యుఏఇలో మదర్స్ డేను ప్రతి ఏడాది మార్చ్ 21 స్ప్రింగ్ ఈక్వినాక్స్ (spring equinox) మొదలయ్యే రోజున మాతృదినోత్సవం జరుపుకుంటారు. అలాగే ఈ 2026 మార్చ్ 21 యూఏఇ మడర్స్ డే రోజు అమ్మలందరికి మాతృ దినోత్సవ కానుకగా దుబాయి క్రౌన్ ప్రిన్స్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను తీర్చిదిద్దేది అమ్మలే కనుక హౌస్ వైఫ్ అన్న పదాన్ని Generation Shaperగా మారుస్తూ ఇకపై ఎమిరేట్స్ ఐడిలో కూడా హౌస్ వైఫ్ అన్న పదం బదులుగా జనరేషన్ షేపర్ అన్న పదం ఉంటుందని నిర్ణయించడం యూఏఈలోని మహిళలందరూ సంతోషించాల్సిన విషయం.
మహిళలకు ఓ భరోసా
ఇంటిపట్టున ఉంటూ ఒక భార్యగా, అమ్మగా అన్ని పనులు చేస్తున్నా ఏమీ చేయటం లేదనే చులకన భావానికి గురయ్యే ఆడవాళ్లకు ఇది పెద్ద ఊరట. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నPrince Sheikh Hamdanకు యుఏఇలోని మహిళలందరూ కృతజ్ఞతలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియా మొత్తం దుబాయి ప్రిన్స్‌కు థాంక్స్ చెప్తున్న పోస్టులతో నిండిపోయింది. ఈ నిర్ణయం అరబ్బు మహిళల జీవితాల్లోనే కాక అక్కడ ఉపాధి కోసం వలస వెళ్లిన ఇతర దేశాల మహిళలకు కూడా భరోసాను, మానసిక స్థైర్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
భార్యంటే…
ఇక రెండవది ‘భార్యంటే పనిమనిషి కాదు.. జీవిత భాగస్వామి’ అంటూ ఇండియాలో సుప్రీంకోర్టు వెలువరించిన విప్లవాత్మక తీర్పు. స్త్రీలందరూ ఏ కులమైనా కానీ, మతమైనా కానీ తరతరాలుగా పీడనకు, దోపిడీకి గురవుతున్నవారే. ఒకరి కింద బానిసగా పనిచేసే మగవాడు ఇంట్లో తన భార్యను బానిసగా చూస్తాడు. అతను ఒకనికి బానిస. ఆమె అతనికి బానిస అన్నట్టు. ఇదంతా అక్షర జ్ఞానం లేని కాలంలో అయితే సరిపుచ్చుకుందాం. స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న నేటి ఆధునిక కాలంలో కూడా భార్యనే తమ పనులన్నీ చేయాలని గొడవపడే మగవాళ్లుండటం సిగ్గుపడే విషయం. భార్య దాసిలా సేవలు చేస్తుంటే చూడాలనుకునే శాడిజం ఉన్న భర్తలు సమాజంలో చాలా మంది. ఆమె ఉద్యోగం చేయాలి, ఇంటిపని, వంటపని, పిల్లలను చూసుకోలి. ఇతను మాత్రం ఇంటి పని చేయడు. తమ పనులు తాము స్వయంగా చేసుకోలేకపోవడం ఒక మానసిక దౌర్బల్యం.
ఆమె శ్రమకు విలువ ఏది?
భార్య ఎంత ఓపిగ్గా సర్దుకుపోతున్నా కావాలని గొడవలు పడే భర్తలు ఎంతోమంది. ఏదైనా అవసరం వచ్చి డబ్బులడిగితే ‘నీకెందుకు డబ్బులు నేను తెచ్చి పడేస్తున్నా కదా’ అంటారు. ఇలా ఆర్ధిక ఆలంబన లేక లోలోపల కుమిలిపోయే గృహిణులు ఎంతోమంది. కుటుంబంలోని అందరూ ఆమెను, ఆమె శ్రమను గ్రాంటెడ్‌గా తీసుకునేవాళ్లే. ఇతను బయటకెళ్ళి ఎదో ఒక పని చేసినందుకు ఇతనికి జీతం వస్తుంది. ఆమె శ్రమకు ఏ జీతమూ ఉండదు. ‘ఏం చేసినా పడి ఉంటుందిలే ఎక్కడికి పొతుంది’ అన్న నిర్లక్ష్యపు ధోరణి మగవాళ్లకు. అందుకే భార్యంటే భర్తకు ఒక చులకన భావం. ఎలక్ట్రానిక్ కరెన్సీ విస్తృతంగా వాడకంలోకి వచ్చాక మహిళలు డొమెస్టిక్ అబ్యూజ్‌తో పాటు ఫైనాన్షియల్ అబ్యూజ్ కూడా ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం.
కట్టడి చేస్తూనే ఉన్నారు
కాలం మారినా ఆధునిక యుగంలోకి అడుగులు పడుతున్నా పురుషుల బుద్ధి మారదు. అసలు ఆమె ఒక మనిషని, పెళ్లికి ముందు ఆమెకు ఎన్నో కలలుండేవని, తర్వాత ఆమె తన కలలన్నిటినీ సమాధి చేసి జీవచ్ఛవంలా బతుకుతుందనే నిజం మగవాడికి అర్థమైతే, ఆమె కూడా తన కలలను, లక్ష్యాలను సాధించడానికి భర్త తోడ్పాటునందిస్తే ఎంత సంతోషంగా ఉంటాయి జీవితాలు. ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలున్నా ఆ చదువు, తెలివి ఇంటి పనులకే పరిమితమైతే ఇక ఎందుకీ చదువులు అని మానసికంగా బాధపడే ఆడవాళ్లు చాలా మంది మన చుట్టూ ఉన్నారు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఆమెను ఉద్యోగం చేయనివ్వకుండా, ఇంటి గడప దాటకుండా కట్టడి చేయాలని చూస్తున్న మగవాళ్ళున్నారంటే వాళ్ళెంతటి వెనుకబాటు తనంలో ఉన్నారో, ఆమె తమను మించి ఎక్కడ ఎదుగుతుందో అనుకుంటూ ఎంత మానసిక రుగ్మతతో బతుకుతున్నారో అర్థమవుతుంది. నార్సిస్టిక్ మేల్ ఈగో స్త్రీని ఒక బానిసగా తప్ప ఉన్నతంగా చూడనివ్వదు. అందుకే ఈ ప్రపంచమిట్లా ఆడవాళ్ల బాధలతో నిండిపోయి ఉంది. ఎక్కువ శాతం మహిళలు సమాజం ఏమనుకుంటుందో, పరువు పోతుందనో, పిల్లల కోసమో భర్తలు పెట్టే హింసను మౌనంగా భరిస్తుంటారు. కొందరు మాత్రమే తమ సమస్యలపై పోరాటం చేస్తారు. అవసరమైతే చట్టాన్ని, న్యాయాన్ని ఆశ్రయిస్తున్నారు.
మగవాళ్లు మారాలి
మన దేశ చట్టం, న్యాయం మహిళల హక్కులను నిలబెట్టేది కావడం మన రాజ్యాంగం గొప్పదనం. గత నెలలో సుప్రీం కోర్టు ముందుకు వచ్చిన ఒక కేసే ఇందుకు ఉదాహరణ. ఉద్యోగస్థులైన భార్యాభర్తలిద్దరికీ ఇంటిపనులు పంచుకోవడంలో మనస్పర్థలు రావడంతో భర్త తన భార్యపై కేసు వేసాడు. భార్య బట్టలుతకటం లేదని, అంట్లు తోమటం లేదని, వండి పెట్టటం లేదని కోర్టులో కేసు వేశాడు. మొదట హైకోర్టులో వాదనలు జరిగి తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది ఆ కేసు. కేసును విచారించిన సుప్రీంకోర్టు ‘భార్యంటే పనిమనిషి కాదు. ఆమె జీవిత భాగస్వామి. ఇంటిపని, వంటపని వంటి పనులన్నీ భర్త కూడా చేయాలి. కాలం మారింది. కాలంతో పాటు మగవాళ్లు కూడా మారాలి’ అని తీర్పు చెప్పింది సుప్రీం కోర్టు.
మేల్ ఈగోకి చెక్ పెడుతూ…
ఈ మధ్యనే మార్చి 2026లో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు విచారణకు వచ్చిన ఒక కేసులో జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్ కింది సూచనలు చేశారు. ఇప్పుడు పాతకాలం రోజులు కావని, పెళ్లి చేసుకున్నది పనిమనిషిని కాదు జీవిత భాగస్వామిని కనుక ఇంటిపని వంటపని లాంటి పనులు భార్యా భర్తలిద్దరూ కలిసి సమానంగా పంచుకోవాలని సూచించారు. తమ పనులు తాము సొంతంగా చేసుకోకుండా సోమరులుగా తయారైన మేల్ ఈగోకి చెక్ పెడుతూ మన దేశ అత్యున్నత న్యాయస్థానం గొప్ప తీర్పునిచ్చింది. ఈ తీర్పును దేశంలోని మహిళలందరూ ఆనందంగా స్వాగతించడం విశేషం. అటు ఇండియాలో, ఇటు యుఏఇలో మహిళల కోసం తీసుకున్న ఈ రెండు గొప్ప చట్టపరమైన నిర్ణయాలు అటు ఉద్యోగస్థులైన, ఇంట్లో గృహిణిగా ఉంటూ డొమెస్టిక్, ఫైనాన్షియల్ అబ్యూజింగ్ ఎదుర్కొంటున్న స్త్రీల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయని ఆశిద్దాం.
– శైలజ బండారి
భార్యంటే పని మనిషి కాదు జీవిత భాగస్వామి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



