– గర్భసంచి ఆపరేషన్‌కు బదులు మూత్రనాళం కట్
– రెండు సార్లు ఆపరేషన్
– బంధువుల ఆందోళన .. రూ.6లక్షల పరిహారం చెల్లింపు
నవతెలంగాణ-నల్లగొండటౌన్
గర్భసంచి ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరితే.. వైద్యులు ఏమరుపాటుగా వ్యవహరించి మూత్ర నాళం కట్ చేశారు.. పొరపాటును గమనించి మళ్లీ గర్భసంచి ఆపరేషన్ చేశారు.. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై ఆ మహిళ మృతిచెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది.. ఆ పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఈ ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసి ఆస్పత్రిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగోమ్మ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పులికంటి రమణమ్మ(42) ఈనెల 19న గర్భసంచి ఆపరేషన్ కోసం నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న తులసి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. వైద్యులు సర్జరీ సమయంలో మూత్రనాలం కట్ చేశారు. మళ్లీ గర్భసంచి ఆపరేషన్ చేశారు. దీంతో ఆ మహిళకు తీవ్ర రక్త స్రావం అయింది. పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు సంతానం. విషయం తెలుసుకున్న పలు దళిత సంఘాల నేతలు ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. రెండు సార్లు సర్జరీ చేయడం వల్లే వైద్యం వికటించి రమణమ్మ మృతిచెందిందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. దీంతో వన్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. ఆస్పత్రి యాజమాన్యం దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి ఆరు లక్షల రూపాయలు పరిహారం ఇప్పించారు.
జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డాక్టర్
పై విషయంపై ఆస్పత్రి ఎండీని వివరణ కోరగా.. ”నేనేం చెప్పను. మీతోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరేం రాసుకుంటారో రాసుకోండి. నా వద్ద పేషెంట్‌కు సంబంధించిన పూర్తి రికార్డు ఉంది. నాకేం కాదు..” అంటూ విలేకరుల పట్ల దురుసుగా మాట్లాడారు.
ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



