నవతెలంగాణ మేడ్చల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బడికోల్ భాస్కర్ రెడ్డి కుటుంబం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జమున వెంచర్ లో నివాసముంటోంది. భాస్కర్ రెడ్డి కుమారుడు అజయ్ రెడ్డి(21) డిగ్రీ చదువుతూ తండ్రి నిర్వహించే వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
గురువారం దసరా పండుగ సందర్భంగా కాళకల్‌లో ఉన్న స్నేహితులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా రేకుల బావి ప్రాంతానికి సమీపంలో వాహనం అదుపు తప్పి, గుంతలో పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.