ఛేదనలో ఓపెనర్ అజేయ సెంచరీ
హిమాచల్‌పై హైదరాబాద్ గెలుపు
నడాన్ (హిమాచల్ ప్రదేశ్)
ఓపెనర్ అభిరాత్ రెడ్డి (175 నాటౌట్, 200 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగటంతో హిమాచల్ ప్రదేశ్‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో హిమాచల్‌పై హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 344 పరుగుల లక్ష్యాన్ని 75.3 ఓవర్లలో 347 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి హైదరాబాద్ ఛేదించింది. తన్మరు అగర్వాల్ (5) నిరాశపరిచినా.. ఓపెనర్ అభిరాత్ రెడ్డి, రాహుల్ రాడేశ్ (66, 127 బంతుల్లో 8 ఫోర్లు) రెండో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో విజయానికి గట్టి పునాది వేసుకున్న హైదరాబాద్‌ను..మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ముందుకు నడిపించారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (24), హిమతేజ (33), తనరు త్యాగరాజన్ (29) విలువైన పరుగులు జోడించారు. రోహిత్ రాయుడు (2 నాటౌట్) జతగా లాంఛనం ముగించిన అభిరాత్ రెడ్డి.. సీజన్లో హైదరాబాద్‌కు తొలి విజయాన్ని అందించాడు. అభిరాత్ రెడ్డి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. హిమాచల్ ప్రదేశ్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 318, 303 పరుగులు చేయగా.. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసింది.
ఈ విజయంతో 4 పాయింట్లు సాధించిన హైదరాబాద్ ఓవరాల్‌గా 10 పాయింట్లతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలువగా.. ముంబయి రెండో స్థానంలో నిలిచింది. ఈ నెల 8న హైదరాబాద్‌లో జరుగనున్న తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో హైదరాబాద్ తలపడనుంది.



