Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅవినీతి అధికారులపై ఏసీబీ పంజా

అవినీతి అధికారులపై ఏసీబీ పంజా

- Advertisement -

సోదాల్లో రూ.96 కోట్లకు పైగా అక్రమాస్తులు జప్తు
రూ.57 లక్షలకుపైగా నగదుతో పట్టుబడిన ఉద్యోగులు
2026లో లంచావతారులపై మరింత నిఘా : 2025 ఏసీబీ వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీ చారుసిన్హా

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో లంచావతారులు, అవినీతి తిమింగలాలపై 2025లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విస్తృతంగా పంజా విసిరింది. ముఖ్యంగా అక్రమంగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన అధికారుల ఇండ్లల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించి రూ.96 కోట్లకుపైగా అక్రమాస్తులను జప్తు చేసింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న చీఫ్‌ ఇంజినీర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. మరోవైపు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి తిమింగలాల నుంచి రూ.57 లక్షలకు పైగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చారుసిన్హా 2025లో తాము సాధించిన విజయాలు, భవిష్యత్‌ ప్రణాళికపై బుధవారం ఒక నివేదికను విడుదల చేశారు. 2026లో రాష్ట్ర ప్రగతికి అడ్డుగా నిలుస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులపై మరింత నిఘాను పెంచుతామని ఆమె ప్రకటించారు. 2025లో ఏసీబీ సాధించిన ప్రగతి వివరాలు చారుసిన్హా తెలిపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.

మొత్తం 199 కేసులలో 273 మంది నిందితులు అరెస్టయ్యారు. అవినీతి ఆరోపణల్లో 26 రెగ్యులర్‌ ఎంక్వైరీలను ఏసీబీ నిర్వహించింది. సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, ఆర్టీఐ చెక్‌పోస్ట్‌లు, వివిధ సంక్షేమ హాస్టళ్లు వంటి వివిధ కార్యాలయాల్లో 54 ఆకస్మిక తనిఖీలు జరిగాయి. నిందితుల ప్రాసిక్యూషన్‌, చార్జిషీట్ల నమోదు కోసం ప్రభుత్వం నుంచి 115 శాంక్షన్‌ ఆర్డర్లను ఏఏసీబీ పొందింది. 158 ట్రాప్‌ కేసులను నమోదు చేసింది. ఏసీబీ మొత్తం రూ.57,17,500 సీజ్‌ చేసిందనీ, ఇందులో రూ.35,89,500 ఫిర్యాదుదారులకు రీయింబర్స్‌ చేసింది. 15 కేసుల్లో రూ.96,13,50,554 విలువైన అక్రమ ఆస్తులను కనుగొని, జప్తు చేసినట్టు వార్షిక నివేదిక పేర్కొన్నది. ఎవరైనా పబ్లిక్‌ సర్వెంట్‌ లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064ను సంప్రదించవచ్చని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -