Tuesday, March 17, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

- Advertisement -

– అనధికార నిర్మాణాలు, ట్రేడ్‌ లైసెన్సులు
– పన్నుల అంచనాల్లో లోపాలు వెలుగులోకి..
నవతెలంగాణ-కామారెడ్డి

కామారెడ్డి మున్సిపాలిటీలో సోమవారం ఉదయం 10 గంటలకు మామూలు వ్యక్తులుగా వచ్చి మున్సిపల్‌లోకి ప్రవేశించిన ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్‌ రేంజ్‌కు చెందిన ఏసీబీ బృందం మున్సిపల్‌ కార్యాలయంలో రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్‌ దరఖాస్తులు, కార్యాలయ పనితీరును సమగ్రంగా పరిశీలించింది. ఈ తనిఖీల సందర్భంగా మున్సిపల్‌ పరిపాలనలో పలు లోపాలు బయటపడినట్టు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 2025-26 సంవత్సరాల్లో అనధికార నిర్మాణాలకు సంబంధించి మొత్తం 47 ఫిర్యాదులు వచ్చినప్పటికీ, చాలా కేసుల్లో నోటీసులు జారీ చేసిన తర్వాత నిర్ణీత గడువు ముగిసినా తదుపరి చర్యలు తీసుకోలేదని గుర్తించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 400కు పైగా కమర్షియల్‌ దుకాణాలు ట్రేడ్‌ లైసెన్సులు రిన్యూవల్‌ చేయకుండా కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో సుమారు రూ.కోటి వరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం బకాయిగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రాపర్టీ పన్ను అంచనాల్లో తేడాలు ఉన్నట్టు ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ ఫీల్డ్‌ వెరిఫికేషన్‌లో గుర్తించారు. ఈ కారణంగా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు. మున్సిపల్‌ అధికారుల వాహనాల వినియోగానికి సంబంధించి ప్రతి నెలా రూ.12.40 లక్షలు ఇంధన ఖర్చులుగా కేటాయిస్తున్నప్పటికీ, వాటికి సంబంధించిన సరైన రికార్డులు నిర్వహించలేదని గుర్తించారు. ఈ అంశంపై మరింత లోతైన విచారణ అవసరమని అధికారులు తెలిపారు. కొంతమంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కొన్ని రోజులు గైర్హాజరు అయినప్పటికీ, జీతాల రికార్డుల్లో మాత్రం పూర్తి నెల జీతాలు పొందినట్టు చూపిన అంశం ఈ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. డిసెంబర్‌ 2025 నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీలో మొత్తం 169 బిల్డింగ్‌ అనుమతి దరఖాస్తులు అందగా, అందులో 18 దరఖాస్తులు నిర్ణీత 21 రోజుల గడువును మించి పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇది దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం, నిర్ణయాల లోపాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి సంబంధిత మున్సిపల్‌ అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయనున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -