– రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
– ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు
నవతెలంగాణ-జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సతీష్ రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని నిమ్జ్ నందు వ్యవసాయ భూమిని కోల్పోయిన రైతులకు రూ.52 లక్షల పైచిలుకు డబ్బులకు సంబంధించిన చెక్కు ఇచ్చేందుకు ఆర్డీఓ రామ్‌రెడ్డికి చెందిన అధికారిక డ్రైవర్ దుర్గయ్య నుంచి గత రెండు మూడు నెలల నుంచి బేరసారాలు జరుపుతున్నారు. చెక్కులు త్వరగా ఇప్పించేందుకు మొదట రూ. 4 లక్షలు డిమాండ్ చేసిన దుర్గయ్య చివరికి లక్ష రూపాయలకు ఒప్పుకున్నారు.
అందులో భాగంగా గురువారం స్థానిక నిమ్జ్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సతీష్ రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి తన వాటా రూ.50 వేలు తన ఇంటి వద్ద ఇవ్వాలని బాధితులకు తెలిపినట్టు తమ వద్ద రికార్డులు ఉన్నాయని ఏసీబీ సుదర్శన్ తెెలిపారు. నిందితులు డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డీల్ కుదిర్చిన ఆర్డీవో అధికారిక డ్రైవర్ దుర్గయ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎవరైనా లంచం అడిగితే నేరుగా ఏసీబీని సంప్రదించాలని డీఎస్పీ సుదర్శన్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.