Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅటవీశాఖలో ఏసీబీ దాడులు

అటవీశాఖలో ఏసీబీ దాడులు

- Advertisement -

రూ.3.51లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఫ్‌డీఓ డివిజనల్‌ మేనేజర్‌, ప్లాంటేషన్‌ మేనేజర్‌ : మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ రమేష్‌

నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలోని తెలంగాణ ఫారెస్టు డెవలప్‌మెంట్‌ కార్యాలయం (ఎఫ్‌డీఓ)లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి కాంట్రాక్టర్‌ను లంచం అడిగినం దుకు, మధ్యవర్తితో సహా ఇద్దరు ఫారెస్టు డెవలప్‌మెంట్‌ అధికారులపై కేసులు నమోదు చేసినట్టు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌ తెలిపారు. శనివారం కొత్తగూడెంలోని ఎఫ్‌డీఓలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం సమీపంలో ఉన్న జామాయిల్‌ తోటలో కర్రను నరికేందుకు కాంట్రాక్టర్‌కు చెల్లించే బిల్లును శాంక్షన్‌ చేసేందుకు ఎఫ్‌డీఓ డివిజనల్‌ మేనేజర్‌ తాటి శ్రీ శ్రావణి, ప్లాంటేషన్‌ మేనేజర్‌ తాడి రాజేందర్‌ కాంట్రాక్టర్‌ను రూ.3.51లక్షలు లంచం డిమాండ్‌ చేశారు.

ఫారెస్టు పరిధిలోని జామాయిల్‌ తోటలో 32 వేల టన్నుల జామాయిల్‌ కర్ర నరికినందుకు గాను ఫారెస్టు శాఖ కాంట్రాక్టర్‌కు సుమారు రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులో లంచం కింద టన్నుకు రూ.150 చొప్పున చెల్లించాలని అధికారులు డిమాండ్‌ చేయగా.. రూ.90 చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దీనిపై కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో శనివారం సీతాయిగూడెం వద్ద లంచం ఇచ్చేందుకు అధికారులను కాంట్రాక్టర్‌ సంప్రదించగా వారు హైదరాబాద్‌ మీటింగ్‌కు వెళ్లామని, తమకు సంబంధించిన వ్యక్తిని మధ్యవర్తిగా పంపిస్తామని తెలిపారు. మధ్యవర్తిగా సూపర్‌వైజర్‌ కృష్ణయ్య రాగా, అతనికి కాంట్రాక్టర్‌ డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కృష్ణయ్యతోపాటు హైదరాబాద్‌ అటవీశాఖ సమావేశానికి వెళ్లిన ఎఫ్‌డీఓ డివిజనల్‌ మేనేజర్‌ తాటి శ్రీ శ్రావణి, ప్లాంటేషన్‌ మేనేజర్‌ తాడి రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు డీఎస్పీ రమేష్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -